మెట్రో పరుగులు ప్రత్యేకం

Fri,August 31, 2018 12:40 AM

- దేశంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్ట్
- మెట్రో రాకపోకల వివరాలు గుగూల్‌తో అనుసంధానం
- త్వరలో అందుబాటులోకి రానున్న ఎల్బీనగర్ , హైటెక్‌సిటీ మార్గం


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ నగర ప్రజల సుఖవంతమైన ప్రయాణానికి నిర్మిస్తున్న మెట్రోరైలు ప్రాజెక్టు నగర సిగలో ప్రత్యేకతగా నిలువనుంది. లక్షల మంది ప్రయాణికులకు రవాణాసౌకర్యం కల్పించేందుకు మెట్రో రూపుదిద్దుకుంటున్నది. మూడు కారిడార్లుగా 72 కిలోమీటర్ల మెట్రోరైలులో ఇప్పటికే 30 కిలోమీటర్లు అందుబాటులోకి రాగా మిగతా ప్రాజెక్టు అతి త్వరలో అందుబాటులోకి రానుంది. రూ.15 వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు దేశంలోనే అది పెద్ద పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్(పీపీపీ) ప్రాజెక్టుగా రికార్డులకెక్కింది. మొదటిదశలో భాగంగా నాగోల్ నుంచి మియాపూర్ మార్గాన్ని గత సంవత్సరం నవంబర్ 28న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రారంభించి 30 కిలోమీటర్ల కమర్షియల్ ఆపరేషన్స్‌కు శ్రీకారం చుట్టారు. మొదటి దశ 30 కి.మీ. మెట్రో రైలు మార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి. దీనిని ప్రధాని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించిన మెట్రోరైలును తెలంగాణ మహిళా ఫైలట్ నడిపించడం విశేషం. ఒకేసారి 1000 మంది ప్రయాణించవచ్చు. ప్రతి ఏడు నిముషాలకు ఒక రైలు నడుపుతున్నారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మెట్రో స్వంతం
హైదరాబాద్ మెట్రోరైలు సాంకేతిక పరిజానాన్ని స్వంతం చేసుకుంది. ఆటోమేటిక్‌గా తెరుచుకునే తలుపులతోకూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు మెట్రోలో ఉన్నాయి. మెట్రో రైళ్ల వ్యవస్థను పర్యవేక్షించిందేకు అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెం టర్‌ను ఉప్పల్ మెట్రోరైలు డిపోలో ఏర్పాటు చేశారు. మొత్తం 72 కిలోమీటర్ల పొడవున నడిచే రైళ్లను ఇక్కడి నుంచే నియంత్రిస్తారు. ఈ సెంటర్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్ వ్యవస్థ ఉంది. హైదరాబాద్ మెట్రో అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థతో భారత దేశములోనే మొట్ట మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం ఇందులో ప్రవేశపెట్టారు. భద్రతకు పెద్దపీట వేస్తూ కోచ్‌లలో వీడియో కెమెరాలు, స్టేషన్లలో సి.సి.టి.వి.లు ఏర్పాటు చేశారు.హైదరాబాద్ మెట్రోను గూగుల్ కు అనుసంధానం చేయనున్నారు. ఆర్టీసీ బస్సులకు, మెట్రో రైలు సర్వీస్లు అనుసంధానం చేశారు. మినీ బస్సులు ఏర్పాటు చేయడమేగాక ప్రత్యేకంగా బస్ బేలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో రైలుకు స్మార్ట్ కార్డ్, యాప్ ను రూపొందించారు. ప్రతి స్టేషన్ వద్ద 600 మీటర్ల పరిధిలో వైట్ టాపింగ్ రోడ్లు నిర్మించారు.

వేగం..సమయం ఆదా. కేటాయింపులు ఫుల్
మెట్రో రైలు గరిష్ట వేగాన్ని 90 కి.మీ. గా నిర్ణయించారు. రైళ్ల సగటు వేగం 34 కి.మీ.గా వుంది. మెట్రో రైలు ప్రయాణం ప్రయాణికుడికి 50-75% ప్రయాణ సమయాన్ని తగ్గిస్తున్నది. మెట్రో పర్యావరణ కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని తగిస్తుంది. 2018-19 బడ్జెట్లో మెట్రోకు రూ.600 కోట్లు కేటాయించారు. మన మెట్రోకు 50 కి మించి ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్న ఘనత హైదరాబాద్ మెట్రోరైలుకే దక్కింది. ప్రారంభానికి ముందే అవార్డులు అందుకోవడం విశేషం.
త్వరలో ఎల్బీనగర్ వరకు మెట్రో
అమీర్ పేట్ నుంచి ఎల్.బి.నగర్ (16 కి.మీ.) మార్గం పూర్తి కావచ్చింది. దీన్ని 2018 సెప్టెంబర్ నాటికి ప్రారంభించనున్నారు. ఈ మార్గాన్ని మంత్రి కేటీఆర్ 2018 జూన్ 20 న ట్రయల్ రన్ ప్రారంభించారు. నాగోల్ నుంచి ఎల్.బీ.నగర్ వరకు కూడా మెట్రో మార్గాన్ని అనుసంధానం చేస్తామని, దీన్ని ఫలక్‌నుమా వరకు పొడిగిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అలాగే,అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ (11 కి.మీ.) మార్గాన్ని త్వరలోపూర్తికానుంది. ఫేజ్ -2 లో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజిబిఎస్ (10 కి.మీ.) వరకు గల మార్గాన్ని 2019లో ప్రారంభించనున్నారు.

యాదాద్రికి ఎంఎంటీఎస్
వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవల విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎంఎంటీఎస్ రెండో దశను ఘట్‌కేసర్ నుంచి రాయగిరి (యాదాద్రి) వరకు 32 కిలో మీటర్లు పొడగింపుకై కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ అదనపులైన్ నిర్మాణానికిరూ.330 కోట్లు ఖర్చు కానున్నది.ఎంఎంటీఎస్‌కు సంబంధించి గతంలో ఉన్న ఒప్పందం ప్రకారం అయ్యే ఖర్చులో మూడింట రెండు వంతుల వాటాను(రూ.275 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం, మూడింట ఒకవంతు కేంద్రం (రూ.137 కోట్లు)భరించనుంది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేయనున్నారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు రాయగిరి వరకు పొడిగిస్తున్నారు. దీనివల్ల యాదాద్రి దేవస్థానానికి వెళ్లే యాత్రికులకు ప్రయాణం సులభమవుతుంది.

చర్లపల్లి, నాగులపల్లి కొత్త రైల్వే టర్మినల్స్
నగరంలో ఉన్న సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లపై వత్తిడీ విపరీతంగా పెరిగింది. పెరిగిన అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగర శివార్లలో మరో రెండు రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఔటర్ రింగు రోడ్డుకు సమీపంలో చర్లపల్లి, నాగులపల్లి జంక్షన్లు అభివృద్ధి చేయడానికి దక్షిణ మధ్య రైల్వేతో ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుంది. ఢిల్లీ, చెన్నై తదితర రూట్లకు చర్లపల్లి, ముంబాయి రూట్ కు నాగులపల్లి రైల్వే జంక్షన్లు అనుకూలంగా ఉంటాయి. వీటి వల్ల ప్రయాణీకులకు మంచి సౌకర్యం కలగడంతో పాటు, నగర ట్రాఫిక్ పై వత్తిడి తగ్గుతుంది. టెర్మినల్స్‌కు సంబంధించిన భూసేకరణ , తదితర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

710

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles