కూటమిలో సీట్ల సిగపట్లు

Mon,November 12, 2018 12:51 AM

-టీడీపీ-కాంగ్రెస్‌ల మధ్య పొసగని పొత్తులు
-తమకే సీట్లు కేటాయించాలంటూ నిరసనలు, ఆందోళనలు
-రెండు పార్టీల్లోనూ రాజుకున్న అసమ్మతి సెగలు
-రెబెల్‌గా వేసేందుకు సిద్ధం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కూటమి కకావికలమవుతున్నది. సీట్ల పంపకాలు సిగపట్లకు దారితీస్తున్నాయి. పొత్తు పొసగక.. పంపకాలు తేలక.. అయోమయం నెలకొంది. ఎక్కడ ఎవరూ పోటీచేస్తారోనన్న స్పష్టత లేకపోవడంతో, సీటు తమకంటే తమకని ఇరు పార్టీ మధ్య వైరానికి దారితీస్తున్నది. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా జట్టు కడుతామని ప్రకటించుకున్న కాం గ్రెస్, టీడీపీ, టీజేఎస్‌లు ఇప్పుడు జుట్లు పట్టుకుంటున్నాయి. ఓ వైపు టీఆర్‌ఎస్ నేటి నుంచి నామినేషన్లకు సిద్ధమైతుంటే సీట్ల పంపిణీపై కాంగ్రెస్, టీడీపీలు సిగపట్లు పట్టుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది ఇరు పార్టీ ల నాయకుల్లో అంతర్గత పోరు.. వైరం తారాస్థాయికి చేరుకుంది. అయితే తొలు త కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌లు పొత్తుపెట్టుకుంటాయని ఈ రెండు పార్టీలకు చెందిన ఏ నాయకుడు కూడా ఊహించలేదు. చాలా నియోజకవర్గాల్లో పొత్తు లో సంబంధం లేకుండా సొంతంగా బరిలో దిగడానికి రెండు పార్టీల నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే రాష్ట్ర స్థాయి నాయకుల్లో పొత్తులపై ఎత్తులు కుదిరినా.. చాలా నియోజకవర్గాల్లోని స్థానిక టీడీపీ, కాంగ్రెస్ నాయకుల్లో మాత్రం పొత్తు కుదరడం లేదు. ముఖ్యంగా నగరంతో పాటు నగర శివారులో కాంగ్రెస్, టీడీపీల మధ్య సఖ్యత కుదరడం లేదు. దీంతో ఇటు టీడీపీ, కాంగ్రెస్ క్యాడర్‌లో అయోమయం నెలకొంది.

నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి...
- ఎల్బీనగర్ టికెట్ తమకే కేటయించాలని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి అనుచరులు నిరసనలకు దిగుతున్నారు. నియోజకవర్గంలో క్యాడర్ లేని కాంగ్రెస్ పార్టీకి సీటును కేటాయించవద్దంటూ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి చింతల సురేందర్‌యాదవ్ ఎల్బీనగర్‌లో నిరహారదీక్ష చేపట్టారు. ఇక మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి బరిలో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు పార్టీలు బలంగా ఈ సీటును కోరుతుండటంతో ఎవరికి దక్కుతుంది.. ఒకరికి దక్కితే మరొకరు సహకరిస్తారా.. అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
- శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మూడు ముక్కలాట నడుస్తున్నది. టీడీపీలో రెండు వర్గాలు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ సీటును దక్కించుకోవడానికి సిగపట్లు పడుతున్నారు. టీడీపీ సీటు ఆశిస్తున్న భవ్య వెనిగళ్ల ఆనంద్‌ప్రసాద్ మియాపూర్‌లో భారీ ర్యాలీ తీయగా, ఇక్కడ సీటు ఆశిస్తున్న మొవ్వా సత్యనారాయణ గుర్రుగా ఉన్నారు. ఇది వరకు ఆనంద్‌ప్రసాద్ ర్యాలీని అడ్డుకున్న మొవ్వా వర్గీయులు ఆనంద్‌ప్రసాద్ అంటేనే మండిపడుతున్నారు. ఇద్దరి మధ్య పొసగకపోవడంతో టీడీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇదే స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే బిక్షపతియాదవ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఎవరికి సీటు కేటాయించినా మరో వర్గం సహకరించే అవకాశాలు కనిపించడంలేదు.

- కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీచేయనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఆదివారం ప్రకటించారు. ఇంత కాలం అల్లుడు మన్నె క్రిశాంక్‌ను బరిలో దించేందుకు పావులు కదిపిన ఆయన ఇప్పు డు రూటు మార్చి తానే పోటీచేయనున్నట్లు ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో గల టీడీపీ నేతలు ఆదివారం సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యచరణపై చర్చిస్తున్నారు.
- మల్కాగిజిరి సీటును టీజేఎస్‌కు కేటాయిస్తున్నారన్న ప్రచారంతో అక్కడ గతంలో పోటీచేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ అనుచరులు వరుసగా మూడో రోజు గాంధీభవన్ ఎదుట నిరసనలు కొనసాగిస్తున్నారు. టీజేఎస్‌కు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించమని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.
- పటాన్‌చెరుకు చెందిన కాంగ్రెస్ నేతలు సైతం ఇదే తరహాలో గాంధీభవన్‌లో నిరసనకు దిగారు. ఇక్కడ నలుగురైదురు అభ్యర్థులు గట్టిగానే పోటీపడుతున్నారు. ఈ సీటుకు కాంగ్రెస్‌లోని వడ్డెర వర్గానికి చెందిన బీసీ నేతలకు ఇవ్వాలని కొంత మంది గాంధీభవన్‌ను ముట్టడించారు. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీచేసేందుకు మాజీ ఎమ్మెల్యే నందిశ్వర్‌గౌడ్ సిద్ధపడుతున్నారు.

- కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉండేందుకు ఆ పార్టీ సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన ఆయన గతంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి గెలిచి మంత్రిగా పనిచేసి, తాజాగా కూకట్‌పల్లిలో వలస అభ్యర్థిగా బరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ టికెట్‌ను కేపీహెచ్‌బీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు ఆశిస్తూ తానే బరిలో ఉంటానని ఓటర్లను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. ఆదివారం ఇరువురు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. పెద్దిరెడ్డి ర్యాలీ విషయం తెలుసుకున్న మందాడిశ్రీనివాసరావు వర్గీయులు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
- సనత్‌నగర్‌లో అభ్యర్థిత్వం తేలకుండానే టీడీపీ నేత కూన వెంకటేశ్‌గౌడ్ ఇంటింటి ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటానని ప్రకటిస్తుండగా ఇద్దరిలో ఎవరు అభ్యర్థులు తేల్చుకోలేక రెండు పార్టీల క్యాడర్ అయోమయంలో పడ్డారు.
- ముషీరాబాద్‌లో టీడీపీ తమ్ముళ్లు ప్రతిసారి పొత్తులో భాగంగా సీటును కోల్పోతున్నారు. ఇంతకాలం బీజేపీ కారణంగా సీటును త్యాగం చేసిన టీడీపీ నేతలకు తాజాగా కాంగ్రెస్‌తో పొత్తుతో సీటు గల్లంతవుతున్నది. ఈ సీటు కోసం టీడీపీ నుంచి ఎంఎన్ శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి అనిల్‌కుమార్‌లు టికెట్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌కే ఈ స్థానాన్ని కేటాయిస్తున్నారన్న ప్రచారంతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసుకున్న తెలుగుదేశం నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు సహకరించమని అల్టిమేటం జారీచేశారు.

209

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles