పేదలకు ఉచిత డయాలసిస్

Thu,July 19, 2018 04:15 AM

బంజారాహిల్స్,జూలై 18(నమస్తే తెలంగాణ): కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు నేమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డయాలసిస్ సేవలు అందించనున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఎర్రమంజిల్‌లోని ఎన్‌కేఎం గ్రాండ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. భగవాన్ మహావీర్ జైన్ సమాజ్ సహకారంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో అమలు చేయనున్న ఉచిత డయాలసిస్ సేవలను రోగులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. గత ఏడాదిన్నర కాలంగా బడి -గుడి, పెండ్లి కానుక, నేత్ర జ్యోతి తదితర కార్యక్రమాలను నేమి ఫౌండేషన్ ద్వారా చేస్తున్నామని, నియోజ కవర్గంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులు డయాలసిస్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నగరంలోని 5 కేంద్రాల ద్వారా ఉచితంగా డయాలసిస్ సేవలు అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నామని ఎమ్మెల్యే చింతల వివరించారు. ఎన్నిసార్లు అవసరమయితే అన్ని సార్లు ఉచితంగా డయాలసిస్ సేవలు అందించడంతో పాటు వారికి అవసరమయ్యే మందులను కూడా ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భగవాన్ మహావీర్ జైన్ సమాజ్ నగర చైర్మన్ నవరతన్ జైన్, పారస్‌జైన్, ప్రవీణ్ పాండ్యా, బీజేపీ నాయకులు రామన్‌గౌడ్, ప్రేమ్‌రాజ్, బంగారు ప్రశాంత్, మహిళా మోర్చా నాయకురాలు పల్లె వీణారెడ్డితో పాటు అన్ని డివిజన్ల అధ్యక్షులు రామ్‌నాథ్, శంకర్, చంద్రశేఖర్, నర్సింగ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

274

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles