పర్యావరణ రక్షణ అందరి బాధ్యత


Thu,July 12, 2018 01:13 AM

-సామాజిక స్పృహతోనే కాలుష్య నివారణ
- పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి
- మంత్రి కేటీఆర్
-రూ. 5 కోట్లతో బొటానికల్ గార్డెన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
శేరిలింగంపల్లి: మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే కాలుష్య నివారణ జరుగుతుందని అన్నారు. నగరంలోని కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌లో తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ. 5 కోట్లతో 12 ఎకరాల్లో అభివృద్ధి చేసిన సౌకర్యాలను బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బ్యాటరీ కారులో బొటానికల్ గార్డెన్‌లో పర్యటించారు. అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన జిమ్, పర్యావరణంపై విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించే దృశ్య శ్రవణ వికాస కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అటవీ సంరక్షణ, పచ్చదనం పెంచి భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. పట్టణీకరణ శరవేగంగా జరుగుతూ నగరాలు కాంక్రీట్ వనాలుగా మారుతున్నాయన్నారు. కొన్ని సర్వేల ప్రకారం గడిచిన 5 వేల సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి, పట్టణీకరణ జరిగిందో, రాబోయే 50 ఎండ్లలో అంతే స్థాయి పట్టణీకరణ జరుగనున్నదని పేర్కొంటున్నాయన్నారు. పట్టణీకరణతో ముందుగా దెబ్బతినేది పచ్చదనమని అన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లాంటి నగరాల్లో పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నదని తెలిపారు. ప్రముఖ మెర్సిన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం నిర్వహించే అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నివాసయోగ్య పట్టణాల జాబితాలో దేశంలోనే హైదరాబాద్ ప్రథమ స్థానంలో గత నాలుగు సంవత్సరాలుగా నిలుస్తున్నదన్నారు. అటవీ శాఖ, మున్సిపల్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలు సంయుక్తంగా హైదరాబాద్ చుట్టూ 100 పైచిలుకు అర్బన్ ఫారెస్టు బ్లాకులను పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. వాటిలో ఇప్పటికే దాదాపు 10 పూర్తి చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన కండ్లకోయ, శంషాబాద్, నారపల్లి లాంటి పరిసరాల్లో లక్షా యాభై వేల ఎకరాల అటవీ భూములు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయన్నారు. రాబోయే ఎన్నికల గురించి ఆలోచించే వాడు రాజకీయ నాయకుడు, రాబోయే తరాల గురించి ఆలోచన చేసేవాడు రాజనీతిజ్ఙుడని, అలాంటి ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం మొక్కలు పెంచడం కాదని అనేక కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని పేర్కొన్నారు.

నగరంలోని 185కు పైగా చెరువులు, కుంటలను శుద్ధి చేసే పనులు సాగుతున్నాయన్నారు. మొదటి దశలో ఔటర్ రింగ్‌రోడ్డు లోపల జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 20 చెరువులు, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మరో 20 చెరువులను శుద్ధీకరించి, సుందరీకరణ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ మిషన్ కాకతీయతో చెరువుల పరిరక్షణ, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల శుద్ధి కొనసాగుతుందన్నారు. దుర్గం చెరువుతో త్వరలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. నగరంలో 2000 ఎంఎల్‌డీల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని, వాటలో 700 ఎంఎల్‌డీలు ఎస్టీపీ ప్లాంట్‌ల ద్వారా శుద్ధి చేస్తున్నారని తెలిపారు. మిగతావి శుద్ధి చేయాలని ఆదేశాలు ఇచ్చారని త్వరలో పనులు ప్రారంభిస్తారని తెలిపారు. నగరంలోని 4 లక్షల పైగా ఉన్న వీధి దీపాలు మార్చి ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారని తెలిపారు. దీంతో ప్రతి సంవత్సరం రూ. 100 కోట్లు జీహెచ్‌ఎంసీకి ఆదా అవుతున్నాయని వివరించారు. జీహెచ్‌ఎంసీతో పాటు అన్ని ప్రాంతాల్లో ఎల్‌ఈడీలు ఏర్పాటు చేయడంతో 55 శాతం విద్యుత్‌ను ఆదా చేస్తున్నారని అన్నారు. బొటానికల్ గార్డెన్‌ను అహ్లాదకరంగా అందంగా తీర్చిదిద్దిన తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ అధికారులను అభినందించారు.

న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ స్థాయి దిశగా మొదటి అడుగులు వేస్తున్నారని కొనియాడారు. సంప్రదాయేతర ఇంధన వనరులను సమకూర్చుకొనే దిశగా బొటానికల్ గార్డెన్‌లో 30 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం అభినందనీయమన్నారు. 3300 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తితో తెలంగాణ దేశంలో మొన్నటి వరకు ప్రథమ స్థానంలో నిలిచి, ప్రస్తుతం రెండో స్థానంలో ఉందన్నారు. పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో 1700 ఎకరాల్లో ఉన్న ఎప్లూవెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు, అందులోంచి వచ్చే ద్రవ, ఘన వ్యర్థాల శుద్ధి కోసం 104 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉండే 1122 పరిశ్రమలను కాలుష్య కారక పరిశ్రమలుగా గుర్తించి, దశల వారీగా రింగ్‌రోడ్డు బయటకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చెరువులు, కుంటల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మొక్కలు పెంచడం కేవలం ప్రభుత్వ కార్యక్రమమన్నట్లు ప్రజల్లో, ప్రధానంగా సోషల్ మీడియాలో కొంతమంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కలు పెంచడాన్ని ఉద్యమ స్ఫూర్తితో తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగో విడుత హరితహారంలో 25 వేల మొక్కలు నాటే చర్యలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు. బొటానికల్ గార్డెన్‌లో ఎస్టీపీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, వెంటనే మంజూరు చేస్తానని అన్నారు. తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగు రామన్న, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రకాశ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, టీఎస్‌ఎఫ్‌డీసీ ఎండీ చందన్‌మిశ్రా, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాతాయాదవ్, వెస్ట్‌జోన్ కమిషనర్ హరిచందన, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత, హమీద్‌పటేల్ పాల్గొన్నారు.

159
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...