విశ్వనగరం గులాబీ సొంతం

Wed,December 12, 2018 01:55 AM

-హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ విజయకేతనం
-14 స్థానాల్లో కారుకే పట్టం కట్టిన జనం
-పాతబస్తీలో 7 స్థానాలను పదిలపరుచుకున్న మజ్లిస్
-కుప్పకూలిపోయిన టీడీపీ పనిచేయని సినీ గ్లామర్
-ఒక్క స్థానమూ దక్కకపోవడంతోనగరం నుంచి సైకిల్ కనుమరుగు
-రెండే స్థానాలు హస్తగతం
-అభ్యర్థుల గెలుపు కోసంఅహరహం శ్రమించిన కేటీఆర్
-రోడ్‌షోలు, సభలు, సమావేశాలతోప్రజల ఆశీర్వాదం కోరిన టీఆర్‌ఎస్
-గోషామహల్‌కే పరిమితమైన బీజేపీ ఒకే ఒక్క సీటుతో వాడిపోయిన కమలం
సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : అభివృద్ధి పనులే సంకల్పంగా అకుంఠిత దీక్షతో శ్రమిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితికే నగర ఓటర్లు జై కొట్టారు. స్థిరమైన శాంతిభద్రతలందిస్తున్న గులాబీ పాలనకే పట్టం కట్టారు. పటాన్‌చెరు సహా మొత్తం బల్దియా పరిధిలోని 24 నియోజకవర్గాల్లోని14 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించి ఆశీర్వదించారు. దశాబ్దాలుగా రాజకీయ పట్టున్న మజ్లిస్ పాతబస్తీలో 7 సీట్లను పదిలపరుచుకోగా.. మిగిలిన నగరమంతా గులాబీ సొంతమైంది. మరోవైపు కాంగ్రెస్‌తో కలిసి పోటీకి దిగిన తెలుగుదేశం పార్టీకి నగరంలో ఘోర పరాభవం ఎదురైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని బరిలోకి దిగిన కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్‌లో ఆ పార్టీ అభ్యర్థులు పరాజయం పొందారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడే తిష్ట వేసి తనదైన శైలిలో గెలుపు వ్యూహాలకు పదును పెట్టినా ఒక్క సీటూ దక్కించుకోలేకపోయారు.

ఎల్‌బీనగర్, మహేశ్వరం స్థానాలను మాత్రం కాంగ్రెస్ చేజిక్కించుకోగలిగింది. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లాంటి మహానేతలు వచ్చి ప్రచారం చేసినా నగరంలో ఆ పార్టీ కేవలం గోషామహల్ స్థానంలో గెలువగలిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సహా ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ కిషన్‌రెడ్డి కారు జోరుకు తలవంచక తప్పలేదు. తప్పక గెలుస్తామనుకున్న ఆ రెండు స్థానాల్లో వారికి ఓటమే ఎదురైంది. కాగా పాతబస్తీ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కేటీఆర్ నిర్వహించిన రోడ్‌షోలు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఘన విజయాన్ని చేకూర్చి పెట్టాయి. నగరంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోగలిగారు. హోరాహోరీగా తలబడి విశ్వనగరంలో విజయ దుందుభి మోగించారు.


సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : గులాబీ సునామీతో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు పత్తా లేకుండా పోయాయి. నాలుగు పార్టీలు ఏకమైన ప్రజాకూటమికే కాదు బీజేపీకి ఘోర పరాభావం తప్పలేదు. టీఆర్‌ఎస్ మెజార్టీ స్థానాల్లో విజయబావుటా ఎగరవేయడంతో అన్ని పార్టీల నేతలు అంతర్మథనంలో పడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతూ ఏకంగా 14 స్థానాలను దక్కించుకుంది. ప్రజాకూటమి పార్టీలకే కేడర్ ఉన్నదని, తమ ఓటు బ్యాంక్ పదిలంగా ఉందని చెప్పుకుంటూ వచ్చిన నేతల అంచనాలను తలకిందులు చేస్తూ ఓటర్లు నాలుగున్నరేళ్ల పాలనకు పట్టంకట్టారు. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌లలో నేతలు పోయినా కేడర్ ఉందని చెప్పుకుంటూ వచ్చిన పచ్చ పార్టీకి గులాబీదండు చావుదెబ్బ కొట్టింది. పాత మూడుస్థానాలు పటాన్‌చెరు, సికింద్రాబాద్, మల్కాజిగిరి స్థానాలనే కాకుండా అభివృద్ధికి ఆకర్షితులై టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి తొలిసారిగా కారు గుర్తుతో ఎన్నికల బరిలో దిగారు.

కుత్బుల్లాపూర్ నుంచి కేపీ వివేకానంద, కూకట్‌పల్లి నుంచి మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ ప్రకాశ్‌గౌడ్, శేరిలింగంపల్లి అరికపూడి గాంధీ, సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్, జూబ్లీహిల్స్ మాగంటి గోపినాథ్, ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కంటోన్మెంట్ నుంచి సాయన్నలు గులాబీ జెండాను ఎగరవేశారు. ఇక బీజేపీ సిట్టింగ్ స్థానాలు ఉప్పల్, అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్ స్థానాల్లో టీఆర్‌ఎస్ పాగా వేసింది. ఇక ఎంఐఎం ప్రభావం ఉన్న స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ సత్తా చాటింది. ఎంఐఎం పార్టీకి దీటుగా నిలిచి ఇతర పార్టీల కంటే మెరుగు సాధించింది. యాకుత్‌పురా, నాంపల్లి, కార్వాన్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా నియోజకవర్గాల్లో ఓట్ల శాతాన్ని గణనీయంగా మెరుగుపర్చుకుంది. పార్టీ గెలిచిన స్థానాలే కాకుండా ఓటమి చెందిన స్థానాల్లోనూ రెండు,మూడు స్థానాల్లో నిలిచింది. 2014 కంటే టీఆర్‌ఎస్ ఓట్ల శాతాన్ని గణనీయంగా తమ ఖాతాలోకి వేసుకుంది. గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాలకు గానూ 19.62 శాతం నుంచి తాజా ఎన్నికల్లో దాదాపు 35 శాతం ఓట్లు సాధించి తిరుగులేని పార్టీగా నిలిచి గెలిచింది.

792

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles