అన్నదాతకు అండగా...


Sun,July 22, 2018 11:46 PM

-కల్తీ విత్తన తయారీదారులపై ఉక్కుపాదం
-వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నిరంతరం తనిఖీలు
-రెండేండ్లలో 9 కేసులు.. ఇద్దరిపై పీడీయాక్ట్
-రైతును మోసం చేస్తే రౌడీషీట్ :సీపీ మహేశ్ భగవత్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కల్తీ విత్తనాలు, ఎరువుల తయారీదారులపై రాచకొండ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రైతన్నను అన్యాయం చేస్తే జైలు ఖాయమని హెచ్చరిస్తున్నారు. నిజాయితీగా పంటను పండించే రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులను సరఫరా చేస్తూ... మోసం చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నజర్ పెట్టారు. ఇందులో భాగంగా సంబంధిత వ్యవసాయ శాఖ సహాయంతో అక్రమ వ్యాపారం చేసే గోదాంలు, దుకాణాలపై తనిఖీలు చేపడుతున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో సోదాలు జరిపి దాదాపు ఇప్పటి వరకు 9 కేసులను నమోదు చేసి... దాదాపు రూ.3కోట్లకు పైగా కల్తీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ కల్తీలపై వ్యవసాయ శాఖ అధికారులు ఫిర్యాదు ఇస్తే వారిపై చీటింగ్ కేసులను నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నకిలీ విత్తన తయారీదారులపై పీడీ యాక్ట్‌ను కూడా విధించారు. ఇలా... వ్యవసాయ శాఖ అధికారులు, రాచకొండ పోలీసులు సంయుక్తంగా జరిపిన సోదాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలో చాలా వరకు నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలకు చెక్ పెట్టింది. రాచకొండ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లతో తెలంగాణతో పాటు బెంగళూరు, మహారాష్ట్ర, ఏపీ ప్రాంతాల్లో నకిలీ విత్తనాల బెడదను తీర్చింది. నకిలీ విత్తనాల గోదాములు, దుకాణాలను గుర్తించిన పోలీసులు పట్టుబడ్డ నిందితుల సమాచారంతో ప్రత్యేక డేటా బేస్‌ను రూపొందించుకుని వాటిపై నిరంతర పర్యవేక్షణను పెట్టారు. బ్రాండెడ్ ప్యాకెట్లలో కల్తీ విత్తనాలను నింపి విక్రయిస్తున్న ట్లు పోలీసుల తనిఖీల్లో తేలింది. ఇలా.. పోలీసులు రైతుకు అండగా ఉంటూ, వారికి భరోసా కల్పిస్తూ కల్తీ విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...