మేడ్చల్..కూటమి కుదేల్

Wed,December 12, 2018 01:49 AM

మేడ్చల్ జిల్లా,నమస్తే తెలంగాణ ప్రతినిధి : నగరానికి ఆనుకొని ఉన్న మేడ్చల్ జిల్లాలో టీఆర్‌ఎస్ హవా చాటింది. జిల్లావ్యాప్తంగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఐదింటిలోనూ జయకేతనం ఎగురేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ ఆధిక్యం కనిపించింది. జిల్లా ఓటర్లు ప్రజాకూటమి కుట్రలను తిప్పికొట్టి టీఆర్‌ఎస్‌కు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. మేడ్చల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ మొదటి నుంచి దూకుడు ప్రదర్శించింది. 87,990 ఓట్ల ఆధిక్యంతో చామకూర మల్లారెడ్డి విజయం సాధించి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థుల్లో నాల్గో స్థానంలో నిలిచారు. కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినిని కూకట్‌పల్లి ఓటర్లు చిత్తుచిత్తుగా ఓడించారు. సుహాసినిపై 41,049 ఓట్ల ఆధిక్యంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు విజయం సాధించారు. ఉప్పల్ నియోజకవర్గంలో తొలిసారి టీఆర్‌ఎస్ బోణీ కొట్టింది. మహాకూటమి అభ్యర్థి వీరేందర్‌గౌడ్‌పై టీఆర్‌ఎస్ అభ్యర్థి బేతి సుభాశ్‌రెడ్డి 48,060 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై టీఆర్‌ఎస్ అభ్యర్థి వివేకానందగౌడ్ 41,366 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

మల్కాజిగిరి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావుపై టీఆర్‌ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు 73,698 ఓట్లతో విజయం సాధించారు. మేడ్చల్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ ఒకటికి పదిసార్లు పర్యటించి విస్తృతంగా ప్రచారం చేశారు. రోడ్‌షోలు నిర్వహించి ప్రభుత్వ పథకాలను వివరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనే అంశంపై ఓటర్లకు స్పష్టత ఇచ్చారు. నాడు రెండు.. నేడు ఐదు : 2014 ఎన్నికల్లో మేడ్చల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించగా, ఉప్పల్‌లో బీజేపీ, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. కానీ ఈ దఫా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, కేసీఆర్ సుపరిపాలనకు కేటీఆర్ ప్రచారం తోడుకావడంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. అన్ని నియోజకవర్గాల్లోనూ మొత్తం పోలైన ఓట్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు 51-55 శాతం ఓట్లను సాధించారు.

468

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles