జలసిరులు పారాయి..

Thu,December 6, 2018 12:24 AM

-రూ.116 కోట్లు..33,474 లీటర్ల మద్యం సీజ్
మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి :జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎంవీరెడ్డి వెల్లడించారు. జిల్లాలో మొత్తం 22,25,474 మంది ఓటర్లుండగా, వీరి సౌకర్యార్థం 2,182 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 21వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటికే జిల్లాలో ఓటరు స్లిప్‌ల పంపిణీ పూర్తయిందన్నారు. ఓటర్లకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రానికి సుమారు రెండు వందల మీటర్ల దూరం వరకు వీడియో రికార్డింగ్ ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.16కోట్ల వరకు సీజ్ చేశామని, 33,474 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు వివరించారు. కాగా, ఎన్నికల కమిషన్ ఆదేశాలు, జిల్లా ఎన్నికల అధికారి ఎంవీరెడ్డి మచ్చబొల్లారంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ర్యాంపు విషయంలో తగిన సూచనలు చేసిన కలెక్టర్.. తాగునీరు, మరుగుదొడ్లు, దివ్యాంగులకు వీల్‌చైర్లు, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రత్యేక రవాణా వసతిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మోడల్ పోలింగ్ కేంద్రాన్ని సృజనాత్మకంగా తీర్చి దిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలింగ్ కేంద్రాల నోడల్ ఆఫీసర్ సత్తార్, ఏఆర్‌వో సరళ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మచ్చ బొల్లారంలోని జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ ఎంవీరెడ్డి పరిశీలించారు.

మేడ్చల్ కలెక్టరేట్ : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్ అధికారులు ప్రధాన భూమిక పోషించాలని జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి డా.ఎంవీరెడ్డి అన్నారు. నేరేడ్‌మెట్‌లోని భవన్స్ కాలేజీలో జరిగిన ఈవీఎం యంత్రాల కమిషనింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ... ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించే అంశం పోలింగ్ సిబ్బందిపై ఆధారపడి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సెక్టోరియల్ అధికారులు వారి బృందంలోని సభ్యులకు ఈవీఎం యంత్రాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రీ సైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు సెక్టోరియల్ అధికారులు ఒకే బృందంగా ఏర్పడి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్నారు.అదే విధంగా పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి తాగునీరు, విద్యుత్, బాత్‌రూం సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సెక్టోరియల్ అధికారులు వారి టీమ్ సభ్యులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని సమన్వయం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రిటర్నింగ్ అధికారి వేణు, ఏఆర్వో సరళ, ఆర్డీవో మధుసూధన్,నోడల్ అధికారి సత్తార్ తదితరులు పాల్గొన్నారు.

307

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles