ఆన్‌లైన్ పనులు

Fri,July 20, 2018 02:15 AM

-వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్
-జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో
-పేపర్‌లెస్ విధానం వారంలో ప్రారంభం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలోప్రతిపాదిత ఆన్‌లైన్, పేపర్ లెస్ విధానం వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నది. ఆన్‌లైన్ పద్ధతికి సంబంధించిన టాస్క్ ఎలక్ట్రానిక్ అసెస్‌మెంట్ అండ్ మానిటరింగ్ (టీఈఏఎం, టీమ్) విధానానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ సిద్ధం కావడంతో త్వరలో ప్రారంభించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఇది అమల్లోకొస్తే ఇంజినీరింగు పనుల్లో జవాబుదారీ ఏర్పడే అవకాశముంది. పౌరసేవలకు ప్రధాన కేంద్రమైన జీహెచ్‌ఎంసీలో నిత్యం రోడ్లు, ఫుట్‌పాత్‌లు, నాలాలు, ఫంక్షన్ హాళ్లు, మ్యాన్‌హోళ్లు, వివిధ రకాల భవనాలు తదితర అనేక రకాల నిర్మాణాలు జరుగుతుంటాయి. ఇలా ఏటా దాదాపు మూడు వేలకోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతుంటారు. ఇవికాకుండా వేలాది కోట్ల రూపాయల వ్యయంతో హౌసింగ్, ఎస్‌ఆర్‌డీపీ తదితర మేజర్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించిన ప్రక్రియంతా మాన్యువల్ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. దీంతో ఏ స్థాయిలోనూ పారదర్శకతకు అవకాశం లేకుండా ఉంది.

అధికార వికేంద్రీకరణ పుణ్యమా అని సర్కిళ్లు, జోన్లు, ప్రధాన కార్యాలయం ద్వారా విడివిడిగా పనులకు మంజూరీ ఇస్తుండగా ఏ స్థాయిలోనూ పనులకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉండడం లేదు. క్షేత్రస్థాయి సహాయ ఇంజినీర్ నిర్వహించాల్సిన మెజర్‌మెంట్ పుస్తకాలు (ఎంబీ) కాంట్రాక్టర్ల వద్ద పనిచేసే గుమస్తాలు నిర్వహిస్తుండగా, ఆడిట్ విభాగం సైతం అలంకారప్రాయంగా తయారైంది. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనానికి జవాబుదారీ లేకుండా పోయింది. నాసిరకం పనులు చేయడమే కాకుండా అసలు పనులు చేపట్టకుండానే బిల్లులు స్వాహా చేయడం పరిపాటిగా మారింది. ఇలా పరిస్థితి అదుపుతప్పిన నేపథ్యంలో మీడియా సహా అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎక్కువడంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టి అవినీతికి చెక్ పెట్టాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే ఈ విధానం అమల్లోకి రావా ల్సి ఉన్నప్పటికీ వివిధ సాంకేతిక కారణాలతో జాప్యం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ఆన్‌లైన్ విధానం కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడమే కాకుండా దాదాపు 700 మందికిపైగా ఇంజినీర్లకు ట్యాబ్‌లను సమకూర్చారు. ప్రతిపాదన దగ్గర్నుంచి బిల్లుల జారీ వరకు ఆన్‌లైన్‌లో చేపట్టాలని నిర్ణయించినప్పటికీ ప్రస్తుతానికి మొదటి దశలో పని ఒప్పందం ప్రక్రియ నుంచి మాత్రమే ఆన్‌లైన్ విధానాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. పని మొదలయ్యాక సంబంధిత ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తనిఖీ నివేదికలు ఆన్‌లైన్‌లో ఫొటోలతో సహా రికార్డు చేయాల్సి ఉంటుంది. నాణ్యతా పరీక్షలు సైతం శాస్త్రీయ పద్ధతుల్లో నమోదు చేసి ఆన్‌లైన్‌లో ఉంచాల్సి ఉంటుంది. ఇంజినీర్లకు సమకూర్చిన ట్యాబ్‌లను జియోట్యాగింగ్ చేస్తున్నందున తప్పనిసరిగా వారు క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షించక తప్పని పరిస్థితి ఉంటుంది. పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, ఆరోగ్యం తదితర ప్రధాన విభాగాల్లో ఇదివరకే ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టగా తాజాగా మరో ప్రధాన విభాగమైన ఇంజినీరింగ్‌ను సైతం ఆన్‌లైన్ పరిధిలోకి తెస్తుండటం విశేషం.

ఆన్‌లైన్ విధానంతో ప్రయోజనాలు..
-ఇష్టారాజ్యంగా ప్రతిపాదనలు చేసే వీలుండదు
-తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలి
-ఇంటి వద్ద కూర్చొని ఎంబీలు రాసే అవకాశం ఉండదు
-క్షేత్రస్థాయి వివరాలు ఫొటోల రూపంలో రికార్డు చేయాల్సి ఉంటుంది.

353

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles