ఎన్నికలకు సర్వం సిద్ధం

Thu,December 6, 2018 12:24 AM

-హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఎన్నికలకు పూర్తైన ఏర్పాట్లు
-ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సుమారు 43వేల మంది పోలీసులతో బందోబస్తు
-పోలింగ్ బూత్‌లోకి సెల్‌ఫోన్‌లకు అనుమతి లేదు
-పట్టుబడ్డ నగదు సుమారు రూ. 32కోట్లకుపైగానే
-200 మీటర్ల పరిధిలో ఆంక్షలు
-వివరాలు వెల్లడించిన సీపీలుఅంజనీకుమార్, మహేశ్‌భగవత్, సజ్జనార్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. 17845 మంది సిబ్బందితో పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు బుధవారం సీపీ కార్యాలయంలో నగర అదనపు పోలీస్ కమిషనర్లతో కలిసి పలు వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 15 అసెంబ్లీలకు ఏసీపీ స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. సిటీలో 3911 పోలింగ్ స్టేషన్లు, 1574 ప్రాంతాలలో ఉన్నాయన్నారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన తనిఖీలలో రూ. 27.03 కోట్లు పట్టుబడ్డాయని, అందులో ఎన్నికల ప్రచార పర్వం ముగియడానికి 24 గంటల ముందు నుంచి రూ.3.57 కోట్లు పట్టుబడ్డాయని వివరించారు. ప్రతి ఒకరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగంచుకోవాలని, అందుకు తగిన ప్రశాంత వాతావారణాన్ని హైదరాబాద్ పోలీసులు కల్పించారని వెల్లడించారు. సిబ్బందికి ఎంసీసీ విషయంలో రెండు సార్లు శిక్షణ ఇచ్చామని ఇందులో ఎస్‌హెచ్‌ఓ నుంచి పోలీస్ కానిస్టేబుల్ వరకు ఉన్నారన్నారు. 15 డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ అండ్ కౌంటింగ్ సెంటర్లకు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వివరించారు. 126 ఫ్లాగ్ మార్చ్, 98 రూట్ మార్చ్, 146 వాహనాల తనిఖీ పాయింట్లతో పాటు కార్డన్ అండ్ సర్చ్‌లు నిర్వహించామన్నారు. ఒక్కో నియోజకవర్గంలో మూడు స్టాటిక్ సర్వేలెన్స్, 3 ైఫ్లెయింగ్ స్కాడ్‌లు పనిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు సీపీలు అనిల్‌కుమార్, శిఖాగోయెల్, మురళీకృష్ణ, శివప్రసాద్, జాయింట్ సీపీ తరుణ్‌జోషి పాల్గొన్నారు.

పాటించాల్సిన నిబంధనలు
పోలింగ్ బూత్‌లకు 100 మీటర్ల దూరం వరకు ఎవరినీ అనుమతించరని, 200 మీటర్ల తరువాత ఒక టేబుల్, రెండు కుర్చీలు వేసుకునేందుకు అవకాశముందన్నారు. శామియానలు వేసుకోవడానికి అనుమతి లేదన్నారు. పోటీ చేసే అభ్యర్థి వాహనంలో ఐదుగురి కంటే ఎక్కువగా ప్రయాణించేందుకు వీలు లేదన్నారు. పోలింగ్ బూత్‌లోకి సెల్‌ఫోన్‌ను అనుమతించరని తెలిపారు. రెండు రోజుల పాటు హోటల్, లాడ్జీలు, ఫంక్షన్ హాల్స్‌లో విరివిగా తనిఖీలు జరుగుతాయని, ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు ఎవరైనా ఇతర ప్రాంతాలకు చెందిన వారు వచ్చి ఇక్కడ ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
మొబైల్ ఫోన్‌లకు అనుమతి లేదు
ఓటర్లు పోలింగ్ స్టేషన్‌లకు మొబైల్ ఫోన్‌లను తీసుకురావద్దని కోరారు. ఓటర్లతో పాటు పోలింగ్ సిబ్బందికి కూడా పోలింగ్ స్టేషన్‌లోకి ఫోన్ తీసుకువెళ్లడానికి అనుమతి లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలింగ్ స్టేషన్‌లో విధులు నిర్వహించే సిబ్బందికి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లాలంటే ప్రిసైడింగ్ అధికారి అనుమతి తీసుకోవాలన్నారు. పోలీసులు కూడా ప్రిసైడింగ్ అధికారి అనుమతి ఇస్తేనే పోలీంగ్ స్టేషన్‌లోకి వెళ్లాల్సి ఉంటుందని పోలీసు కమిషనర్‌లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి కూడా మొబైల్‌ను తీసుకువెళ్లడానికి అనుమతి లేదని చెప్పారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పూర్తి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 25 వేల మంది సిబ్బందిలో పకడ్బందీగా బందోబస్తును మొహరించారు. లక్ష సీసీ కెమెరాలు నిరంతరం సమీక్షించనున్నాయి. చెక్ పోస్టుల ద్వారా తనిఖీలను ముమ్మరం చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు సరఫరా చేసే మద్యం, నగదుపై డేగ కన్ను పెట్టారు. ఈ విధమైన చర్యలతో ఓటరు ఎలాంటి సంకోచం లేకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామని రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్‌లు మహేశ్‌భగవత్, సజ్జనార్‌లు స్పష్టం చేశారు. మీ పరిధిలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినా, లేదా పోలింగ్ రోజు గోడవలు సృష్టించేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మీ దగ్గర అనుమానస్పదంగా తిరుగుతుంటే డయల్ 100 లేదా రాచకొండ వాట్సాప్ నం.9490617111, సైబరాబాద్ వాట్సాప్ నం.9490617444 లకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన 300 మందిని తిరిగి వారి సొంత గ్రామాలకు పంపించామన్నారు. ఎన్నికల నేపథ్యంలో బయటి నుంచి వచ్చే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు తప్పకుండా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

155

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles