బొట్టు..బొట్టు..ఒడిసిపట్టు!!

Thu,October 18, 2018 01:12 AM

ఏమిటి- వర్షపు నీటి సంరక్షణ పద్ధతుల ఉద్యానవన ప్రాంగణం (థీమ్ పార్క్)
ఎక్కడుంది - జూబ్లీహిల్స్ రోడ్ నం. 51లో
ఎంత స్థలం- ఒకటిన్నర ఎకరా
ఏమున్నాయి- వాన నీటిని ఒడిసి పట్టే 42
నమూనాలు
ప్రత్యేకత- దేశంలోనే ఇలాంటి పార్కు..రెండోది
ప్రయోజనం - ఈ పార్కులో ఏడాదికి 60 లక్షల లీటర్ల నీటిని ఒడిసిపట్టొచ్చు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మానవ మనుగడకు నీటి వనరు ఎంతో ముఖ్యమైనది. భూగర్భ జలాలను పెంపొందించుకోవడం మనిషి ప్రధాన కర్తవ్యం..ఆ దిశగా జలమండలి చర్యలు చేపట్టింది. వాననీటి సంరక్షణకు రాష్ట్రంలోనే తొలి థీమ్ పార్కును జూబ్లీహిల్స్ రోడ్ నెం. 51లో ఏర్పాటు చేసింది. బెంగళూరు ఆదర్శంగా ఏర్పాటు చేసిన ఈ నీటి సంరక్షణ ప్రాంగణంలో వాననీటిని ఒడిసిపట్టే 42 రకాల నమూనాలపై అన్ని వర్గాలకూ అవగాహన కల్పించనున్నారు. ప్రధానంగా చిన్నారులకు నీటి సంరక్షణ పద్ధతులపై తెలియజెప్పేందుకు ఒక ఆడిటోరియం, నీటిని మళ్లించే గజెబో నిర్మాణాలు, నీటి ప్రవాహాల తీరు, పచ్చదనం, చిన్న చిన్న ఉద్యానాలు ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్నాయి. నీటి సంరక్షణ, పునర్వినియోగం, శిక్షణ ప్రధానాంశాలుగా ఏర్పాటు చేసి నీటి పాఠం చెప్పేందుకు సిద్ధమైన ఈ వాన నీటి సంరక్షణ ఉద్యాన ప్రాంగణాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి గురువారం ప్రారంభించనున్నారు.

దేశంలో రెండోది
వర్షపు నీటిని సంరక్షించాలనే స్పూర్తి ప్రతి ఒక్కరిలో నింపేలా జలమండలి అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండాలనే లక్ష్యంతో ఈ నీటి పాఠం చెప్పే విధంగా పార్కును నిర్మించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 51లోని దాదాపు ఒకటిన్నర ఎకరాల స్థలంలో వాననీటి సంరక్షణ పద్ధతులను తెలిపేందుకే ప్రత్యేకంగా ఈ పార్కు నిర్మించారు. బెంగళూరు జయనగర్‌లో నిర్మించిన కర్ణాటక స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సైంటఫిక్ అధికారి ఏఆర్ శివకుమార్ ఈ పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. మూడు కోట్లు ఖర్చు చేశారు. చిన్న చిన్న పార్కులతో పాటు 51 సీట్లతో కూడిన ఆడిటోరియం, పక్కనే మ్యూజియం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వాననీటి సంరక్షణపై ఈ ఆడిటోరియంలో అవగాహన ఇస్తారు. ఎలాంటి నల్లాలు వాడితే నీటిని పొదుపు చేయవచ్చో చిట్కాలు చెబుతారు. వాన నీటిని ఎలా సంరక్షించుకోవాలో ఇక్కడ వివరిస్తారు. చిన్నారులకు క్విజ్ పోటీలను నిర్వహించనున్నారు. అర్కిటెక్ట్‌లకు ఇంజనీర్లకు, ప్లంబర్, కాంట్రాక్టర్లకు ఇక్కడ వాన నీటిని ఒడిసిపట్టే పద్ధతులపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. శిక్షణ పొంది ధ్రువీకరణ పత్రం తీసుకుంటేనే వారి లైసెన్స్ పునరుద్ధరణ అయ్యేలా నిబంధన అమలు చేయనున్నారు.

ప్రత్యేకతలు
- నీటిని ఒడిసిపట్టేందుకు దాదాపు 42 రకాల పద్ధతులను ఉపయోగించారు.
- నాలుగు గజెటోలను (గొడుగు అకారంలో ఉన్న నిర్మాణం) నిర్మించారు.
- వాననీరు వీటి మీద పడగానే ఆయా నీరు పల్లపు ప్రాంతం ద్వారా పక్కన ఏర్పాటు చేసే సంపులలోకి చేరేలా తీర్చిదిద్దారు.
- పార్కులో రెండు సంపు నిర్మాణాలతో పాటు రెండు ఇంజెక్షన్ బోర్‌వెల్స్ ఒక సాధారణ బోర్‌వెల్ ఏర్పాటు చేశారు.
- ఈ పార్కులో ఓపెన్ వెల్, బోర్‌వెల్ సర్పేస్ రీఛార్జ్ పిట్‌లతో పాటు పాదచారులకు దారులు, జోడియాక్ పార్కు, కూర్చొనే ఏర్పాట్లు, పచ్చిక బయలు, ఔషద మొక్కలతో కూడిన ఉద్యానాలను ఏర్పాటు చేశారు.
- ప్రధానంగా విద్యార్థులను ఆకట్టుకునేందుకు పలు రకాల క్రీడలను పరిచయం చేయనున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ స్కేలుపై మనిషి నిలబడితే ఆ వ్యక్తి ఒంట్లో ఎంత నీరు ఉందోతెలుసుకోవచ్చు.
- దీంతో పాటు బరువుకు తగ్గట్టుగా పక్క నుండే జార్‌లోకి నీరు వచ్చి చేరుతుంది. ఇలా చిన్నారులకు నీటిపై అవగాహన కల్పించనున్నారు.
- పిల్లలను ఆకట్టుకునేందుకు చోటాభీమ్ థీమ్‌లో 5 నిమిషాల నిడివితో వాన నీటి సంరక్షణపై అర్థమయ్యేలా లఘుచిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
- గోదావరి-కృష్ణ జలాలను చూపేందుకు, నీటిని శుద్ధి చేసేలా త్రీడి రూపంలో హోలోగ్రాఫిక్ ప్రోజక్షన్ ద్వారా చూపనున్నారు.
- ఎలాంటి నల్లాలు వాడితే నీటిని సంరక్షించుకోవచ్చనే అంశాలను ప్రయోగాత్మకంగా మ్యూజియంలో చూపనున్నారు.
- ఈ థీమ్ పార్కు ద్వారా ఏడాదికి దాదాపు 60 లక్షల లీటర్ల నీటిని సంరక్షించవచ్చని అధికారులు అంచనా వేశారు.

580

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles