పార్కులతో ప్రశాంతత

Sat,October 20, 2018 12:43 AM

-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి
శేరిలింగంపల్లి : ప్రశాంతమైన జీవనానికి పార్కులు దోహదం చేస్తాయని, బిజీ లైఫ్‌లో ఇప్పుడు ప్రతిఒక్కరూ పార్కుకెళ్లాలని అనుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి అన్నారు. గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన డాగ్‌పార్క్, గౌలిదొడ్డి జర్నలిస్టు కాలనీలోని పంచతంత్ర పార్కులను ఆయన దసరా రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా డాగ్‌పార్క్‌లో ఉన్న సౌకర్యాలు, ప్రత్యేక క్రీడా పరికరాలు, పంచతంత్ర పార్కు ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ కుటుంబంతో కలిసి ఉత్సాహంగా గడిపేందుకు ఈ పార్కులు ఎంతో దోహదం చేస్తాయని, సాయంత్రం సమయంలో వాకింగ్ చేసుకునేలా వాకింగ్ ట్రాక్‌లను తీర్చిదిద్దారని కొనియాడారు. ఆహ్లాదకర వాతావారణంలో నగరవాసులు సేద తీరేందుకు పార్కులు ఉపయోగకరంగా ఉంటాయని, వీటిని ఉపయోగించుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్ కమిషనర్ దాసరి హరిచందన మాట్లాడుతూ 1.2 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలంగా డాగ్‌పార్క్‌ను తీర్చిదిద్దామని, ప్రత్యేక లాన్లు, హంపి థియేటర్, ఫౌంటేన్లు, పెంపుడు జంతువుల కోసం అధునాతన క్రీడా పరికరాలు, లూకేఫ్‌తోపాటు 1.2 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌ను నిర్మించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, శేరిలింగంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకన్న, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్‌లో వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కు ప్రారంభం
బంజారాహిల్స్,నమస్తే తెలంగాణ : వాననీటిని సంరక్షించుకుంటేనే రాబోయే తరాలకు నీటి కరువు రాకుండా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే.జోషి అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జలమండలి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం.51లో ఏర్పాటు చేసిన వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కును సీఎస్ గురువారం ప్రారంభించారు. వివిధ రకాలైన ఇంకుడుగుంతల నిర్మాణాలు, నీటిని పొదుపు చేసుకునే పద్ధతులు, నీటి విలువను తెలియజేసే ఆడిటోరియం తదితర నిర్మాణాలను రూ.2 కోట్ల వ్యయంతో ఈ థీమ్ పార్కును నిర్మించినట్లు జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి థీమ్ పార్కు విశేషాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

200
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles