అభివృద్ధిలో రాజీ పడం

Sun,November 11, 2018 12:48 AM

- శేరిలింగంపల్లికి రూ.4 వేల కోట్ల నిధులు
-అయ్యప్ప సొసైటీ సమావేశంలో మంత్రి కేటీఆర్
మాదాపూర్ / కొండాపూర్: తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడే ఎవరినైనా వ్యతిరేకించేందుకు వెనకాడబోమని, వ్యక్తిగత కారణాలతో ఎవరినీ విమర్శించబోమని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు తేల్చిచెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబును కేవలం రాజకీయంగానే వ్యతిరేకిస్తున్నామని, దీని వెనుక వ్యక్తిగత కక్షపూరిత ధోరణి ఏమీ లేదని స్పష్టంచేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న దురాలోచనతో టీడీపీ అధినేత చేసిన పనుల వల్ల ఇబ్బందులు పడిందెవరో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. శనివారం ఆయన మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ కమ్యూనిటీ సెంటర్‌లో నిర్వహించిన హమారా హైదరాబాద్ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జి పీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ, డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రధాన ఎజెండా అని, రాష్ర్టాన్ని ఆ దిశగా ముందుకునడిపే సత్తా సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉన్నదన్నారు.

సంక్షేమం కోసం పనిచేసే టీఆర్‌ఎస్ అభ్యర్థి గాంధీ ఇక్కడ ఉండటం నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. అయ్యప్ప సొసైటీ, గోకుల్ ప్లాట్స్ కాలనీల్లో ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతున్న పలు సమస్యలను కేవలం రెండేండ్లలో పరిష్కరించడం విశేషమని, కోర్టు వివాదాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఇప్పటికే జీవో నెంబర్ 299 ద్వారా ఇండ్లకు నంబర్లను కేటాయించామని, అయ్యప్ప సొసైటీ, గోకుల్ ప్లాట్స్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, శేరిలింగంపల్లి అభివృద్ధికి రూ.4 వేలకోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ పాలన, రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతిపట్ల ఆయనకు గల చిత్తశుద్ధిని చూసి టీఆర్‌ఎస్‌ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరం మినీ భారతదేశమని, ఇక్కడ నివసిస్తున్న వివిధ రాష్ట్రాల ప్రజలను సీఎం కేసీఆర్ కన్నబిడ్డల్లా అక్కున చేర్చుకున్నారని చెప్పారు.

బంగారు తెలంగాణ సాధించుకుందాం..
మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో పరుగులుతీయిస్తున్న సీఎం కేసీఆర్‌కు మరోసారి పట్టంగట్టి బంగారు తెలంగాణను సాధించుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నివర్గాల ప్రజలకు అందుతున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటినుంచి ఇతరప్రాంతాల ప్రజలపట్ల కక్షపూరితంగా వ్యవహరించిన దాఖలాలు లేవని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని, శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి గాంధీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అయ్యప్ప సొసైటీ అధ్యక్షుడు మధుసుదన్‌రెడ్డి, కార్యదర్శి కేవీరావుతో పాటు జైహింద్ ఎన్‌క్లేవ్, సాయినగర్, గుట్టల బేగంపేట్, ఇజ్జత్‌నగర్, ఖానామెట్, కాకతీయహిల్స్, అరుణోదయకాలనీ, సర్వే ఆఫ్ ఇండియా, మెగాహిల్స్, నవభారత్‌నగర్, సిలికాన్ వ్యాలీ కాలనీలవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని టీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా మద్దతు తెలిపారు.

602

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles