బిస్కెట్లు ఇచ్చి.. నగలు మాయం చేశారు...

Tue,October 23, 2018 01:51 AM

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : నగరశివార్లలో దొంగలు కొత్త ఎత్తుగడ వేసి బిస్కెట్లు వేసి బంగారం దోచుకెళ్లారు. ప్రతి ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన మూటలో బిస్కెట్‌లు బయటపడ్డాయి. ఇలా రూ.1100 ఇచ్చి మెడ మీద గొలుసులను ఎత్తుకెళ్ళిపోయారు. ఈ తరహా ఘటనలు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకోవడంతో రెండు పోలీసు కమిషనరేట్‌లకు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గుర్తు తెలియని వ్యక్తుల కోసం గాలిస్తున్నాయి. అనుమానితుల నేరప్రక్రియ సరికొత్తగా ఉండడంతో గాలింపును ముమ్మరం చేశారు. ఈ దుండగులకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. హోండా యాక్టివా మీద సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. యాక్టివా నెంబరును గుర్తించేందుకు యత్నించగా ఆ నెంబర్లపై బొట్లు ఉండడంతో ఇబ్బంది ఎదురైంది.
అనుమానితుల నేర ప్రక్రియల ఇలా : హోండా యాక్టివా మీద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పహాడీషరీఫ్, రాజేంద్రనగర్, నార్సింగి, మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో మొత్తం 5గురు మహిళల దృష్టిని మళ్ళించి 10తులాలకు పైగా బంగారు గొలుసులను ఎత్తుకెళ్లిపోయారు.

కిరాణా దుకాణాలు, చిన్నచిన్న చిల్లర దుకాణాల్లో మహిళలు ఉన్న వాటిని టార్గెట్ చేశారు. వారి దగ్గరకు వెళ్ళిన అనుమానితులు మేము అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు సహాయం చేయాలనుకుంటున్నాం..మీకు ఎవరైనా తెలుసా అంటూ పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత రూ.1100 అనాథ ఆశ్రమంలోని పిల్లలకు ఇవ్వండని చెప్పి ఆ తర్వాత మీరు ఇలా ఒంటరిగా దుకాణాల్లో బంగారం వేసుకుని ఉంటే ఏట్లా దొంగలు తిరుగుతున్నారు..మిమ్మల్ని చంపేసి లేదా దాడి చేసి తీసుకువెళ్తారు. ముందుగా అది తీసేయండి అంటూ బంగారం గొలుసును తీయించి వాటిని ఓ బట్టలో కట్టిస్తున్నట్లు నటించి మహిళ దృష్టిని మళ్ళించి గొలుసును వారి జేబులో వేసుకుని వారికి మూటను చేతుల్లో పెట్టి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తర్వాత ఆ ముటా విప్పి చూడగా అందులో బిస్కెట్లు కనపడ్డాయి. ఈ పరిణామంతో కంగుతిన్న మహిళలు జరిగిన ఉదంతాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విధమైన ఘటనలు ఒకేరోజు ఐదుచోట్ల జరగడంతో పోలీసుల్లో కలవరం రేపింది. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడితే వెంటనే అప్రమత్తమై సమాచారమందించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు.

ఘటనలు ఇలా..
శంషాబాద్ : శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో ఓ దుకాణం వద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి మంగ (30) అనే మహిళను పూజలు చేస్తామని నమ్మించారు. ఆమె మెడలో నుంచి 4 తులాల గొలుసులాక్కెళ్లారు. అనంతరం మరో మహిళ వద్ద అదే విధంగా నమ్మించి 6 తులాల గొలుసు చోరీ చేసి పరారయ్యారు. బాధితులు మోసాన్ని గ్రహించి లబోదిబోమంటూ శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తుక్కుగూడ శ్రీ సాయినగర్‌లో
పహాడీషరీఫ్ : ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిమగల ప్లాస్టిక్ కవర్‌లో బంగారం ఉంచితే రెట్టింపు అవుతుందని నమ్మించి ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ వద్ద 6 తులాల బంగారు పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. మహేశ్వరం మండలం తుక్కుగూడ శ్రీ సాయినగర్‌లో నివాసముంటున్న రుక్మిణి(50) ఇంటి ముందు కూర్చుంది. ఇద్దరు వ్యక్తులు హోండా యాక్డివాపై వచ్చి గణేష్ దేవాలయం ఎక్కడ ఉందని అడుగగా..తెలియదని చెప్పింది. తమ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిమగల ప్లాస్టిక్‌కవర్ మూట ఉన్నదని.. అందులో బంగారు పుస్తెలతాడు వేస్తే డబుల్ అవుతుందని నమ్మించారు. వెంటనే ఆమె మెడలోని 6 తులాల బంగారు గొలుసును కవర్‌లో పెట్టగా..పూజలు చేసిన అనంతరం అరగంట తర్వాత తెరవాలని సూచించి ఉడాయించారు. తెరిచి చూడగా అందులో బంగారు పుస్తెలతాడు లేకపోవడంతోపాటు నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు, రూ.900 నగదు ఉంది.

మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలో..
బండ్లగూడ : రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలోని కిరాణ దుకాణ యజమాని సంతోషి, కిస్మత్‌పూర్‌లోని దుకాణ యజమాని నిర్మల, భవానీనగర్‌లోని కిరాణ దుకాణాదారు లావణ్యలను పూజల పేరుతో ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పి 12 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం వారు దుకాణాల వద్దకొచ్చి దేవాలయ నిర్మాణానికి చందా ఇవ్వాలని కోరారు. తమ వద్ద లేవనడంతో మీ దుకాణం సరిగ్గా నడవడం లేదని, పూజలు నిర్వహిస్తే మంచి జరుగుతుందని చెప్పడంతో వారు అంగీకరించి పూజలు మొదలుపెట్టమని చెప్పారు. అనంతరం పూజలు నిర్వహిస్తూ బంగారు ఆభరణాలకు పూజలు నిర్వహించాల్సి ఉందని చెప్పడంతో తమ మంగళసూత్రాలను తీసి ఇచ్చారు. పూజల అనంతరం మూటగట్టి అందులో ఉన్న కొబ్బరి కాయను కొట్టిన తరువాత మూటవిప్పాలని చెప్పి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మూట విప్పగా బంగారు గొలుసులు లేకపోవడంతో మోసపోయామని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

331

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles