మానవ సేవే.. మాధవ సేవ

Mon,September 17, 2018 12:21 AM

- సహాయార్థికి అండగా మనం సైతం
-సేవే దైవం.. పది మందికి సాయపడుదాం
- మనిషిని మనిషిగా చూద్దాం.. తోటివారికి చేయూతనిద్దాం
-కేరళకు నాలుగు రోజులపాటు కాదంబరి బృందం సేవలు
- మెతుకు మెతుకు కలిస్తేనేముద్ద.. ముద్ద ముద్ద కలిస్తేనే...
- కేటీఆర్, సంతోషన్నలు నాకు దైవ సమానులు
- పేదోడిని పట్టించుకోని వాడిపైనే నా పోరాటం: కాదంబరి కిరణ్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పేదోడైతేనేం.. పెద్దోడైతేనేం.. మనిషిని మనిషిగా చూద్దాం... సహాయం కోరితే వాళ్లకు చేతనైనంత సాయపడుదాం. అలా చేయూతనిస్తూ... సేవ చేద్దాం. అలాంటి సేవ (సర్వీసు)లోనే దైవం ఉందంటారు కాదంబరి కిరణ్. అది సినిమా పరిశ్రమ కానీ, సమాజంలో బడుగు, బలహీనుల అవసరం మరేదైనా.. కానీ, అనారోగ్యమైనా.., ఇబ్బందులైనా.., మరే సమస్యల్లోనైనా సహాయం కోరితే నేనున్నాను అంటూ భరోసా కల్పించాలి అని కిరణ్ అంటున్నారు. ఈ రోజుల్లో అలాంటి వారు కరువయ్యారని, అందుకే, తనకు తోచిన విధంగా నలుగురిని పోగు చేసుకొని, నలుగురి కోసం తాను బతకాలని భీష్మించుకుని ఒక స్వచ్ఛంద సంస్థను రూపొందించుకున్నారు. జీవితం చాలా చిన్నది. ఏ క్షణాన గాలి బుడగగా పేలిపోతుందో తెలీదు.

భూమి మీద ఉన్నణ్నాళ్లు నలుగురి క్షేమం కోరుతూ బతుకుదాం. ఇరుగింట్లో మనిషిపోతే.. పొరుగింట్లో తెలియకుండా బతుకుతున్నాం. ఏదైనా సమస్య వచ్చి పడిందంటే.. ఎంతో మంది ఆ సమస్యను పరిష్కరించుకోలేక కొట్టుమిట్టాడుతూ.. చివరికి ఎన్నో కుటుంబాల వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పలు సమస్యలతో ఎన్నో కుటుంబాలు కృంగిపోతున్నాయి. అందుకే పది మంది కోసంపాటు పడేందుకు నా చేతుల్లో ఉన్న శక్తి మేరకు అబాగ్యులు, అనాథలు, బీద, బడుగు, బలహీనుల కోసం స్వయంగా సహాయ పడేందుకు 2014లో ఒక వేదికను తయారు చేసుకున్నాను అని వివరించాడు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని మనం చేతులు ముడుచుకు కూర్చుంటే.. ఏదీ జరుగకపోగా... జీవితం అసాంతం శూన్యమవుతోంది. అందుకే మనం సైతం..తో పీడిత, బడుగు, బలహీన వర్గాలకు సేవలందించేందుకు, సాయపడేందుకు కంకణం కట్టుకున్నాను అని కాదంబరి కిరణ్ చెప్పారు.

ఎక్కడెక్కడికో పరుగులు.. సేవలు
ఇటీవల యాప్రాల్ పరిధిలోని కౌకూర్ గ్రామంలో ఇద్దరు చిన్నారులు గాలి పటాలు ఎగురవేస్తూ విద్యుదాఘాతానికి గురై భవనంపై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై ఒక చేయి, కాలు పోగొట్టుకున్నారు. ఈ వార్తను చదివి చలించిపోయిన కిరణ్, ఆ వార్తను రాసిన విలేకరి ఫోన్ నంబరు తీసుకొని వారి గురించి ఆరా తీసి వారి కుటుంబ, ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని, భువనగిరిలో వారు చికిత్స పొందుతున్న విషయాన్ని సేకరించారు. భువనగిరిలోని జవహర్‌నగర్‌లోని ఆహనా దవాఖానలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారికి రూ.12 వేలను అందజేశారు. చుట్టుపక్కల ప్రజలు పోగవ్వడంతో కిరణ్ వారిని ఉద్దేశించి జరిగిన కథంతా చెప్పి మన తోటి వారు ఆపదలో ఉన్నారు.. నేనూ సాయం చేశాను. మీకు చేతనైనంత సాయం చేయండి అని ఆయన వారికి హితబోధ చేశారు. దీంతో స్పందించిన జనం తలా కొంత ఇవ్వగా.. పోగైన మొత్తాన్ని ఆ పిల్లల తల్లిదండ్రులకు అందజేశారు.

జర్నలిస్టు కుమారుడికి సాయం అందేలా కృషి..
వరంగల్ జిల్లాకు చెందిన బొడ్డుపల్లి రాజ్‌కుమార్ అనే ఒక జర్నలిస్టు కుమారుడికి ఊపిరితిత్తుల సమస్య పుట్టినప్పటి నుంచి ఉన్నది. కృత్రిమ శ్వాసతోనే ప్రస్తుతం జీవనం సాగిస్తున్నాడు. అతడికి రోజూ ఆక్సిజన్, ధర గల మందులు వాడాల్సి ఉంది. ఇవన్నీ ఆ కుటుంబం భరించే పరిస్థితిలో లేదు. దాతలు, వైద్యులు, ఉన్నతాధికారులు, స్నేహితుల నుంచి విరాళాలు సేకరించి సహాయం మొత్తాన్ని ఆ చిన్నారికి అందిస్తున్నారు. చిన్నారి ఎదుగుతున్న కొద్దీ సమస్య పరిష్కారమవుతుందని వైద్యులు చెప్పారని కిరణ్ తెలిపారు. జర్నలిస్టు కుమారునికి కిరణ్ తన వంతుగా రూ.30వేలను, సీనియర్ నటులు కృష్ణ, విజయనిర్మల చేతుల మీదుగా అందించారు. చిన్నారి విషయం పూర్తిగా తెలుసుకొని పెద్ద మనసు చేసుకొని రూ.2లక్షలను విరాళంగా ఇచ్చారు.

డ్యాన్సర్ కూతురుకు న్యూరో బ్లాస్ట్..
సినీ పరిశ్రమకు చెందిన డ్యాన్సర్ శంకర్ (397) కూతురుకు (లివర్ క్యాన్సర్) న్యూరో బ్లాస్ట్ సమస్యతో, ఇంకా ఎముకల సమస్యతో బాధపడుతున్నది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కిరణ్, ఆ చిన్నారి తల్లిదండ్రులు తెలిసిన వైద్యులు, నాయకుల వద్దకు తిరుగుతూ సహాయాన్ని అర్థిస్తున్నారు.
సీనియర్ సినీ దర్శకులు గార సత్యం దత్త పుత్రుడు
సీనియర్ సినీ దర్శకులు గార సత్యం దంపతులకు సంతానం లేదు. సత్యం లెక్కలేనన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గాను, మరి కొన్ని చిత్రాలకు దర్శకుడిగాను పని చేశారు. ప్రస్తుతం వారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అన్నట్టుగా.. ఈ దంపతులకు అన్నీ తానై కాదంబరి కిరణ్ చూసుకుంటున్నారు. ఇటీవల గార సత్యం మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎలాంటి సమస్యలేదని, తన దత్త పుత్రుడు అయిన కిరణ్ ఉండగా.. అవి దరిచేరవని ఆయన సేవలను ప్రస్తుతించారు.
ఎంతో మందికి సేవలు
కిరణ్ ఇప్పటి వరకు 800మందికి సాయపడుతూ ఆదుకున్నట్టు తెలిపారు. 2018లోనే ఇప్పటి వరకు 90 మందికి చేయూతనిచ్చినట్టు తెలిపారు. సహాయపడటానికి పరిచయం అక్కర్లేదంటారు. సాటి మనిషిని మనిషిగా గుర్తించడమే ధ్యేయమంటారు. మనం ఊబిలో ఉన్నప్పుడు భగవంతుడు మనల్ని పైకి లాగుతాడు. ఆ సందర్భంలో మన ఇంకో చేతిని మరొకరికి సాయపడేలా అందించాలంటాడు కిరణ్.

660

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles