ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో సాంకేతికతను జోడించాలి

Wed,November 14, 2018 12:15 AM

ఖైరతాబాద్ : ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి సాంకేతికతను జోడించడం ద్వారా ప్రపంచానికి తెలియని వాస్తవికతలను వెలుగులోకి తీసుకురావచ్చని సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు సుధాకర్‌రెడ్డి ఉడుముల తెలిపారు. ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ అండ్ డేటా మానిటరింగ్ టెక్నిక్స్ ఫర్ జర్నలిస్ట్స్ అనే అంశంపై సుధాకర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ప్రధానంగా ఒక సోర్సు ద్వారా సమాచారాన్ని సేకరించడం ముఖ్యమన్నారు. ఆ సోర్సుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించడం ద్వారా వాస్తవాలను మరింత స్పష్టంగా, డేటాతో సహా సేకరించవచ్చన్నారు. ప్రపంచ దేశాల్లో ఈ టెక్నాలజీని ఎప్పటి నుంచో వినియోగిస్తున్నాయని, ఈ తరహా జర్నలిజంలో మనం ఇంకా ఇరవై ఏండ్లు వెనుకలో ఉన్నామన్నారు.


ప్రస్తుతం టెక్నాలజీ ద్వారా సోర్సును
సంపాధించడంలో సౌత్ కొరియా దేశం అగ్రభాగాన నిలిచిందన్నారు. సోర్సు సేకరణకు అనేక ఆన్‌లైన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయని, ఫేస్‌బుక్, ట్విట్టర్, సోషల్ మీడియాలో వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. పలు వెబ్‌సైట్ల ద్వారా పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించవచ్చన్నారు. తీవ్రవాద స్థావరాలు, రహస్యంగా చేపడుతున్న న్యూక్లియర్ ప్రాజెక్టుల వివరాలను సేకరించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ప్రైవేట్ శాటిలైట్స్ సహకారం తీసుకుంటున్నాయని, తద్వారా స్పష్టమైన చిత్రాలు, వీడియోల ద్వారా ఆధారాలను సేకరిస్తున్నాయన్నారు. ఈ తరహా టెక్నాలజీ మనకూ అందుబాటులో ఉన్నాయని, అయితే వాటిని వినియోగించుకోవాలన్నారు. మన దేశంలో ప్రధానంగా హవాలా, స్కాములు జరుగుతుంటాయని, ప్రజాప్రతినిధుల పెట్టుబడులు, బినామీ ఆస్తులు, విదేశీ బ్యాంకులతో లావాదేవీలను ఈ తరహా పరిజ్ఞానం ద్వారా బహిర్గతపర్చవచ్చన్నారు. జర్నలిస్టులు ఎప్పటికప్పుడు వస్తున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ తమ వృత్తిలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం సుధాకర్‌రెడ్డిని ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు ఎస్.విజయ్ కుమార్‌రెడ్డి, టీశాట్ సీఈవో, సీనియర్
జర్నలిస్టు శైలేశ్‌రెడ్డి, ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యురాలు యశోద, సీనియర్ జర్నలిస్టు రమేశ్ వైట్ల శాలువతో సత్కరించారు.

173

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles