విజయ సారథి.. కేటీఆర్

Thu,December 13, 2018 01:54 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఎన్నికలు ఏవైనా తారక మంత్రం పారాల్సిందే..జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన గులాబీ దండును ముందుండి నడిపించిన కల్వకుంట్ల తారక రామారావు విజయసారథిగా నిలిచారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ఫలితాల్లో జైత్రయాత్ర సాగించడం దాకా అన్నీ తానై నడిపించి తండ్రికి తగ్గ తనయుడు అని కేటీఆర్ మారోమారు నిరూపించుకున్నాడు. గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో 14 స్థానాల్లో గులాబీ పార్టీ పాగా వేయడంలో తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ నేతృత్వంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ కలిసి కూటమిగా ఎన్నికల సంగ్రామంలోకి దిగిన అభ్యర్థుల తరఫున సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, చంద్రబాబు నాయుడు, సినీనటుడు బాలకృష్ణ, ఏపీ మంత్రులు ప్రచారం చేశారు. బీజేపీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, పరిపూర్ణానంద స్వామి వారి అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డారు. పొలికటికల్ టూరిస్టులను ఒక్కరంటే ఒక్కరూ కేటీఆర్ సమర్థవంతంగా ఎదుర్కొని నిలిచారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వ్యూహాలను అక్షరాల పాటించారు. కార్పొరేషన్ ఫలితాల స్ఫూర్తిగా మెజారిటీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేశారు.

మినీ ఇండియా లాంటి నగరంలో ఇతర రాష్ర్టాల నుంచి స్థిరపడిన ప్రజల రక్షణ బాధ్యత నాదేనని, సోదరుడిగా, అన్నగా మీలో ఒకరిగా కేసీఆర్ కుమారుడిగా అండగా ఉంటానంటూ ప్రజలందరిలో భరోసా నింపుతూ అడుగులు వేశారు. శివారు మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపిక మొదలు, ప్రచారంలో చంద్రబాబు నాయుడు కవ్వింపు చర్యలు, అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న ఆంధ్రా, తెలంగాణ ప్రజల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా కేటీఆర్ మాత్రం తనదైన శైలిలో అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. మన హైదరాబాద్- మనందరీ హైదరాబాద్ ఆత్మీయ సమావేశాలతో అన్ని వర్గాల ప్రజల మద్దతును కూడగట్టమే కాకుండా వారం రోజుల పాటు 14 నియోజకవర్గాల్లో రోడ్ షోలతో ఎన్నికల ప్రచారంలో చుట్టేశారు. నాలుగున్నరేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో చేపట్టిన అభివృద్ధి-సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ రోడ్ షోలు నిర్వహించారు. సంక్షేమం, అభివృద్ధి చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే మద్దతిస్తామంటూ ప్రజానీకం ముక్తకంఠంతో చెప్పిన పరిస్థితి.

మెజారిటీ స్థానాల్లో పాగా
జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో చాలా డివిజన్లలో సంస్థాగతంగా బలపర్చుతూ దాదాపు 120 డివిజన్లలో 135 చోట్ల ప్రసంగాలతో గ్రేటర్ హైదరాబాద్‌ను కేటీఆర్ చుట్టుముట్టి వచ్చారు. విశ్వనగర సాధనకు తామేమి చేస్తామో కేటీఆర్ ప్రతి చోటా సోదాహరంగా వివరించారు. 99 చోట్ల జయకేతనం ఎగురవేసి మేయర్ స్థానాన్ని దక్కించుకోవడంలో ముఖ్యపాత్ర పొషించారు. ఇదే తరహా శాసనసభ ఎన్నికల్లోనూ కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. పార్టీ అసంతృప్తులను ఒక్కతాటి పైకి తీసుకురావడమే కాదు రోడ్ షోలతో అభ్యర్థుల గెలుపును సునాయసం చేశారు. ఉప్పల్, కంటోన్మెంట్, మహేశ్వరం, ఎల్బీనగర్, కంటోన్మెంట్, సికింద్రాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, గోషామహల్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, అంబర్‌పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున రోడ్ షోలు నిర్వహించారు. రోడ్ షోలకు ఎటు చూసినా జనప్రభంజనమే. ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనే తేడా లేకుండా జనం వెల్లువలా తరలివచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలు, బైక్‌ర్యాలీల ద్వారా సభాస్థలాలకు చేరుకున్నారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంత్రి కేటీఆర్ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో గులాబీ పార్టీ పాగా వేయడం గమనార్హం.

సంక్షేమం గట్టుకు ప్రజామోదం
రోడ్ షోలో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రసంగంలో రంగస్థలం సినిమాలోని ఆగట్టు .. ఈ గట్టు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. నియోజకవర్గంలో గట్టన్నలకు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆకట్టుకున్నారు. ప్రజాకూటమి గట్టు మీద కరెంట్ అడిగితే కాల్చి చంపిన వాళ్లు ఉన్నారు? టీఆర్‌ఎస్ గట్టు మీద అడగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్థులు ఉన్నారు? ఆ గట్టున స్క్రాంలు ఉన్నాయి? ఈ గట్టున పేద ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీంలు ఉన్నాయి? ఆ గట్టున నీళ్లు అడిగితే కన్నీళ్లు తెప్పించిన కాంగ్రెస్ ఉన్నది? ఈ గట్టున అడకముందే నీళ్లు అందించిన ప్రభుత్వం ..ఆ గట్టున డబ్బా ఇండ్లు ఉన్నాయి? ఈ గట్టున కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఉన్నాయి? అంటూ కేటీఆర్ ప్రసంగించిన తీరుకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌డీపీ, మెట్రో, నిరంతర విద్యుత్, సమృద్ధిగా నీటి సరఫరాతో ప్రజల కష్టాలు తొలిగించామని, మళ్లీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే హైదరాబాద్‌లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను మరింత మెరుగుపరుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న మెట్రో పొడిగించుకుందామని, ఆదర్శవంత నియోజకవర్గాలుగా తీర్చిదిద్దుతామన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆదరించారు. మంచి పాలన అందించిన కేసీఆర్ ఒక్కరిని ఎదుర్కొన లేక నాలుగు పార్టీలు ఒక్కటై వస్తున్నాయని, ప్రగతి నిరోధక పార్టీ కాంగ్రెస్‌వైపు ఉందామా? ప్రగతివైపు ఉందామా? అంటూ ఆలోచనాత్మకమైన ప్రసంగాలతో ఆకట్టుకొని.. అన్ని వర్గాలు గ్రేటర్ టీఆర్‌ఎస్‌కు అండగా నిలబడి ప్రతిపక్షాలకు ఊహించని షాక్ ఇచ్చేలా చేశారు.

515

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles