తెలుగు కళలను భావితరాలకు అందిద్దాం

Sat,October 27, 2018 11:50 PM

-కీర్తి పురస్కారాల ప్రదానంలో ఆర్టీఐ కమిషనర్ బుద్దా మురళి
సిటీబ్యూరో,నమస్తేతెలంగాణ : అంతరించిపోతున్న తెలుగు కళలను భవిష్యత్తుతరాలకు అందించాల్సిన అవసరమున్నదని రాష్ట్ర సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్ బుద్దా మురళి అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కీర్తి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు లలిత కళలను మరింత పరిపుష్టితో భావితరాలకు అందించాలని అభిప్రాయపడ్డారు. తాను నేర్చుకున్న ఏ కళయైనా తన జీవిత చరమాంకం వరకు తోడుగా ఉండి ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం సంచాలకుడు విజయ్ భగవాన్ మాట్లాడుతూ తెలుగుభాషకు అమ్మలాగా తెలుగు విశ్వవిద్యాలయం తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందన్నారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ ఆయా కళారంగాల్లో నిష్కామకర్మగా కృషిచేస్తున్న నిశబ్ధ సైనికుల ప్రతిభను గుర్తిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికచేసి ప్రతియేటా ఆయా పురస్కారాల పేరిట తెలుగు విశ్వవిద్యాలయం ఘనంగా సత్కరిస్తున్నదన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం లలిత కళారంగంలోని వివిధ ప్రక్రియల్లో నిష్ణాతులైన 20 మంది ప్రముఖులకు ఈ సందర్భంగా కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది.

పురస్కారాలు అందుకున్న వారు : ఉత్తమనటిగా జయవాణి, ఉత్తమ నటుడిగా విశ్వనాథశాస్త్రి, ఉత్తమ నాటక రచయితగా రామకృష్ణ, ఉత్తమ ఉపాధ్యాయురాలిగా మృదుల నాన్సీ, మహిళ అభ్యుదయవాదిగా మల్లు స్వరాజ్యం, హేతువాద ప్రచారంలో కృషికి గాను కన్నెబోయిన అంజయ్య, గ్రంథాలయకర్తగా లంకా సూర్యనారాయణ, గ్రంథాలయ సమాచార విజ్ఞానంలో ఆచార్య కె.పద్మిని, నాటకరంగంలో ఆచార్య జీఎస్ ప్రసాదరెడ్డి, ఆంధ్రనాట్యంలో కొండ కవిత, జానపద కళల్లో పిల్లుట్ల ప్రకాశ్, సాంస్కృతిక సంస్థ నిర్వహణలో ఆళ్లూరి వెంకటయ్య, జనరంజక విజ్ఞానంలో ఎంవీ రమణారెడ్డి, జానపద గాయకురాలు స్నేహలతా మురళి, ఇంద్రజాలంలో బీఎన్‌ఎస్ కుమార్, కార్టూనిస్ట్ బాలి (ఎం.శంకర్‌రావు), లలిత సంగీతంలో కృష్ణమోహన్, శాస్త్రీయ సంగీతంలో కె.శేషుబాబు, జ్యోతిష్యంలో ఆచార్య డీఎల్‌ఎన్ మూర్తి, కూచిపూడి నాట్యంలో డాక్టర్ రమాదేవి.

243

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles