ఉస్మానియాలో మెదడు చికిత్స

Tue,November 13, 2018 12:25 AM

-రోడ్డు ప్రమాదంలో నాలుగేండ్ల బాలుడి మెదడు బయట పడిన వైనం
-శస్త్ర చికిత్స చేసి చిన్నారి ప్రాణాలను కాపాడిన వైద్యులు
-అరుదైన శస్త్ర చికిత్సలకు కేరాఫ్‌గా నిలుస్తున్న ధర్మాస్పత్రి
బేగంబజార్ : శతాబ్ద్దాల చరిత్ర కలిగిన ఉస్మానియా దవాఖాన మెరుగైన వైద్య చికిత్సలకు కేరాఫ్‌గా మారుతున్నది. పేరుకు తగ్గట్లుగానే కార్పొరేట్ ఆస్పత్రులకే అంతుపట్టని అరుదైన శస్త్ర చికిత్సలు నిర్వహిస్తూ ఇక్కడి వైద్యులు పేదల పాలిట దేవుళ్లుగా మారుతున్నారు. ఒక్కటా.. రెండా.. చరిత్రకు తగిన చికిత్సలు నిర్వహించి పేదపాలిట ధర్మాస్పత్రిగా నిలిపారు. నాడు.. రానుబిడ్డో సర్కారు దవాఖానకు అన్న ప్రజలు నేడు ఉస్మానియాలో చికిత్స పొందేందుకు ముందుకు వస్తున్నారు. ధర్మాస్పత్రి ఉండగా లక్షలు ఎందుకు దండగా.. అనే మాట ప్రజల నోట వినిపిస్తుండటం విశేషం.

ఆర్ధిక స్థోమత లేని ఎందరో నిరుపేదలకు అండగా నిలుస్తున్నది ఉస్మానియా దవాఖాన. కార్పొరేట్ దవాఖానల్లో లక్షల రూపాయల ఖర్చును భరించలేని పేదలకు ఉచితంగా అరుదైన శస్త్ర చికిత్సలను నిర్వహించి ప్రాణాలను కాపాడి రోగుల తల్లిదండ్రులకు దేవుళ్ళుగా నిలుస్తున్నారనడంలో అతి శయోక్తి లేదు.

వివరాల్లోకి వెళితే..
ఉస్మానియా దవాఖాన ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ నాగప్రసాద్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం సోమవారం మరో మారు అత్యంత అరుదైన శస్త్ర చికిత్సను విజయంవంతంగా పూర్తి చేసి తమ ఘనతను చాటుకున్నారు. అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేసి ఓ బాలుడికి ప్రాణంపోశారు. బాలుడి తల్లిదండ్రులు వారిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని దేవుళ్ళుగా మారారు. ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ నాగప్రసాద్‌తో పాటు వైద్యులను దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ప్రత్యేకంగా అభినందించారు.

రోడ్డు ప్రమాదంలో
బాలుడి మెదడు బయటపడటంతో..
హైదరాబాద్‌జిల్లా, ఈది బజార్, జావీద్‌నగర్ ప్రాంతానికి చెందిన పండ్ల వ్యాపారం చేసుకొని జీవించే మహ్మద్ వాజిద్, షబ్నమ్ బేగం దంపతుల కుమారుడు అడ్నన్ (4) నవంబర్ 7వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో అడ్నన్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో తలపైన ఉన్న ఎముక చిట్లి మెదడు(బ్రేయిన్) బయటికి కనిపిస్తుంది. దీంతో వెంటనే ఉస్మానియా దవాఖానాలోని న్యూరో సర్జరీ వార్డులో చేర్పించారు. వైద్యులు చిన్నారిని పరిశీలించి మెదడుకు ఎటువంటి ప్రమాదం జరుగలేదని నిర్ధారించుకున్న అనంతరం ప్లాస్టిక్ సర్జరీ వార్డుకు తరలించారు. ప్లాస్టిక్ సర్జరీ హెచ్‌ఓడీ నేతృత్వంలో వైద్యుల బృందం ఫ్లాప్ కవర్ అనే సర్జరీ చేసి బయటికి కనిపిస్తున్న మెదడును చర్మంతో కవర్ చేసి చిన్నారి ప్రాణాలను కాపాడారు. దీంతో అడ్నన్ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు.

ఉస్మానియాలో ఉచితంగా వైద్యం : డాక్టర్ నాగప్రసాద్
ఆరోగ్యశ్రీ వంటి అవకాశాలు లేని వారికి, ఆర్థికంగా ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఉస్మానియా దవాఖానాలో మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు డాక్టర్ నాగప్రసాద్ పేర్కొన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులలో నిర్వహించలేని అరుదైన శస్త్ర చికిత్సలను ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. ఇదే చికిత్సకు ప్రైవేటు దవాఖానల్లో రూ.5 లక్షల వరకు ఖర్చయ్యేదని తెలిపారు.

295

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles