సీసీ కెమెరాలన్నీ..ఒకే యాప్‌లో


Tue,October 23, 2018 01:52 AM

-58 వేల నిఘా నేత్రాల అనుసంధానం
-రాచకొండ పరిధిలో కెమెరాల మ్యాపింగ్ పూర్తి
సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సుమారు 58 వేల సీసీ కెమెరాలను పతంగి కన్ను (కైట్-ఐ) అప్లికేషన్‌తో అనుసంధానం చేశారు. ఈ అప్లికేషన్‌లో ప్రతి సీసీ కెమెరా లొకేషన్, ఐపీ అడ్రస్, కెమెరా సామర్థ్యం, కెమెరా స్పష్టత తదితర అంశాలను భద్రపర్చారు. సంబంధిత సీసీ కెమెరా లొకేషన్‌కు వెళ్లి అక్కడ యాప్‌లో లాగిన్ అయ్యి మొత్తం వివరాలను నమోదు చేశారు. వాటిని గూగుల్‌లో ఎంట్రీ చేశారు. ఈ వివరాలను టీఎస్ కాప్ యాప్ ద్వారా లింక్ చేయడంతో పోలీసులు సీసీ కెమెరాల లొకేషన్ ఆచూకీ కొట్టగానే మొత్తం వివరాలు ప్రత్యక్షమవుతాయి.

రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఆధునిక టెక్నాలజీ పోలీసుల్లో ఉత్సాహన్ని నింపుతున్నది. రాచకొండ ఐటీ అధికారులు సరికొత్త టెక్నాలజీపై అవగాహన కల్పిస్తూ ప్రతి పోలీసుకు సాంకేతిక పరిజ్ఞాణాన్ని అందిస్తున్నారు . ఈ నేపథ్యంలో పతంగి కన్ను(కైట్-ఐ) అప్లికేషన్‌తో పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రతి సీసీ కెమెరా అనుసంధానం చేశారు . దీంతో పోలీసు కమిషనరేట్ పరిధిలోని 58 వేల సీసీ కెమెరాల మ్యాపింగ్ పూైర్తెంది. ఈ ప్రక్రియతో ఇప్పుడు పోలీసులు అత్యంత సులభంగా నేరస్థుడిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలను మ్యాపింగ్ చేసుకుంటే చాలు నేరం చేసిన వ్యక్తి ఆనవాలు క్షణాల్లో లభించనుంది. ఇందుకోసం రాచకొండ ఐటీ సెల్ అధికారులు టెక్‌డాటమ్ సాఫ్ట్‌వేర్ ద్వారా కైట్ ఐ(పతంగి కన్ను) అప్లికేషన్‌ను తయారు చేశారు. అంతేకాకుండా ప్రతి కెమెరాను జియోట్యాగింగ్ చేయడం పోలీసు అధికారులకు మరింత కలిసి వచ్చింది. దీనికి తోడు కెమెరాల డేటాను మూడునెలలపాటు నిల్వ ఉంచడంతోపాటు ప్రతి దృశ్యాన్ని బ్యాక్ అప్ కింద జమ చేసుకునేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పతంగి కన్ను(కైట్ ఐ) అంటే...
టెక్‌డాటమ్ సాఫ్ట్‌వేర్ నుంచి ఐటీ సెల్ అధికారులు కైట్ ఐ అప్లికేషన్ రూపొందించారు. ఈ అప్లికేషన్‌లో ప్రతి సీసీ కెమెరా లొకేషన్, ఐపీ అడ్రస్సు, కెమెరా సామర్థ్యం, కెమెరా స్పష్టత తదితరాంశాలను భద్రపర్చారు. సిబ్బంది సంబంధిత సీసీ కెమెరా లొకేషన్‌కెళ్లి అక్కడ యాప్‌లో లాగిన్ అయ్యి ఒక క్లిక్‌తో మొత్తం వివరాలను అందులో ఎక్కించారు. ఇలా మొత్తం 58 వేల సీసీ కెమెరాల లొకేషన్‌లను డౌన్‌లోడ్ చేసి వాటిని గూగుల్‌లో ఎంట్రీ చేశారు. అనంతరం ఆ మొత్తం వివరాలను టిఎస్ కాప్ యాప్ ద్వారా లింక్ చేయడంతో ఇప్పుడు పోలీసుల అధికారులు టీఎస్‌కాప్ యాప్‌ను తెరిచి అందులో సీసీ కెమెరాల లొకేషన్ ఆచూకీ కొట్టగానే మొత్తం వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఇలా పోలీసు చేతుల్లో ఇప్పుడు ప్రతి సీసీ కెమెరా దృశ్యం అందుబాటులోకి వచ్చింది. ఈ విధంగా కైట్ ఐ ప్రతి సీసీ కెమెరాను కనెక్ట్ చేసి మొత్తం కమిషనరేట్ ప్రాంతాన్ని ఒక దృశ్యంగా మలిచి ఎప్పుడు, ఎక్కడ, ఏ ప్రాంతానికి సంబంధించిన సీసీ కెమెరాల వివరాలు కావాలన్న కమాండ్ కంట్రోల్‌లోని టీవీలలో ప్రత్యక్షమయ్యేలా రూపొందించారు.

100 శాతం ఆధారాలు ఇస్తున్న సీసీ కెమెరాలు
సీసీ కెమెరాల కనెక్టవిటీతో ఇప్పుడు ప్రతి నేరంలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయి. ఇటీవల ఇబ్రహీంపట్నంలో ఓ చైన్ స్నాచింగ్ జరుగగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పతంగి కన్ను యాప్ తెరిచారు. అంతే వారికి స్నాచింగ్ జరిగిన చోట నుంచి చుట్టూ 100 మీటర్ల దూరంలో ఉన్న సీసీ కెమెరాల లొకేషన్ మ్యాప్‌లతోపాటు చిరునామాలను చూపించింది. దీంతో అధికారులు ఆయా సీసీ కెమెరాల వద్దకు పోలీసు సిబ్బందిని పంపించి స్నాచర్ పారిపోయిన రూటుతోపాటు అతని ఆనవాలుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను సేకరించి తక్కువ సమయంలోనే స్నాచర్‌ను అరెస్టు చేశారు.

నేను సైతంతో ముందుకొస్తున్నారు...
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం దాదాపు 58 వేల సీసీ కెమెరాల కండ్లు తెరుచుకున్నాయి. ఇందులో కమ్యూనిటీ సీసీటీవీ కార్యక్రమం కింద 6183, నేను సైతం కింద 50,855 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఎల్బీనగర్ జోన్‌లో నేను సైతం కింద-21 వేలు, కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద-2918, మల్కాజిగిరి జోన్‌లో నేను సైతం కింద-27,475, కమ్యూనిటీ సీసీటీవీ కింద-1746, యాదాద్రి భువనగిరి జోన్‌లో నేను సైతం కింద-1680, కమ్యూనిటీ సీసీటీవీ కింద-1519 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇంకా ప్రజలు సీసీ కెమెరాల ప్రాధాన్యతను తెలుసుకొని ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

382
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...