ప్రభుత్వ విద్య బలోపేతానికి చర్యలు


Thu,July 19, 2018 04:15 AM

బంజారాహిల్స్, జూలై 18(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను మెరుగుపర్చేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, ఈ ప్రయత్నాలు ఫలితాలివ్వడం ప్రారంభించాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. నగరానికి చెందిన బద్రివిశాల్ పన్నాలాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 5వేల మంది విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్ సంక్షేమ సంఘం ఆవరణలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ట్రస్ట్ చైర్మన్ శరత్.బి.పిట్టీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహమూద్‌అలీ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన కేజీ టు పీజీ హామీలో భాగంగా ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 500పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన చేస్తున్నారన్నారు. విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులకు రూ.20లక్షల దాకా ఆర్థిక సాయాన్ని అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. పేద విద్యార్థులకు బద్రీవిశాల్ ట్రస్ట్ వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణను విద్యలో నంబర్ రాష్ట్రంగా చేసేందుకు సీఎం కేసీఆర్ అనుక్షణం తపిస్తున్నారన్నారు. విద్యకు ఎంత ఖర్చుచేసినా తక్కువే అని సీఎం అభిప్రాయపడుతుంటారని, విద్యార్థులపై పెట్టుబడి అంటే దేశాభివృద్ధికి పెట్టుబడి అన్నారు. సోషలిస్టు నాయకుడు, సామాజికవేత్త బద్రివిశాల్ పిట్టీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఏడాదికి రూ.3కోట్ల మేర సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నందుకు ట్రస్ట్ చైర్మన్ శరత్ పిట్టీని హోంమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు విజయ్‌కుమార్, నర్సింహారావు, ఆగర్వాల్ సేవాదళ్‌కు చెందిన రతన్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

184
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...