స్వైన్‌ఫ్లూ పంజా

Thu,October 11, 2018 01:13 AM

-తగ్గినట్లు తగ్గి విజృంభిస్తున్న వైరస్
-ఈనెలలోనే నగరంలో పది కేసులు నమోదు
-ఆందోళన చెందుతున్న నగరవాసులు
-వాతావరణ మార్పులతో పెరుగుతున్న కేసులు
-స్వైన్‌ఫ్లూ నివారణకు గాంధీలో మెరుగైన చికిత్స
-జిల్లా వైద్యాధికారి డా.వెంకటి వెల్లడి
గాంధీ దవాఖాన : ఇప్పుడిప్పుడే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటుండడంతో నగరంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. గతేడాది తగ్గుముఖం పట్టిన ఈ వైరస్ నవంబర్ రాకముందే విస్తరిస్తోంది. ఈ అక్టోబర్‌లోనే 10 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో ఇద్దరు మృతిచెందగా..మిగిలిన వారిలో కొంతమంది కోలుకున్నారు. మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది మొత్తం 15 కేసుల్లో గాంధీలో 12, ఉస్మానియాలో 1 , వేర్వేరు ప్రైవేటు దవాఖానల్లో రెండు కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈనెల 2న ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించగా, గాంధీ దవాఖానలో ఇద్దరు మృతిచెందినట్లు పేర్కొన్నారు. అక్టోబరు మాసం ప్రారంభం నుంచి నేటి వరకు 10 రోజుల్లోనే గాంధీలో మొత్తం 7 కేసులు నమోదైనట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఇందులో ఇద్దరు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. మరో నలుగురు దవాఖానలో చికిత్స పొందుతున్నారన్నారు. వారిలో సిద్దిపేటకు చెందిన మహిళ (55), గజ్వేల్‌కు చెందిన మరో మహిళ (45), రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు చెందిన మహిళ (32), వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన మరో మహిళ (50) తీవ్ర జ్వరం, చలితో నేరుగా ఈనెల 3న గాంధీలో చేరినట్లు చెప్పారు. మరో మహిళ చివరిదశలో చేరి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సూపరింటెండెంట్ వివరించారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు మొత్తం 12 కేసులు నమోదుకాగా.. ఇద్దరు మృతిచెందారని ఆయన తెలిపారు.

నోడల్ కేంద్రంగా గాంధీ దవాఖాన : జిల్లా వైద్యాధికారి డా.వెంకటి
స్వైన్‌ఫ్లూ చికిత్సకు గాంధీ దవాఖాన నోడల్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. స్వైన్‌ఫ్లూ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా ఐసోలేటెడ్ వార్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు తదితర లక్షణాలు ఉంటే నేరుగా ప్రభుత్వ దవాఖానలను ఆశ్రయించాలని ఆయన సూచించారు. చాలా మంది ప్రైవేటు దవాఖానల చుట్టూ తిరిగి పరిస్థితి విషమించాక ప్రభుత్వ దవాఖానలకు పరుగులు తీస్తున్నారని వాపోయారు. ప్రారంభ దశలోనే సర్కార్ దవాఖానలను ఆశ్రయిస్తే పరిస్థితి చేయిదాటకుండా ఉంటుందని, ప్రభుత్వ దవాఖానల్లో అన్నిరకాల వసతులు, మందులు అందుబాటులో ఉన్నట్లు డా.వెంకటి స్పష్టం చేశారు.

458

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles