పోలింగ్ స్టేషన్లకు జియోట్యాగింగ్

Sun,October 21, 2018 12:20 AM

-సైబరాబాద్ పరిధిలో ఏర్పాట్లు
-12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో..2,775 కేంద్రాలకు సాంకేతిక దన్ను
- 209 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు
- ఎలక్షన్ సెల్ వాట్సాప్ గ్రూపు
-గత ఎన్నికల సంఘటనలపై పున:సమీక్ష
- 1068 తుపాకులను పోలీసుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశాలు
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నారు. సైబరాబాద్ పరిధిలోని ప్రతి పోలింగ్
స్టేషన్‌ను జియో ట్యాగింగ్ చేశారు. ఆయా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా క్షణాల్లో సిబ్బంది చేరుకొని పరిస్థితిని
సమీక్షించేలా ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలను సమర్థంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు సాంకేతికతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కమిషనరేట్ పరిధిలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలీసులు ఏర్పాట్లు చేసుకున్నారు.ఆధునిక సాంకేతికత ఉపయోగించుకుంటున్న పోలీసులు మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 2,775 పోలింగ్ కేంద్రాలకు జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. 1100 ప్రాంతాల్లో నెలకొన్న ఈ పోలింగ్ ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసి వాటిని గూగుల్ మ్యాప్‌లో భద్రపర్చారు. దీంతో అధికారులు కేవలం పోలింగ్ బూత్ నంబరు, పేరు ఆధారంగా గూగుల్ మ్యాప్‌లో సెర్చ్ చేస్తే చాలు వారికి లొకేషన్ స్మార్ట్ ఫోన్ మీద ప్రత్యక్షమై దారి చూపిస్తుంది. ఎలాంటి గందరగోళం లేకుండా ఏ అధికారైనా పోలింగ్ స్టేషన్‌కు చేరుకొనే సౌకర్యం జియో ట్యాగింగ్‌తో సులువవుతుంది. 2775 పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను కూడా పోలీసులు పూర్తి చేశారు. ప్రస్తుతానికి పోలింగ్ కేంద్రాల భద్రతను ఆయా సెక్టార్ ఎస్‌ఐలతో పాటు ఎస్‌హెచ్‌వో నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

సైబరాబాద్ పరిధిలో మొత్తం 209 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. ఇందులో 191 సమస్యాత్మక ప్రాంతాలు, 18 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించారు. వీటికి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లను చేసుకొన్న పోలీసు అధికారులు నిత్యం ఆ ప్రాంతాల్లో నెలకొంటున్న పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన విధంగా సిబ్బంది మొహరిస్తారు. అదే విధంగా ఈ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్‌లను నిర్వహించి అనుమానితులపై నిఘా పెంచుతారు. పోలీసు కమిషనర్ సజ్జనార్ ప్రతి రోజు ఎన్నికల ప్రణాళికలను అధ్యయనం చేస్తూ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, షాద్‌నగర్ నియోజకవర్గాల పరిధి పూర్తిగా వస్తుండగా పటాన్‌చెరు, మేడ్చల్, చేవెళ్ల, జూబ్లీహిల్స్, కల్వకుర్తి, సనత్‌నగర్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు సంబంధించిన కొన్ని పోలింగ్ స్టేషన్లు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోకి వస్తున్నాయి.

ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్
ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రతి రోజు సమీక్షించుకొనేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో సీపీ, డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌వోలతో పాటు ఇరత అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ వాట్సాస్ గ్రూపు ద్వారా ప్రతి రోజు చేపడుతున్న చర్యలతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో సమాచారం పెడుతారు. అదే విధంగా రోజు వారీగా మారుతున్న పరిస్థితులపై ఈ గ్రూపులో సమాచారాన్ని పంచుకుంటారు. ఈ గ్రూపును ఎలక్షన్ సెల్ అధికారులు 24/7 పరిశీలిస్తారు.

సైబరాబాద్‌లో మొత్తం 1068 తుపాకులు...
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ ఉన్న తుపాకుల సంఖ్య 1068. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వీటిని సంబంధిత పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేయాలని సీపీ సజ్జనార్ ఆదేశించారు. ఇప్పటి వరకు 500 మంది తమ ఆయుధాలను డిపాజిట్ చేశారు. మిగతా ఆయుధాలను కూడా త్వరలో పోలీసులు డిపాజిట్ చేసుకోనున్నారు. గడువు లోపు డిపాజిట్ చేయని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
గత ఎన్నికల్లో 22 కోట్లు స్వాధీనం...
2014 ఎన్నికల సందర్భంగా సైబరాబాద్ పోలీసులు మొత్తం 168 కేసులను నమోదు చేశారు. 22 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 168 కేసుల్లో మొత్తం 250 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులలో చార్జిషీట్లు దాఖలు చేసిన పోలీసులు 72 కేసుల్లో శిక్షలు పడేలా ఆధారాలు నిరూపించారు. మరో 30 కేసుల్లో విచారణ కొనసాగుతుంది. ఇంకా కొన్ని కేసులు అండర్ ఇన్విస్టిగేషన్‌లో ఉన్నాయి..168 కేసులలో నగదు, మద్యం సరఫరా, సమయానికి మించి ప్రచారం, పార్టీల కార్యకర్తల మధ్య గొడవలకు సంబంధించిన అభియోగాలు నమోదయ్యాయి.

455
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles