కంగారులో కమలనాథులు

Mon,December 10, 2018 01:17 AM

-పోలింగ్ తర్వాత నేతల్లో కనిపించని ధీమా
-సెంటిమెంట్ ప్రభావం చూపుతుందని ఆందోళన
-ఓటింగ్ శాతం తగ్గడంతో గెలుపోటములపై ప్రభావం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి సత్తా నిరూపించుకుంటామని గొప్పలకు పోయిన బీజేపీ నేతల్లో ఇప్పుడా విశ్వాసం కనిపించడం లేదు. ఏ నేతను కదిలించినా.. డైలామాలోనే తెలియాడుతున్నారు. ఎవరిని అడిగినా కచ్చితంగా గెలుస్తామని చెప్పలేకపోతున్నారు. పోలింగ్‌కు ముందు నేతల్లో కనిపించిన ఉత్సాహం.. ఇప్పుడు కనిపించకపోగా, పోలింగ్ తర్వాత పూర్తిగా సన్నగిల్లింది. క్షేత్రస్థాయి నుంచి అంచనాలు తెప్పించుకున్న తర్వాత ఇది వరకటి ధీమా వారిలో కనిపించడం లేదు. శాసనసభ ఎన్నికల ద్వారా సత్తాచాటుకునేందుకు బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా పోటీకి సిద్ధమయ్యారు. దీనికి తగ్గట్లుగానే ఒంటరి పోరుకు సిద్ధపడి అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపారు. అయితే రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో ముందు వరుసలో ఉన్న పార్టీనేతలు, పోలింగ్ సమయానికి ఢీలా పడ్డారు. బీజేపీ పోటీనిస్తున్న స్థానాల్లో సెంటిమెంట్ ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. బీజేపీ అభ్యర్థుల తరపున అగ్రనేతలంతా ప్రచారం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ సభ, అగ్రనేతలు, అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, నితిన్ గడ్కరీ, రాంమాధవ్, స్వామి పరిపూర్ణానందల ప్రచారం తమకు కలిసివస్తుందని అంచనాలేస్తున్నారు. ఈ ప్రచారం గెలిచేంతవరకు తీసుకెళుతుందా లేదా.. అన్న అనుమానాలు ఆ పార్టీ నేతలను పీడిస్తున్నాయి. పైగా ఓటింగ్ శాతం తగ్గడంతో ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు.

ఓట్ల శాతం పెరిగేనా..?
ఇప్పుడున్న అంచనాల ప్రకారం బీజేపీకి తీపికబురందించే అంశమేదైనా ఉందంటే.. అది ఓట్ల శాతం పెరుగడమని చెప్పుకోవచ్చు. రాజకీయ విశ్లేషకులు, ఆ పార్టీ నేతలు సైతం ఇదే అంశాన్ని ఒప్పుకుంటున్నారు. చాలా మటుకు స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడంతో వారు సైతం మిగతా పార్టీల అభ్యర్థులకు ధీటుగానే ప్రచారం చేశారు. చాలా వరకు సోషల్‌మీడియాను పార్టీ వర్గాలు సమర్థవంతంగా వినియోగించుకున్నాయి. పైగా నగరంలో అధిక మొత్తంలో గల యువత బీజేపీ వైపు ఆకర్శితులయ్యారని, వీరంతా తమకే ఓట్లు వేస్తారని ఆ పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేశారు. ఒక వేళ తమకు ఓట్లు పడ్డా.. ఇవి విజయతీరాలకు చేర్చుతాయా.. లేదా అంటే అనుమానంగానే చెప్పవచ్చు. అయితే ఇది వరకు పోటీచేసిన అభ్యర్థులంతా డిపాజిట్లు కోల్పోయేవారు. కానిప్పుడా ప్రమాదం నుంచి గట్టెక్కి భారీగానే ఓట్లు సంపాదించుకుంటామని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

585

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles