ఎన్నికల నిర్వహణలో టెక్నాలజీ కీలకం

Fri,November 9, 2018 12:53 AM

నమస్తే తెలంగాణ సిటీబ్యూరో: దేశమంతా హైదరాబాద్ నగరం వైపే చూస్తోందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి, జల మండలి ఎండీ అయిన దాన కిశోర్ అన్నారు. తెలం గాణ ఎన్నికల నిఘా వేదిక ఆధ్వర్యంలో 25 స్వచ్ఛంద సంస్థలు మమేకమై జల మండలి కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన తెలంగాణ ఎలక్షన్ వాచ్ - 2018 (ఓటరు చైతన్య) కార్యక్రమానికి దాన కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణతో పాటు ఇంకా నాలుగు రాష్ర్టాలలో ఎన్నికలు జరుగుతుండగా, దేశ ప్రజలంతా హైదరాబాద్ మహా నగరం వైపే చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ దఫా ఎన్నికల్లో ప్రధానంగా హైదరాబాద్‌లో ఏం జరగబోతోంది? అని దేశ ప్రజలంతా చూస్తున్నారన్నారు. ఎన్నికలు సజావుగా జరగడానికి, మంచివారిని ఎన్నుకోవడానికి 25 స్వచ్ఛంద సంస్థలు ఎన్నికల నిఘా వేదికను ఏర్పాటు చేసుకొని ఇలా ముందుకు రావడం ఎంతైనా అభినందనీయమని అన్నారు.

ఈ దఫా శాసనసభకు జరిగే ఎన్నికలకు గాను ఓటింగ్ శాతం పెంపు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. గతంలో ప్రజా సంఘాల మద్దతుతో ఓటింగ్‌పై ప్రచారం చేశాం. ఓటింగ్ శాతం కూడా చెప్పుకోదగిన రీతిలో పెరిగిందన్నారు. హైదరాబాద్ జిల్లాలో 40 లక్షల మంది ఓటర్లున్నారని, ప్రతి వేయి మందికి 932 మంది ఓటర్లు ఉన్నారు. 80 శాతానికి పైగా జిల్లాలో అక్షరాస్యత ఉన్నా కేవలం 53 శాతం లోపే ఓటింగ్ నమోదైందన్నారు. ఇందులో 20 శాతం లోపు ఓటింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలు ఉండటం బాధాకరమన్నారు. ప్రస్తుతం, ప్రతి ఓటర్ పోలింగ్ బూత్‌కు వచ్చి తన ఓటును వినియోగించుకునేలా విరివిగా ప్రచారం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఓటు రిజిస్ట్రేషన్స్, చెక్ యువర్ ఓటు, ఎన్నికలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఎన్నికలు అందరికీ మరింత అందుబాటులోనే ఉన్నాయని తెలిపే విధంగా, దివ్యాంగులకు, సాధారణ ప్రజలకు ఎన్నికలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నామన్నారు. దివ్యాంగుల ఓటింగ్ పెంచడానికి మొట్ట మొదటి సారిగా వాదా యాప్‌ను ప్రవేశపెడుతున్నామన్నారు. ఈసారి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమణలపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా సీ-విజిల్ యాప్ ప్రవేశపెట్టాం.

వీవీ ప్యాట్, ఈవీఎంలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఇప్పటి వరకు మూడు లక్షల మంది పాల్గొని నమూనా ఓటు వేసి అవగాహన పొందారు. ఈ నెల 19వ తేదీ వరకు ఓటర్ల లిస్టు తుది జాబితా వస్తుందన్నారు. జిల్లాలో 20 వేల మంది దివ్యాంగులైన ఓటర్లుండగా, 16 వేల మందిని ఓటర్లుగా నమోదు చేయించామన్నారు. ఇంకా, మిగిలిన వారిని కూడా ఓటరుగా చేయించడానికి చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామన్నారు. పోలింగ్‌కు రెండు లేదా మూడు రోజుల ముందే ఓటర్లకు పోల్ స్లిప్పులను పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి సోదాలు నిర్వహించగా, ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అక్రమంగా రవాణా అవుతున్న రూ.17.65 కోట్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల మ్యాప్‌ను ఓటర్లకు అందజేయడం ద్వారా బూత్‌లను తెలుసుకునేందుకు మరింత సులభంగా ఉంటుందన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌ల పనితీరుపై బూత్ లెవల్ ఏజెంట్లు, అధికారుల ఉమ్మడి సమావేశాలు నిర్వహించామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమణకు సంబంధించి 30 కేసులు నమోదు చేశామన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి అనుమతులకు 18 దరఖాస్తులు అందగా, 16 అనుమతులు జారీ చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమణకు 18 ఫిర్యాదులందగా, 14 ఫిర్యాదులపై తగు విచారణ పూర్తి చేశామన్నారు. నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ, ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేస్తున్న తెలంగాణ ఎన్నికల నిఘా సంస్థకు పూర్తి స్థాయిలో సహకరించనున్నట్టు దాన కిశోర్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రావు వీబీజే చెలికాని, ఎం.పద్మనాభరెడ్డి, బండారు రామ్మోహనరావు, ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధి, అప్స డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

216
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles