ప్రాధాన్య క్రమంలో పరిష్కరించండి

Tue,September 18, 2018 03:21 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : డబుల్ బెడ్ రూం ఇండ్ల దరఖాస్తుల స్వీకరణకు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ జీ రవి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా అధికారులతో కలిసి పిటిషన్లను స్వీకరించగా, చాలా మటుకు పిటిషన్లు డబుల్‌బెడ్ రూం ఇండ్లకు చెందినవే ఉండటంతో ఈ ఆదేశాలిచ్చారు. ఇక ఆశావాహులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసి, వాటిని తీసుకొచ్చి కలెక్టరేట్‌లో సమర్పిస్తుండటాన్ని గమనించిన ఆయన, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక ప్రజావాణిలో స్వీకరించిన పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంపై అధికారులను ప్రశ్నించారు. విద్యాశాఖలో 27, బీసీ సంక్షేమశాఖలో ఐదు చొప్పున పిటిషన్లు అపరిష్కృతంగా ఉండటంతో కారణాలు అడిగి తెలుసుకున్నారు. డీఆర్వో పూర్ణచంద్ర, ఏఓ నవీన్‌కుమార్, సీపీఓ రామభద్రం, బీసీ సంక్షేమాధికారి విమలాదేవి, ఉపాధికల్పనాధికారి మైత్రిప్రియ, జీఎం డీఐసీ తుల్జానాయక్ సహా ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అక్కడికక్కడే పరిష్కార మార్గం..
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు జేసీ అక్కడిక్కడే పరిష్కార మార్గం చూపించారు. దోబీఘాట్‌లో బోరు ఎండిపోవడంతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, బోరును వెంటనే పునరుద్ధరించాలని బాగ్‌అంబర్‌పేట మల్లికార్జుననగర్‌కు చెందిన రజకులు దరఖాస్తు ఇవ్వగా, బోరును వెంటనే పునరుద్ధరించాలని బీసీ సంక్షేమాధికారికి జేసీ ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రంలో మౌలిక వసతులు, పైకప్పు లీకవుతుండటంతో పిల్లలం తా అవస్థలు పడుతున్నారని, మరమ్మతులు చేయాలని అమీర్‌పేట ఎల్లారెడ్డిగూలోని సంజయ్‌గాంధీనగర్ వాసు లు అభ్యర్థించగా, ప్రత్యామ్నయ వసతులు కల్పించాలని మహిళా శిశు సంక్షేమశాఖాధికారులకు సూచించారు.

ప్రజావాణిలో స్వల్ప షార్ట్‌సర్యూట్
ప్రజావాణి జరుగుతున్న సమయంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో స్వల్ప విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే కంప్యూటర్ కనెక్షన్ వద్ద షార్ట్ సర్క్యూట్‌తో మంటలు లేశాయి. ఒక్క ఉదుటున శబ్ధం చేస్తూ మంటలు వెలువడటంతో ప్రజావాణికి హాజరైన వారంతా ఆందోళన చెందారు. అక్కడే ఉన్న సిబ్బంది, అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం యథావిధిగా దరఖాస్తులు స్వీకరించారు.

222

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles