సాహో.. సోషల్ మీడియా

Wed,September 19, 2018 12:45 AM

- నెట్టింట రాజకీయం.. జోరుగా ప్రచారం
- ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లే కీలకం
- అన్ని పార్టీల్లోనూ వినియోగం
- అభిప్రాయాల వెల్లడికి చక్కని వేదిక
- అభివృద్ధి నినాదానికి ఆదరణ
- నిర్ణయాత్మక శక్తిగా యువత
- ప్రతి ఒక్కరికీ యూత్ వింగ్స్, సోషల్ మీడియా టీమ్స్
- అదే వరుసలో గృహిణులు, ప్రైవేటు ఉద్యోగుల గ్రూపులు
- 2018 ఎన్నికల్లో ట్విట్, పోస్టింగులతో రాజకీయ వేడి
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సోషల్ మీడియా చరిత్ర సృష్టిస్తున్నది. గలగల మాట్లాడటమే కాకుండా చకచకా అభిప్రాయాలను పంచుకుంటున్నది. ఎన్నెన్నో భావాలను పలికిస్తూ, మరెన్నో ఊహాగానాలు వినిపిస్తున్నది. మారిన, మారుతున్న రాజకీయాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నది. అభివృద్ధి, సమగ్ర ప్రణాళికలపై చర్చలు.. ఇలా అన్ని కలబోసుకుంటున్నది.. ఈజిప్టులో రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేయించిన ఘనత సోషల్ మీడియాకే దక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రగతి పథాన్ని నిర్దేశించడమే కాకుండా, నాలుగేండ్లల్లో తెలంగాణలో ఏం జరిగిందో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. వాస్తవాల ప్రతిబింబం కనిపిస్తోంది. నిధుల లెక్కలు, ప్రాజెక్టుల పురోగతి, జనామోదం, హర్షాతిరేకాలు.. సామాన్యుల విన్నపాలు, అభివృద్ధితో మార్పులు, వ్యవసాయంలో గణనీయాభివృద్ధి, నగరంలో సమస్యలకు శాశ్వత పరిష్కారం.. ఇలా ఒక్కటేమిటి? సమస్త ప్రగతి నివేదికలకు లక్షల లైక్‌లు, వేలల్లో షేరింగులతో జోరు మీద ఉన్నాయి.

అంచనాకు అందని స్పందన
తెలంగాణ ప్రభుత్వ పథకాలకు, ప్రాజెక్టులకు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పీచ్‌లకు అత్యధిక ప్రచారం లభిస్తోంది. యూత్ ఐకాన్‌గా మారిన మంత్రి కేటీఆర్ ఫాలోయింగ్, ట్వీట్లకు స్పందన అంచనాకు అందడం లేదు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు అధికంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సామాజిక మాధ్యమ భాగస్వాముల సంఖ్య గణనీయంగా ఉంది. అయితే, ఆ విభాగంలో మంత్రి కేటీఆర్ అభిమానులు అత్యధికం. అందుకే అనేక వ్యతిరేక వర్గాలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉన్నా, టీఆర్‌ఎస్, ప్రభుత్వ అనుకూల గ్రూపుల ధాటికి తట్టుకోవడం కష్టంగా మారింది.

ప్రతి రాజకీయ కదలికకో పోస్ట్
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ప్రతి నాయకుడికి ప్రత్యేక పేజీలు నడుస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ యూత్ వింగ్‌ల పేరిట ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ గ్రూపులు పని చేస్తున్నాయి. తమ నాయకుడు పొద్దున నుంచి రాత్రి దాకా చేస్తున్న ప్రతీ కార్యక్రమాన్ని సభ్యులకు అందిస్తున్నారు. వాటిని షేర్ చేస్తూ ఎక్కువ మందికి చేరేటట్లుగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ప్రతి కదలికను ఓటర్లకు చేరవేసేందుకు సమాయత్తమయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వంలోని ప్రతీ పథకం, ప్రాజెక్టు, అభివృద్ధి ప్రణాళిక, పని ఫొటోలు, లెక్కలతో సహా జనానికి చేరవేస్తున్నారు. ప్రధానంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పేరిట ఎన్నో పేజీలు రూపుదిద్దుకున్నాయి. వాటితో లక్షల మందికి రోజు వారి అంశాలు బహుళ ప్రాచూర్యంలోకి తీసుకెళ్తున్నారు.

ఎన్నికలకు ముందే..
ఎన్నికల సమరం మొదలు కాకముందే ఏయే నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలబలాలపై సోషల్ మీడియాలో సర్వేలు నడుస్తున్నాయి. ఎవరు గెలుస్తారు? ఎందుకు? కారణాలేమిటి? అనేక సోపానాలను సామాజిక మాధ్యమం ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఏ అభ్యర్ధికి ఓటేస్తారు? అభ్యర్థి ఎవరైతే బాగు? అభివృద్ధి ఎవరితో సాధ్యం?.. ఇలాంటి అనేక ప్రశ్నలతో ఓటింగ్ కూడా నడుస్తున్నది. అయితే, అన్నింట్లోనూ అభివృద్ధికే పట్టం కడుతుండుతామని నెటిజన్లు పేర్కొనడం గమనార్హం.

అభ్యర్థుల ఎంపిక మొదలు.. అన్నీ..
ఔత్సాహిక అభ్యర్థులు తాను పోటీ చేస్తున్నానని, మద్దతు ఇవ్వండంటూ ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టారు. అలాగే సామాన్యులు కూడా పోటీకి సై అంటున్న వారి ఫొటోలు పోస్ట్ చేసి, ఎవరైతే బాగు అంటూ అభిప్రాయ సేకరణను నడిపిస్తున్నారు. తన పార్టీ కార్యకర్తలకు, సామాన్యుల మొబైళ్లకు వారి నియోజకవర్గాల్లో అభ్యర్థి బాగో అభిప్రాయాన్ని చెప్పాలంటూ సంక్షిప్త సమాచారాలను పంపిస్తున్నారు. రానున్న రోజుల్లో సోషల్ మీడియా అతి పెద్ద ప్రచారాస్త్రంగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రతి అడుగూ సంచలనమే..
రాష్ట్రంలో యువత ఓట్లకు గాలం వేయాలంటే సోషల్ మీడియా, వెబ్‌సైట్లను ఆశ్రయించాలని అన్ని పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ నెటిజన్ల ఫోరం కృషి అసాధారణమైంది. ప్రతి అడుగూ ఓ సంచలనాన్ని సృష్టించింది. లక్షలాది మందిలో తెలంగాణ భావజాలాన్ని నింపిన ఖ్యాతి సొంతమైంది. ప్రతి ఉద్యమ కదలికకు ఓ రూపాన్ని ఇచ్చారు. ఇప్పుడేమో ఈ నాలుగేండ్ల అభివృద్ధి పథం వైపు జనాన్ని నడిపిస్తున్నారు. అందుకే అన్ని పార్టీలు కేవలం ఐదు వారాల్లోనే ముగియనున్న ఎన్నికల్లో దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి వ్యూహరచన చేస్తున్నారు. దీని కోసం ప్రతి పార్టీ సాంకేతిక బృందాలను నియమించుకున్నాయి. టీఆర్‌ఎస్ ముందు వరుసలో ఉంది. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ వర్గాలు కూడా అడుగులేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఏఐఎంఐఎం పార్టీ కూడా దీనిలో అడుగు పెట్టింది. విద్యావంతులు, యువతను ఆకట్టుకునేందుకు ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు వారి ఆచరణే స్పష్టం చేస్తోంది.

అదరగొడుతున్న ప్రచారం
రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియా ద్వారానే ఓటర్లను చేరేందుకు సంక్షిప్త సమాచారాలతో ఊదరగొట్టేస్తున్నాయి. అడ్వర్టయిజ్‌మెంట్ల కంటే ఈ మీడియా ద్వారానే విస్తృతంగా, ఉచితంగా ప్రచారం చేసుకోవచ్చునని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. ఫేస్‌బుక్, వికీపీడియా, బ్లాగులు, మైక్రో బ్లాగులు, యూట్యూబ్, విర్చువల్ గేమ్-వరల్డ్(యాప్స్) వంటి వినియోగం ప్రభావితం తీవ్రంగా కనిపిస్తోంది. అయితే, ఎన్నికల కమిషన్ పోటీ చేయనున్న అభ్యర్థుల ఆన్‌లైన్ కార్యకలాపాలను నియంత్రించనుంది. కానీ, అభ్యర్థి సంబంధీకుల ఖాతాల నుంచి ప్రచారం విస్తృతం కానుంది. ఒకే చోట ప్రసంగిస్తూ ఇతర ప్రాంతాల్లోని ప్రజలకూ సందేశాన్ని వినిపించేందుకు ఆన్‌లైన్ వ్యవస్థలను వినియోగిస్తున్నారు. గంపగుత్త సంక్షిప్త సమాచారాల ప్రయోగానికి కూడా మంచి స్పందన లభిస్తోంది.

482

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles