సేవలోనే ఆనందం


Fri,August 10, 2018 12:33 AM

సిటీబ్యూరో: సేవ చేయడంలోనే దొరికే ఆ సంతోషమే వేరు. మనం నలుగురికి ఉపయోగపడ్డా. మన ద్వారా కొందరికైనా న్యాయం చేకూరినా ఆ రోజు మన ముఖంలో ఉండే ఆనందమే వేరు అని అంటున్నారు హైదరాబాద్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ కొత్త వైస్ చైర్మన్ శ్రీవత్స కోట. జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన ఇటీవలే సొసైటీ బాధ్యతను స్వీకరించారు. అప్పగించిన ఏ పనినైనా కష్టపడి పనిచేయడం తనకు అలవాటని, రేయింబవళ్లు అన్న తేడాల్లేకుండా కష్టపడతానని, రాత్రి 9 గంటల వరకు ఆఫీసులోనే ఉన్న సందర్భాలెన్నోనని, కష్టాన్నే నమ్ముకోవడమే తనకు తెలిసిన విద్య అని అన్నారు. శ్రీవత్స కోటను గురువారం నమస్తే తెలంగాణ పలకరించగా, పలు విషయాలను వెల్లడించారు. ఆవేమిటో ఆయన మాటల్లోనే..

జిల్లాను మొదటిస్థానంలో నిలుపుతాం..
సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించేవారు ధన్యులు అన్న స్వామి వివేకానంద సూక్తియే నాకు మార్గదర్శనం. రెడ్‌క్రాస్ సంస్థ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. కానీ జిల్లాలో సొసైటీ కార్యకలాపాలు కొంత మందగించినట్లుగా మాకు సమాచారముంది. సొసైటీ తరఫున పెద్ద ఎత్తున కార్యకమాలను చేపట్టాల్సి ఉంది. కేవలం, ఆగస్టు15, జనవరి 26కు రక్తదాన శిబిరాలతో సరిపెట్టకుండా జిల్లా వాసులను సంపూర్ణంగా సేవలందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మొత్తంగా జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తాం.

మండలాలకు
సేవలను విస్తరిస్తాం..
జిల్లా వ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ సేవలను విస్తరించాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా మండల స్థాయిలోనూ శాఖలను ఏర్పాటు చేయాలని సూచించాం. ఆయా మండలాల తహసీల్దార్లు అధ్యక్షులుగా మండల కమిటీలను ఏర్పాటు చేయబోతున్నాం. ఈ కమిటీల ద్వారా ఆయా మండలాల్లోని వారికి వేగంగా సేవలందించేందుకు వీలవుతుంది.

విద్యార్థి దశ నుంచే..
విద్యార్థి దశ నుంచే సేవాతత్పరత, సంవేదనాతత్వాన్ని అలవర్చుకోవాలి. చిన్నప్పుడు పడ్డ పునాదులే వాస్తవిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇందుకోసమే రెడ్‌క్రాస్‌పై విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు సొసైటీలో సభ్యత్వమివ్వబోతున్నాం. జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ అధికారులను సమన్వయం చేసుకొని సభ్యత్వాన్ని పెంచబోతున్నాం.

ప్రభుత్వశాఖల్లో సభ్యత్వ డ్రైవ్..
జిల్లాలో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వారిలో చాలా మంది సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇలాంటి వారికి రెడ్‌క్రాస్ సొసైటీని మంచి వేదికగా చేయబోతున్నాం. అందరికీ భాగస్వామ్యం కల్పించబోతున్నాం. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా త్వరలోనే సభ్యత్వ డ్రైవ్‌ను నిర్వహించనున్నాం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులంతా సొసైటీలో సభ్యత్వం తీసుకునేలా చర్యలు చేపట్టనున్నాం.

252
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...