దూరవిద్యకు వయసు, పరిధి అడ్డు కాదు


Mon,November 12, 2018 12:53 AM

-ఇగ్నో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : దూర విద్యా విధానంలో విద్యనభ్యసించేందుకు వయసు, భౌగోళికపరమైన పరిధులు, పరిమితుల లాంటివి ఏమీ లేవని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సులో భాగంగా రెండోరోజు దేశంలోని అన్ని ఓపెన్ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, డిస్టెన్స్ విద్యను అందిస్తున్న ఇతర విశ్వ విద్యాలయాల డిస్టెన్స్ విభాగ డైరెక్టర్ల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. వీరంతా ఓడీఎల్ ఫర్ అవర్ టైమ్స్-అన్‌లీషింగ్ ఇట్స్ ఇన్ఫినైట్ పొటేన్షియల్ అనే అంశంపై రెండు రోజుల పాటు చర్చించనున్నారు. ఇగ్నో వీసీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ, ఉన్నత విద్యా వ్యాప్తిలో సార్వత్రిక విశ్వ విద్యాలయాల పాత్ర కీలకమైందన్నారు. రానున్న రోజుల్లో రెగ్యులర్ విద్యకు, దూర విద్యకు తేడాలేదని, దూరవిద్యలో అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా మాట్లాడుతూ, విశ్వ విద్యాలయాల్లో జరిగే పరిశోధనల్లో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సార్వత్రిక విశ్వ విద్యాలయాల్లో నైపుణ్య ఆధార కోర్సులను ప్రవేశపెడితే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొ॥ కె.సీతారామారావు, అఖిల భారత విద్యాలయాల సమాఖ్య అధ్యక్షులు ప్రొ. సందీప్ సంచేటి, అంబేద్కర్ వర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. ఏ సుధాకర్, రిజిస్ట్రార్ సి.వెంకటయ్య, దేశంలోని పలు విశ్వ విద్యాలయాల వీసీలు, డిస్టెన్స్ విభాగాల డైరెక్టర్లు, పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

204
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...