మూడేండ్లలో 540 పార్కుల అభివృద్ధి


Fri,August 10, 2018 12:39 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :హైదరాబాద్ అంటే పచ్చని వనాలు. వలసపాలనకు ముందు హైదరాబాద్ అంటే ప్రకృతి అందాలు. ఇక్కడ అడుగడుగునా ఓ ఉద్యానవనం తారసపడేది. నగరానికి ఇప్పుడా పూర్వవైభవం రానున్నది. నగరంలో 17మేజర్ పార్కులతో పాటు, థీమ్ పార్కులు, కాలనీ పార్కులు, రోడ్ల మధ్య సెంట్రల్ మీడియన్లు, వీధుల వెంబడి గ్రీన్‌కర్టెన్ గార్డెన్‌లు ఇలా వేలాది పార్కులను నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నది బల్దియా. కేవలం మూడేండ్ల కాలంలో గ్రేటర్ పరిధిలో 540 పార్కులను అభివృద్ధి చేసి నగరానికి హరితవర్ణమద్దింది. బయో డైవర్సిటీ పార్కులు, ట్రాఫిక్ ఐలాండ్‌లు, లేక్ పార్కులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. నగవాసులకు స్వచ్ఛమైన గాలిని అందించడంతో పాటు, నడక, వ్యాయామం కోసం కూడా ఈ ఉద్యానవనాలు ఉపయోగపడుతున్నాయి. తాజాగా హయత్‌నగర్ సర్కిల్‌లోని సచివాలయ నగర్ పార్కులో ఆక్యుపంక్చర్ ట్రాక్‌తో పంచతత్వ పార్కును ఏర్పాటు చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నది బల్దియా. కాళ్లు, కండరాల నొప్పులకు ఉపశమనం కలిగేలా వినూత్నరీతిలో ఈపార్కును అభివృద్ధి చేసినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది.

నగరం పచ్చదనంతో కళకళలాడుతున్నది. 17మేజర్ పార్కులతో పాటు కాలనీ పార్కులు, రోడ్ల మధ్య సెంట్రల్ మీడియన్లు, వీధుల వెంబడి గ్రీన్‌కర్టెన్ గార్డెన్‌ల వంటి వివిధ థీమ్ పార్కులతో నగరం హరిత వర్ణం పులుముకుంది. కాలనీ సంక్షేమ సంఘాలు, జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న దాదాపు 806 పార్కులతో అణువణువూ పచ్చదనం అలుముకుంది. జీహెచ్‌ఎంసీ గడిచిన మూడేండ్లలోనే 540 పార్కులను అభివృద్ధిచేయడం విశేషం. ఇరుకిరుకి గదులు, ఇంచు జాగా కూడా లేకుండా జరుగుతున్న నిర్మాణాల పుణ్యమా అని నగరవాసులకు స్వచ్ఛమైన గాలి కూడా దొరకకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ తనవంతు కర్తవ్యంగా ప్రభుత్వ ఖాళీ స్థలాలను కాపాడడంతోపాటు, వాటిల్లో పార్కులను అభివృద్ధిచేస్తున్నది. జీహెచ్‌ఎంసీ గ్రేటర్ పరిధిలో ఐదు ఎకరాలు, ఆపై విస్తీర్ణంగల 17 మేజర్ పార్కులను అభివృద్ధి చేసింది. 17థీమ్ పార్కులను, 806కాలనీ పార్కులను అభివృద్ధిచేశారు. పది బయోడైవర్శిటీ పార్కులు, 163 ట్రాఫిక్ ఐలాండ్‌లు, 15ైఫ్లెఓవర్ కింద పార్కులు, 36ప్రధాన వీధుల్లో గ్రీన్ కర్టెన్ పేరుతో ఇరువైపులా పచ్చదనాన్ని అభివృద్ధి చేశారు. 428 ట్రీ పార్కులు, 12 ఇన్‌స్టిట్యూషనల్ పార్కులు, 17 లేక్ పార్కులు, 20 శ్మశానాల్లో పార్కులు అభివృద్ది చేశారు. వివిధ ప్రాంతాల్లో రోడ్ల వెంబడి 4924 ఆర్నమెంటల్ పాట్‌లలో మొక్కలను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా ఆరు మేజర్ పార్కుల్లో ఓపెన్ ఎయిర్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే 32 నర్సరీలను అభివృద్ధి చేశారు. గడచిన మూడేండ్లలో (2014-17) జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మొత్తం 540కొత్త పార్కులను అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 234కాలనీ పార్కులు, ఒక బయోడైవర్శిటీ పార్కు, 14ట్రీ పార్కులు, 20 సెంట్రల్ మీడియన్‌లు, 20 గ్రీన్ కర్టెన్‌లు, మూడు ట్రాఫిక్ ఐలాండ్‌లు, నాలుగు ైఫ్లెఓవర్ కింద పార్కులు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ పార్కులు నగరవాసులకు స్వచ్ఛమైన గాలిని అందించడంతోపాటు ఉదయాన నడక, వ్యాయామం కోసం ఉపయోగపడుతున్నాయి.

పంచతత్వ పార్కు నిర్మాణం
కీళ్లు, కండరాల నొప్పులను ఉపశమనం కలిగే విధంగా వినూత్న రీతిలో పంచతత్వ పార్కును అభివృద్ధి చేసినట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. నీరు, కంకర, మెత్తని ఇసుక, దొడ్డు ఇసుక, మెత్తగా ఉండే బంకమట్టి, కట్టెపొడితో కూడిన వాకింగ్ ట్రాక్ దీని ప్రత్యేకత. వీటిపై నడిస్తే ఆక్యుపంక్చర్ చేసిన విధంగా ఉంటుందని, పంచతత్వ పదార్థాల వల్ల సరైన రీతిలో రక్త ప్రసరణకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. మానవ దేహం పంచభూతాలైన గాలి, నీరు, ఎండ, భూమి, ఆకాశంతో ప్రభావితమవుతుంది. సమస్త విశ్వం ఈ పంచ భూతాలతోనే నిండి ఉంది. ఈ పంచతత్వంతో కూడిన ప్రత్యేక వాకింగ్ ట్రాక్‌ను హయత్‌నగర్ సర్కిల్‌లోని సచివాలయనగర్ పార్కులో అభివృద్ధి చేశారు. కేవలం రూ. ఒక లక్షతోనే అతి తక్కువ విస్తీర్ణంలో ఈ ఆక్యు పంక్చర్ వాకింగ్ ట్రాక్‌ను రూపొందించారు. సీనియర్ సిటిజన్లు, ముఖ్యంగా కీళ్లనొప్పులతో బాధపడేవారికోసం ఏర్పాటు చేసిన ఈ వాకింగ్ ట్రాక్ మొదట కొద్దిదూరం నీటితో నింపి ఉంటుంది. నీరు అనంతరం కంకరతో కూడిన ట్రాక్, సముద్రపు సన్న ఇసుకతో కొద్దిదూరం, బటాని ఇసుకగా పిలిచే దొడ్డు ఇసుకతో మరికొద్దిదూరం, చెక్కపొట్టుతో కొంతదూరం, ఆ తరువాత బంకమట్టి లేదా ఎర్రమట్టి ఉంటుంది. సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పంచతత్వ పార్కును జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. చుట్టూ వాకింగ్‌ట్రాక్, మధ్యలో యోగముద్రతో ఉండే బుద్ధుని విగ్రహంతో పార్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన ఈ పంచతత్వ పార్కు మాదిరిగా నగరంలో మరిన్ని ఆక్యుపంక్చర్ వాకింగ్‌ట్రాక్‌లను ఏర్పాటుచేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు కమిషనర్‌వివరించారు.

లక్ష్యానికి మించి హరితహారం
హరితహారం విషయానికొస్తే, గడచిన మూడేళ్లలో లక్ష్యానికి మించి మొక్కలు నాటినట్లు అధికారులు చెబుతున్నారు. 2016-17లో 81లక్షల మొక్కలు లక్ష్యంకాగా, 84.91 లక్షలు నాటినట్లు వారు పేర్కొంటున్నారు. ఇందులో ఖాళీ స్థలాలు, శ్మశానాలు, చెరువుల్లో 2.11లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. 2017-18లో 76లక్షల మొక్కలు లక్ష్యం కాగా, లక్ష్యాన్ని చేరుకున్నట్లు వారు చెప్పారు. ఇక ప్రసుత 2018-19లో 40లక్షలు లక్ష్యం కాగా, అందులో 35లక్షలు ఇళ్లకు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూ పొందించినట్లు, మిగిలిన ఐదు లక్షలు రోడ్ల వెంబడి, ఖాళీ జాగాల్లో నాటనున్నట్లు అధికారులు వివరించారు.
hyd

481
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...