మహా గణపతిం..మనసా స్మరామి

Thu,September 13, 2018 12:15 AM

-నేడు గణేశ్ నవరాత్రోత్సవాలు ప్రారంభం l 14 వేల మంది సిబ్బందితో బందోబస్తు
-రూ. 10 కోట్లతో నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు
-విద్యుత్ సమస్యలు రాకుండా అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గణేశ్ నవరాత్రోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ సారి ఖైరతాబాద్ గణేశుడు సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా దర్శన మిస్తున్నాడు. గురువారం తొలి పూజకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వినాయక నిమజ్జనం కోసం రూ.10 కోట్లతో జీహెచ్‌ఎంసీ చేపట్టిన పనులు తుది దశకు చేరాయి. ఉత్సవాలకు 14 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఆంక్షలు విధించారు. విద్యుత్ సమస్యలు రాకుండా అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చుతున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి. రఘుమారెడ్డి తెలిపారు. హుస్సేన్‌సాగర్ సహా, గ్రేటర్‌లోని 21 చెరువుల్లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా కాలుష్య స్థాయిలను లెక్కించేందుకు పీసీబీ శాంపిళ్లను సేకరించనున్నది.

ఖైరతాబాద్ : 64 ఏండ్లుగా భక్తులకు ఇలవేల్పుగా విరాజిల్లుతున్న ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా దర్శమివ్వనున్నాడు. ఏడు ఆదిశేషుల పడగల నీడలో....ఏడు ముఖాలతో....14 చేతులతో లక్ష్మి, సరస్వతి సమేతుడై 57 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పుతో నిండైన రూపంలో భక్తులకు కనువిందు చేయనున్నాడు. నేటి నుంచి పదకొండు రోజుల పాటు పూజలందుకోనున్నాడు. నేడు శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద నేతృత్వంలో ప్రధానార్చకులు రంగరాజాచార్యుల బృందం నిర్వహించే ఈ తొలి పూజకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ పి. విజయారెడ్డి హాజరవుతారు.

ఉదయం 7 గంటల నుంచి..
నేడు వినాయక చవితి సందర్భంగా శ్రీ సప్తముఖ కాలసర్పమహాగణపతి పూజా కార్యక్రమాలు ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమవుతాయి. తొలుత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేతన్నలు స్వహస్తాలతో రూపొందించిన 75 అడుగుల కండువ, జంజాన్ని స్వామి వారికి సమర్పిస్తారు. అంతకుముందు వాటిని సెన్సేషన్ థియేటర్ రోడ్ మీదుగా గుర్రపు బగ్గీలో మేళ తాళాలు, కోలాటల మధ్య ఊరేగిస్తూ మండపానికి చేరుకుంటారు. అలాగే గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన గరిక మాల (75 అడుగులు) అలంకరిస్తారు. 10.52 గంటలకు స్వామి వారికి అతిథులు పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. సరిగ్గా 11.52 నిమిషాలకు తొలిపూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా సప్తముఖుడి ప్రాణప్రతిష్ఠాపనోత్సవం జరుగుతుంది. అనంతరం భక్తులకు దర్శనానికి అవకాశం కల్పిస్తారు.

సప్తముఖుడి దర్శనం...సర్పదోష నివారణం...
ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడికి ఓ ప్రత్యేక ఉంది. ప్రతి ఏడాది గణేశుడి ప్రతిమకు ఓ పురాణేతిహాసం ఉంటుంది. భక్తుల కష్టాలు తొలగించే రూపాలను తయారు చేయడం ఆనవాయితీగా వస్తుండగా, ఈ ఏడాది భక్తుల సర్పదోషాలను నివారించేందుకు ఈ సప్తముఖుడికి సిద్ధాంతులు, వేదపండితులు రూపకల్పన చేయగా, మహా శిల్పి రాజేంద్రన్ ఆ రూపాన్ని మనకు సాక్షాత్కరింప చేశారు. కాగా, సప్తముఖ కాలసర్ప మహాగణపతిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమని విగ్రహ రూపకర్త జ్యోతిర్మయ పీఠాధిపతి విఠల్ శర్మ దివ్య జ్ఞాన సిద్ధాంతి చెబుతున్నారు. ఏడు పడగలు ఏడు కాలాలను సూచిస్తుందని, ముఖ్యంగా సర్పదోష నివారణ కోసం కాలహాస్తీ మహాక్షేత్రానికి వెళ్లి వస్తే ఎలాంటి పుణ్యం దక్కుతుందో ఈ మహాదేవుడి దర్శనం ద్వారా అలాంటి ఫలితం వస్తుందన్నారు. పదకొండు రోజుల పాటు దూప, దీప నైవేద్యాలతో వ్రతకల్పాన్ని నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో పంట పొలాలు సమృద్ధి పండి, ప్రజలకు శుభాలు చేకూరుతాయన్నారు.

696

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles