ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తం


Mon,November 12, 2018 12:50 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. సోమవారం నుంచి నామినేషన్‌ల ఘట్టం షురూ కానుండడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. అన్ని ఠాణా ఎస్‌హెచ్‌ఓలను అప్రమత్తంగా ఉండాలని, నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అన్ని జోన్ల డీసీపీలు అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా అన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా గస్తీ చేయడంతోపాటు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలపై ఉన్నతాధికారులు సైతం స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు. తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఇదిలా ఉండగా, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వ్యక్తులను ఇప్పటికే పోలీసులు బైండోవర్ చేశారు. నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా పెట్టిన పోలీసులు, కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా కూడా శాంతి భద్రతలను ఉన్నతాధికారులు పరిశీస్తున్నారు. నగరంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీస్ సీనియర్ అధికారులు చెబుతున్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...