టికెటిస్తారా.. చెయ్యిస్తారా..


Sun,November 11, 2018 12:26 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పొత్తుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న ఆగ్రహజ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. గాంధీభవన్ ధర్నాలతో అట్టుడుకుతున్నది. మొన్న శేరిలింగంపల్లి, నిన్న మల్కాజిగిరి, నేడు ఉప్పల్ నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలు గాంధీభవన్ వద్ద ఆందోళనలకు దిగడమే ఇందుకు నిదర్శనం. అభ్యర్థుల ఎంపిక చివరి అంకానికి చేరుకోవడంతో ఆశావహులు దింపుడుకల్లం ఆశతో ఇంకా ఢిల్లీని వీడటంలేదు. పొత్తులతో వారి స్థానాలు ఇతర పార్టీలకు కేటాయించడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ వైపు ఢిల్లీలో బీసీ సంఘాలు, ఓయూ విద్యార్థులు టికెట్లకోసం ఆందోళన చేస్తుంటే, మరోవైపు గ్రేటర్‌కు చెందిన కొందరు నాయకులు పైరవీలు సాగిస్తునే ఉన్నారు. ఉప్పల్ స్థానాన్ని టీడీపీకి కేటాయించినట్లు వార్తలు రావడంతో ఎంతోకాలంగా అక్కడ పార్టీకోసం పనిచేస్తున్న ఆర్. లకా్ష్మరెడ్డి వర్గం శనివారం గాంధీభవన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది.

ఎట్టి పరిస్థితుల్లో ఉప్పల్ స్థానం టీడీపీకి వదులుకునేదిలేదని, అవసరమైతే తిరుగుబావుటా ఎగురేస్తామని ఆ వర్గానికి చెందిన కార్యకర్తలు తెగేసి చెబుతున్నారు. తుది జాబితాను ఆది, లేక సోమవారం వెల్లడిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో చివరి నిమిషంలోనైనా టికెటు దక్కుతుందనే ఆశతో ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కొందరు ధర్నాలతో బెదిరింపులకు దిగుతుండగా, మరికొందరు ముఖ్యనేతలతో లాబీయింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా అంబర్‌పేట్, ఖైరతాబాద్, మల్కాజిగిరి, ఉప్పల్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌తోపాటు పాతబస్తీలోని మజ్లీస్ ఆధీనంలోని నాంపల్లి మినహా మిగిలిన ఆరు స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతున్నది. పాతబస్తీలోని స్థానాలకు అంత పోటీ లేన్నప్పటికీ శివారు ప్రాంతాల్లోని స్థానాలకోసం ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్ని స్థానాలు పొత్తులో భాగంగా ఇతర పార్టీకి కేటాయించినట్లు, మరికొన్నిచోట్ల తమ అభ్యర్థిత్వాన్ని కాదని మరొకరికి టికెటు కేటాయిస్తున్నారనే లీకులతో ఆశావహులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంటే కూటమిలో సీట్ల కోసం కుమ్ములాటలు జరుగుతుండటంతో కాంగ్రెస్ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.

244
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...