పిల్లల భద్రత.. అందరి బాధ్యత


Thu,July 12, 2018 01:05 AM

-విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉండాలి
-వాహనాల డ్రైవర్లపై నిఘా పెట్టాలి
-విద్యార్థులకు సామాజిక పరిజ్ఞానం అవసరం
- ఆ మూడు సినిమాలు చూపించాలి
-ప్రైవేట్ పాఠశాలలకు అవసరమైతే ఆర్టీసీ సేవలు
-అవగాహన సదస్సులో అధికారుల సూచన
సిటీబ్యూరో/తెలుగుయూనివర్సిటీ, నమస్తే తెలంగాణ : నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యాసంస్థల యాజమాన్యాలు, డ్రైవర్లు, తల్లిదండ్రులు సమన్వయంతో వ్యవహరించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. నగరంలోని విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులను తరలించే వాహనాల డ్రైవర్లు, తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ అధికారి అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో బుధవారం అవగాహన సదస్సు జరిగింది. సదస్సును ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సునీల్ శర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ యోగితారాణా, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట నర్సమ్మ, ఆర్టీఏ జేటీసీ పాండురంగానాయక్, ఆర్టీసీ ఈడీ పురుషోత్తం, ట్రాఫిక్ డీసీపీలు చౌహాన్, బాపూరావు తదితరులు హాజరయ్యారు. స్కూల్ విద్యార్థుల భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు. పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, వాహన డ్రైవర్లు, ఆయా వాహనాల యాజమాన్యాలు తీసుకోవాల్సిన భద్రత చర్యలతో పాటు సమాజంలోని ఇతరుల పాత్రపై ఆయా అధికారులు మాట్లాడారు. రోడ్డు భద్రత ఇప్పుడు ప్రధానమైన అంశమని, అలాగే చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల నుంచి కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అధికారులు పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీసీపీ చౌహాన్ రోడ్డు భద్రత నిబంధనలను వివరించారు. ప్రతి విద్యార్థికి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన ఉండాలని పేర్కొన్నారు.

ట్రాఫిక్ పోలీసులను పాఠశాలలకు ఆహ్వానించి విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్ ఆయా పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు. ఇటీవల చేపట్టిన డ్రైవ్‌లో 15 మంది స్కూల్ వాహనాల డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని, ఇది ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ సదస్సు తర్వాత పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాలల నిర్వాహకులు, ఆటో డ్రైవర్లు, అదనపు పోలీస్ కమిషనర్ దృష్టికి కొన్ని సందేహాలను తీసుకొచ్చారు. ఉదయం వేళల్లో పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఒకే సారి ఉండటంతో రోడ్లపై రద్దీ పెరుగుతున్నదని, సమయాల్లో కొన్ని మార్పులు చేయాలని కోరారు. మరికొందరు గతంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పాఠశాలలను కొనసాగించారని, అలా చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య ఉండదని అభిప్రాయ పడ్డారు. వీటిపై పరిశీలన జరుపుతామని ట్రాఫిక్ అధికారి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఈడీ పురుషోత్తం మాట్లాడుతూ పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు కోరితే.. విద్యార్థుల కోసం బస్సు ట్రిప్పులను వేసేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు. ఈ అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా పాఠశాలల యాజమాన్యాలపై ఒత్తిడి తేవాలన్నారు. నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ రోడ్డు భద్రత, పిల్లల రక్షణ అనేది అందరి బాధ్యత అన్నారు.

207
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...