ఓయూ సెట్ సీట్ల జాబితా విడుదల


Sat,July 21, 2018 11:59 PM

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఓయూ సెట్ - 2018 సీట్ల కేటాయింపు జాబితాను అధికారులు శనివారం విడుదల చేశారు. ఈ జాబితాను ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మొత్తం 37 సబ్జెక్టులకు గాను సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని, వెబ్ అలాట్‌మెంట్ కూడా అయిపోయిందని ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. కిషన్ తెలిపారు. మొత్తం 28,800 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను ఎంచుకోగా, 17,500 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 15,800 మంది అభ్యర్థులు సీట్లు పొందారని పేర్కొన్నారు. బీఈడీ పరీక్షా ఫలితాలు ఇంకా విడుదల కానందున ఫలితాలు వెల్లడించిన తర్వాత, సెప్టెంబర్ చివర్లో ఎంఈడీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని, తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్ పొందవచ్చని వివరించారు. ఆర్డర్ పొందిన తర్వాత సంబంధిత కళాశాలలో 28వ తేదీలోగా రిపోర్ట్ చేయాలని సూచించారు. కళాశాలల్లో తరగతులు ఈ నెల 23వ తేదీ నుంచే ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రెండో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను వచ్చే నెల మొదటి వారంలో నిర్వహిస్తామని తెలిపారు. బీపీఈడీ ఫలితాలు విడుదల కానందున సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించని ఎంపీఈడీ కోర్సుతో పాటు, సీట్ల కంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తక్కువ ఉన్న కారణంగా ప్రవేశ పరీక్ష నిర్వహించని ఎంఏ కన్నడ, ఎంఏ మరాఠీ, ఎంఏ పర్షియన్, ఎంఏ థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు రెండో విడతలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారని వివరించారు. వాటితో పాటు పీజీ డిప్లొమా కోర్సులు, పీహెచ్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్పోర్ట్స్, క్యాప్, ఎన్‌ఐక్యూ కోటాల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా ఈ విడతలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఓయూ సెట్‌లో ఓయూతో పాటు పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ, తెలుగు యూనివర్సిటీల్లో ప్రవేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...