పరిశ్రమలు పవర్ ఫుల్

Fri,July 20, 2018 02:18 AM

-నిరంతర విద్యుత్‌తో పరిశ్రమలకు కొత్త కళ
-నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు
-జోరందుకున్న వ్యాపారాలు కేసీఆర్‌కు సర్వత్రా అభినందనలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నిరంతర విద్యుత్ సరఫరాతో పరిశ్రమలు పవర్‌ఫుల్‌గా మారుతున్నాయి. నిత్యావసరాల వస్తువుల తయారీ నుంచి ప్యాకింగ్ వరకు ప్రతి వస్తువు ఉత్పత్తికి విద్యుత్ తప్పనిసరి. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేయాలనే లక్ష్యంతోనే పాలనను ప్రారంభించింది. ఇంతటి గొప్ప కార్యాచరణను చేసుకొని ప్రజల ముందుకు వచ్చిన చరిత్ర టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే సొంతం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్యరూపం దాల్చేందుకు నిరంతరం శ్రమించింది. దీంతోనే తెలంగాణ రాష్ట్రంలోని కోట్లాది ప్రజల కండ్లల్లో కాంతులు కనిపిస్తున్నాయి.

12వేల మెగావాట్ల సరఫరాలో అంతరాయం లేదు
రాష్ట్రంలో ఒకప్పుడు 6000 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాలంటే అధికారులు భయాందోళనకు గురైన సంఘటనలు ఉన్నాయి. కానీ నేడు 12000 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడానికి అధికారులు ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో సుమారుగా 1700 మెగావాట్లుంటే నేడు 3300 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో విద్యుత్తు సరఫరా అయ్యే ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే మరమ్మతులు చేసి తీసుకువచ్చేందుకు రెండు రోజుల సమయం పట్టేదని రిటైర్డ్ విద్యుత్ శాఖాధికారులే వివరిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయినా, విద్యుత్ తీగలు, స్తంభాలు విరిగిపోయినా, ఫీడర్లు చెడిపోయినా వెంటనే విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గ్రేటర్‌లో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు, లైన్ల మార్పిడి, భూగర్భ విద్యుత్ లైన్లు, కవర్డ్ కండక్టర్లు ఏర్పాటు చేసి విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది.

ఆటోమెటిక్ రీస్టోరేషన్ ఏర్పాటుకు చర్యలు
మహానగరంలోని చిన్న, మధ్య తరగతి పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమలకు విద్యుత్ కోతలు లేకుండా ఉండేందుకు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం రూ.300 కోట్ల వ్యయంతో ప్రత్యేక పారిశ్రామిక ప్రాంతాల్లో ఆటోమెటిక్ రీస్టోరేషన్ ఆఫ్ పవర్‌సప్లయ్ చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించి, టెండర్లకు ఆహ్వానం పలికారు. ఇప్పటి వరకూ గ్రేటర్‌లో చిన్న, మధ్య తరగతి, భారీ పరిశ్రమలు ఉన్న ఐడీఏ బొల్లారం, నాచారం, కూకట్‌పల్లి, చర్లపల్లి ప్రాంతాల్లోనే ఎల్‌టీ, హెచ్‌టీ కనెక్షన్లున్నాయి. అయితే ఈ ప్రాంతంలోని పరిశ్రమ యాజమాన్యాలు గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. గత ప్రభుత్వాలు విద్యుత్ రంగంపై తీసుకున్న విధానాలతో పరిశ్రమలు మూతపడ్డాయి. వారంలో 4 రోజులు పవర్ హాలిడేలు ఇస్తే ఉత్పత్తి తగ్గడం, ధరలు పెరుగడం, ఉద్యోగులను తీసివేయడంతో పాటు యాజమాన్యాలు ఇబ్బందులు పడ్డ సంఘటనలు అనేకం. ఇబ్బందులు తీర్చడానికి సీఎం కేసీఆర్ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు అంతరాయం జరిగితే సమాచారం ఇస్తే విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా ఆటోమెటిక్ రీస్టోరేషన్ ఆఫ్ పవర్ సప్లయ్ పద్ధతిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
hyd
పుష్కలంగా కరెంట్..చేతినిండా పని...
కరెంట్ కోతలు లేకుండా పోయాయి, రియల్ రంగం ఊపందుకున్నది. వెల్డింగ్ పనులకు తీరికలేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు రుణ పడి ఉంటారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సఫలీకృతమైంది. గతంలో చేతి నిండ పని ఉన్నా....చేయడానికి కరెంట్ ఉండేదికాదు. దీంతో వచ్చిన ఆర్డర్లు సకాలంలో అందజేయలేక పోయా. ప్రస్తుతం పుష్కలంగా కరెంట్ ఉండడంతో చేతినిండా పని దొరుకుతున్నది.
-ఫకృద్దీన్, వెల్డింగ్ షాప్ నిర్వాహకుడు

మిల్క్‌బూత్‌లకు వరం
నగరంలో కరెంట్ కోతలు నివారించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం బాగా పనిచేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు నిదర్శనం విద్యుత్ సరఫరాయే ఉదాహరణగా తీసుకోవచ్చు. గతంలో ఎడాపెడా కరెంట్ కోతలు ఉండడంతో మిల్క్ బూతుల పరిస్థితి దయనీయంగా ఉండేది. దీంతో పాలు విరిగిపోయి నష్టపోయాం. ప్రస్తుతం ఎలాంటి కరెంట్ కోతలు లేక పోవడంతో మిల్క్ బూత్‌ల వ్యాపారం సవ్యంగా జరుగుతున్నది.
-దేవేందర్‌రెడ్డి, మిల్క్‌బూత్ నిర్వాహకుడు

పిండి మరలకు రెస్ట్ దొరకడం లేదు
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి రాష్ట్రంలో నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్నది. దీంతో రాష్ట్రంలోని అన్నీ వర్గాల ప్రజలకు అనువుగా ఉన్నది. ప్రధానంగా నగరంలో పండిగిర్నీలకు రెస్ట్‌లేకుండా పని లభిస్తున్నది. గతంలో పిండిగిర్నీల పరిస్థితి దారుణంగా ఉండేది. బ్యాంకు రుణాలు తెచ్చి గిర్నీ పెడితే నెలసరి వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులుండేవి. ప్రస్తుతం కరెంట్ కోతలు లేక పోవడంతో పిండిగిర్నీ వ్యాపారం బాగా జరుగుతున్నది.
-హరినాథ్‌బాబు, పిండిగిర్నీ నిర్వాహకుడు

బేకరీ వ్యాపారానికి అండ..
నగరంలో ప్రస్తుతం వ్యాపారాలన్నీ సజావుగా జరుగడానికి కరెంట్‌కోతల నివారణ ఒక్కటే ప్రధాన కారణం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా విద్యుత్ సరఫరాపై దృష్టి సారించడం వల్లే కోతలు లేకుండా పోయాయి. గతంలో విద్యుత్‌సరఫరా సక్రమంగా లేక పోవడంతో బేకరీ నిర్వహణలో నష్టం వాటిల్లింది. వినియోగదారులు వేడిగా ఉన్న ఆహారపదార్థాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరిచేవారు. కరెంట్ కోతల వల్ల గతంలో చాలా వరకు నష్టపోయా. ఇప్పుడు బేకరీల నిర్వహణ మెరుగుపడింది.
-ఉమేశ్ జైస్వాల్, బేకరీ నిర్వాహకుడు

పారిశ్రామికరంగాన్ని ఆదుకున్న ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నగరంలో నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నది. గతంలోని ఇబ్బందులు అన్నీ తొలిగిపోయాయి. పవర్ హాలిడేలు పోయాయి. నిరంతర విద్యుత్ అన్ని వర్గాల ప్రజలకు కడుపునిండా అన్నం పెడుతున్నది. పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. కార్మికులకు చేతినిండా పని దొరుకుతున్నది. చిన్న చిన్న పరిశ్రమలు సైతం నిత్యం పనితో బిజీబిజీగా గడుపుతున్నాయి. పారిశ్రామికరంగాన్ని ఆదుకున్న ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్.
-అంబటి సునీల్‌కుమార్, మైక్రోస్మాల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షుడు

ఉపాధి అవకాశాలు పెరిగాయి
నగరంలో నిరంతర విద్యుత్ సరఫరాతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. పక్క రాష్ర్టాల నుంచి నగరానికి వచ్చిన వారికి ఆసక్తి ఉన్న రంగంలో ఉద్యోగ అవకాశాలు విరివిగా దొరుకుతున్నాయి. పరిశ్రమలతో పాటు వాణిజ్య రంగంలో సైతం ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో అధిక శాతం ఇతర రాష్ర్టాల కార్మికులే పనిచేస్తున్నారు. దీనంతటికీ కారణం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండడమే.
-తోపన్, కార్మికుడు

వుడ్‌వర్క్‌కు గిరాకీ...
కరెంట్ కష్టాలు నయం కావడంతో వర్క్‌లోడ్ బాగా పెరిగింది. గతంలో సరైన విధంగా కరెంట్ సరఫరా లేక పోవడం కారణంగా పని ఉన్నా చేయలేకపోయేవాళ్లం. ఇప్పుడు తినడానికి కూడా తీరిక లేదు. వచ్చిన ఆర్డర్లను సకాలంలో అందజేయగలుగుతున్నాం. నగరంలో రియల్‌రంగం బాగా పుంజుకోవడతో నిరంతరాయంగా కరెంట్ సరఫరా అవుతుండడంతో కార్పెంటర్‌వర్క్ జోరుగా నడుస్తున్నది. చేతినిండా పని ఉంది, కరెంట్ ఉన్నా పనిచేయడానికి వర్కర్లు దొరకని పరిస్థితి నెలకొన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దూర దృష్టితోనే కరెంట్ కోతలు నివారించబడ్డాయి.
- భరత్, కార్పెంటర్, ఉడ్‌వర్క్ నిర్వాహకుడు

605

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles