ఆరోగ్యశ్రీతో పునర్జన్మ

Mon,December 10, 2018 01:15 AM

-విజయవంతంగా గుండెమార్పిడి శస్త్ర చికిత్స
-సెంచురీ దవఖాన వైద్యుల శ్రమకు ఫలితం
నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో: తెలంగాణ సర్కారుకు రుణపడివుంటా.. మాలాంటి పేదోలకు ఆరోగ్యశ్రీ పథకం ప్రాణం పోస్తాంది. పెద్ద ఆపరేషన్లను(గుండె మార్పిడి వంటి శస్త్రచికిత్సలు) ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చిన కేసీఆర్ సార్ సల్లగుండాలె అంటూ లింగస్వామి ఉద్వేగభరితంగా ప్రభుత్వానికి, వైద్యసేవలు అందించిన సెంచురీ హాస్పిటల్ వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్ల నుంచి శ్వాస సరిగ్గా తీసుకోలేని స్థితిలో బాధపడుతున్న లింగస్వామికి బంజారాహిల్స్‌లోని సెంచురీ హాస్పిటల్ వైద్యులు ఆరోగ్యశ్రీ పథకం కింద జీవన్‌ధాన్ ద్వారా గుండెమార్పిడి శస్త్ర చికిత్స జరిపారు. ఈ మేరకు ఆదివారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దవాఖాన చైర్మన్ డా.ఐ.గంగాధర రావు, వైస్‌చైర్మన్, చీఫ్ కార్డియోథెరాకిక్ సర్జన్ డా.హేమంత్ కౌకుంట్ల, హార్ట్ ట్రాన్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డా.ప్రవీణ్ నందగిరి ఈ శస్త్రచికిత్స వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా గుండ్రాంపల్లికి చెందిన లింగస్వామి(29) వృత్తి రీత్యా బస్సు డ్రైవర్. కొంత కాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. లింగస్వామి చికిత్స నిమిత్తం సెంచురీ దవాఖాన వైద్యులను సంప్రదించాడు. ఈ మేరకు వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు రోగికి ఐడియాపథిక్ డైలేటెడ్ కార్డియోమయోపథి(డీసీఎంపీ)అనే సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఈ అనారోగ్య సమస్య వల్ల అకారణంగానే గుండె బలహీనపడి రక్తసరఫరా సామర్థ్యం తగ్గిపోతుందని, దీని వల్ల గుండెకు సరిగా రక్తప్రసరణ జరగక శ్వాసలో అవరోధం ఏర్పడుతుందని వైద్యులు సూచించారు.

సాధారణంగా ఎజెక్షన్ సామర్థ్యం 65 నుంచి 70 శాతం ఉంటుంది కానీ ఇలాంటి రోగుల్లో 25-40 శాతానికి ఎజెక్షన్ సామర్థ్యం పడిపోతుందని తెలిపారు. రోగిని పూర్తిగా పరీక్షించిన వైద్యులు అతడికి గుండెమార్పిడే శరణ్యమని చెప్పారు. గుండె మార్పిడి వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలను తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వచ్చింది. ఆర్థిక సామర్థ్యంలేని లింగస్వామికి ఆరోగ్యశ్రీ కార్డు ఉండడంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోగికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించేందుకు వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు జీవన్‌దాన్ ద్వారా రోగి వివరాలను నమోదు చేయించారు. కాగా 25 సంవత్సరాల ఒక యువకుడు నవంబర్‌లో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెత్ చెందాడు. ఈ మేరకు సమాచారం జీవన్‌దాన్ ద్వారా సమాచారం అందుకున్న దవాఖాన వైద్య బృందాలు హుటాహుటిన గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం లింగస్వామిని సన్నద్ధం చేశారు. అదే సమయంలో మరో బృందం బ్రెయిన్‌డెత్‌కు గురైన జీవన్మృతుడి నుంచి గుండెను సేకరించి సెంచురీ దవాఖానకు తరలించారు. సుమారు మూడున్నర గంటల పాటు రోగికి గుండెమార్పిడి శస్త్రచికిత్సను జరిపారు. కోల్డ్ ఇస్కీమియా అనే ఈ గుండె మార్పిడి ప్రక్రియ పూర్తిగా విజయవంతం కావడంతో రోగి శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడింది. ఈ ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ తనకు అవయవ దానం చేసి పునర్జన్మ ప్రసాదించిన కుటుంబ సభ్యులతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా సహాయం అందించిన తెలంగాణ ప్రభుత్వం, ప్రాణం పోసిన సెంచురీ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జీవన్‌ధాన్ కో-ఆర్డినేటర్ డా.స్వర్ణలత, సెంచురీ దవాఖాన సిబ్బంది తదితరులున్నారు.

255

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles