అద్భుతం..అత్యాధునికం

Tue,December 11, 2018 01:20 AM

సికింద్రాబాద్,నమస్తేతెలంగాణ : సువిశాల స్థలంలో సీతాఫల్‌మండిలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. అనేక అవాంతరాలు ఎదుర్కొని పేరుమోసిన కన్వెన్షన్‌లకు ఏమాత్రం తీసిపోకుండా ఆధునిక సౌకర్యాలు, సదుపాయాలు ఇందులో కల్పించారు. సుమారు రూ.10 కోట్ల వ్యయంతో రూపు దిద్దుకుంటున్న ఈ ఫంక్షన్‌హాల్ నిర్మాణం పూర్తయితే నగరంలో ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ నిర్మించిన 13 ఫంక్షన్‌హాళ్లకు దీటుగా, ప్రత్యేకంగా ఇది ఉండనుంది. ఈ ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ రూ.2.25 కోట్లు వెచ్చిస్తుండగా మిగిలిన నిధులను మంత్రి పద్మారావు ప్రత్యేక నిధుల నుంచి కేటాయించారు. నిరుపేదలకు కూడా అందుబాటులో ఆధునిక ఫంక్షన్‌హాల్‌లో శుభకార్యం జరుపుకున్న అనుభూతిని కల్పించాలనే లక్ష్యంతో మంత్రి పద్మారావు మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంతంలో ఏ చిన్న కార్యం చేయాలన్నా లక్షలు కిరాయి పెడితేగానీ ఫంక్షన్‌హాళ్లు దొరకవు. అలాంటిది సీతాఫల్‌మండిలో నిర్మిస్తున్న ఫంక్షన్‌హాల్‌కు కిరాయి లేకుండానే పేదలకు ఇస్తారు.
సువిశాలమైన స్థలంలో : సీతాఫల్‌మండి డివిజన్‌లోని వెల్ఫేర్ సెంటర్(గతంలో)ని దాదాపు ఎకరం స్థలంలో జీహెచ్‌ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ నిర్మించేందుకు ఏర్పాట్లు జరిపింది. ఇందుకోసం రూ.2.25 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. అయితే సికింద్రాబాద్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న మొట్టమొదటి మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ కావడంతో సాధారణంగా కాకుండా ఆధునికంగా ఉండాలని మంత్రి పద్మారావు భావించి అన్ని వసతులు కల్పించేందుకు రూ.10 కోట్ల వరకు ఖర్చవుతాయని నివేదిక తీసుకున్నారు. రెండు అంతస్తులతో కూడిన నిర్మాణం జరిపారు. 800 (దాదాపు 40వేల చదరపు అడుగులు)గజాల స్థలంలో నిర్మాణం జరిపారు. కిందిభాగంలో భోజనశాల, అంతే స్థలంలో మొదటి అంతస్తులో శుభాకార్యాలు జరుపుకోడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. భోజనశాలలో గ్రానైట్ ఫ్లోరింగ్, మొదటి అంతస్తులో ఖరీదైన టైల్స్‌తోఫ్లోరింగ్ వేశారు. ఒకేసారి 3వేల మంది కూర్చొని కార్యక్రమం వీక్షించేలా ఏర్పాట్లు జరిపారు. భోజనశాలలో ఏకకాలంలో 2 వేలమంది భోజనం చేయొచ్చు.
జనరేటర్ సౌకర్యం, తాగునీటి వసతి : కేవలం వేసవికాలమే కాకుండా అన్ని కాలాల్లో వినియోగించుకోవడం కోసం రెండు అంతస్తుల్లో సెంట్రల్ ఏసీలు ఏర్పాటు చేస్తున్నారు. ఫాల్‌సీలింగ్, వాటిలోనే ఆధునిక లైటింగ్ సిస్టం ఉంచుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే అత్యవసరంగా వినియోగించుకోడానికి 335 కేవీ పవర్ జనరేటర్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. ఫంక్షన్‌హాల్‌ను వినియోగించుకోవడానికి ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లు, నీటి సౌకర్యం కోసం ఆరు పవర్‌బోర్లను ఏర్పాటు చేశారు. తాగునీటి వసతి కోసం 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపును నిర్మించారు.
పేదల కోసమే..
అనేకమంది ఇంటి ముందు లేక రోడ్లపై శుభకార్యాలు జరుపుకోడం చూసి బాధకలిగింది. అందుకే నిరుపేదలు కూడా ఏసీ ఫంక్షన్ హాల్‌లో శుభకార్యాలు జరుపుకోవాలనే లక్ష్యంతో అత్యాధునిక ఫంక్షన్‌హాల్‌ను నిర్మించాలని నిర్ణయించాం. అదికూడా అతితక్కువ ఖర్చుతో అందించాలని భావించాము. నిర్వహణ ఖర్చు తప్ప అదనంగా చార్జీ చేయకుండా హాల్‌ను అందిస్తాము.
- టి.పద్మారావు, మంత్రి

402

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles