రూ.10 కోట్లతో ఫలక్‌నుమా కాలేజీ విస్తరణ


Sat,July 21, 2018 01:10 AM

-కేజీ టూ పీజీ విద్య వరకు అన్ని సౌకర్యాలు
-ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
-ఎమ్మెల్యే ఓవైసీ, ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌తో కళాశాల సందర్శన
చార్మినార్, జూలై 21: సువిశాలంగా సుమారు పది ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న కాలేజీ. కానీ సౌకర్యాల పరంగా అసమానతంగా ఉన్న ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి మనసు చలించింది. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పాతనగరంలో ఇక్కడి నుండే ప్రారంభించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను తగిన నివేదిక అందించాలని ఉన్నతాధికారులను అక్కడే ఆదేశించారు. స్వతహాగా లెక్చరర్ అయిన తనకు విద్యాకుసుమాలు ఎలా ఉంటాయో మరొకరు గుర్తు చేయాల్సిన అవసరం లేనందున అన్ని అంశాల్లో తాను లీనమై విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తానే స్వయంగా పరిశీలించారు. కాలేజీల్లోని ప్రతి తరగతి గదిలోకి స్వయంగా వెళ్తూ వారికి అందుతున్న సౌకర్యాలను తెలుసుకున్నారు. శుక్రవారం పాతనగరంలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ఫలక్‌నుమా కాలేజీని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిట్టల్‌తో కలిసి కాలేజీలో పర్యటించారు. 1934లో పాఠశాలగా ప్రారంభమై, అనంతరం కాలేజీ, డిగ్రీ కాలేజీగా రూపాంతరం చెందిన తీరును తెలుసుకున్నారు. కాలేజీ ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రైమరీ పాఠశాల, ఉన్నత పాఠశాల, కాలేజీ, డిగ్రీ కాలేజీల నిర్వహణ, విద్యార్థుల సంఖ్య, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై విద్యాశాఖ అధికారుల వద్ద వివరాలు సేకరించారు. పాఠశాల స్థాయి నుంచి మొదలుకొని డిగ్రీ కాలేజీ వరకు ప్రతి తరగతి గదిని పరిశీలిస్తూ విద్యార్థులతో సంభాషించారు.

తనకు అత్యంత ఇష్టమైన కెమిస్ట్రీ విభాగంపై కాలేజీ విద్యార్థులకు కొద్దిసేపు విద్యాబోధన చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం మాట్లాడుతూ పది ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఫలక్‌నుమా కాలేజీలో ప్రతి నిత్యం సూమారు 6 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని తెలిపారు. పురాతన భవనాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న తరుణంలో వాటిని నేలమట్టం చేసి కొత్త భవనాలను నిర్మించనున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కేజీ టూ పీజీ ఉచిత విద్య అందించడానికి అనుగుణంగా ఈ సముదాయాన్ని ఉపయోగిస్తామని తెలిపారు. ప్రభుత్వం సుమారు 3కోట్ల నిధులను కేటాయించగా, స్థానిక ఎమ్మెల్యే కోటిన్నర (1.5) నిధులను అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆ నిధులతో కొత్త కాలేజీ భవనాలతోపాటు కాలేజీ ప్రాంగణంలో విద్యార్థులకు అవసరమైన లైబ్రరీని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. కాలేజీ ప్రాంగణంలో జీహెచ్‌ఎంసీ 7 కోట్ల నిధులతో ఇండోర్‌స్టేడియం నిర్మాణాలను చేపట్టనుందని తెలిపారు. ఈ పనులను వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేసి పాతనగరంలో విద్యాహబ్‌గా ఫలక్‌నుమా కాలేజీని రూపొందిస్తామని తెలిపారు.

త్వరలోనే బదిలీ ప్రక్రియ పూర్తి..
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇప్పటికే వెబ్ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మంది ఉపాధ్యాయులను బదిలీ చేశామని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. విద్యార్థులకు సబ్జెక్ట్‌ల వారీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభు త్వం జాగ్రత్త వహిస్తూ విద్యా సంవత్సరాన్ని పూర్తి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్‌కుమార్,హైదరాబాద్ డీఈఓ వెంకటనర్సమ్మ, ఆర్డీఓ చంద్రకళ, విద్యాశాఖ చీఫ్ ఇంజినీర్ మల్లేశంతోపాటు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

223
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...