ఇక సెల్లార్ కబ్జాల తొలగింపు

Thu,July 12, 2018 01:04 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఫుట్‌పాత్ ఆక్రమణల తొలిగింపు తరహాలోనే ఇక సెల్లార్లు, స్టిల్ట్ కబ్జాలను తొలిగించాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించింది. ఇందుకోసం వచ్చే రెండు వారాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా ప్రధాన మార్గాల్లో డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించిన అధికారులు, ఆయా మార్గాల్లో కబ్జాలకు గురైన స్టిల్ట్, సెల్లార్ల గుర్తించే పనిలోపడ్డారు.
భవన నిర్మాణ నిబంధనల ప్రకారం సెల్లార్, స్టిల్ట్‌ను పార్కింగ్ కోసమే ఉపయోగించాలి. అయితే నగరంలో చాలావరకు భవనాల్లో సెల్లార్లు, స్టిల్ట్‌ల్లో గోదాములు, దుకాణాలు కొనసాగుతున్నాయి. ప్రధాన రోడ్లపై ఉన్న సెల్లార్లు, స్టిల్ట్‌ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. వాణిజ్యానికి ఉపయోగించడం వల్ల ఎక్కువ లాభసాటిగా ఉండడం, అద్దెలు ఎక్కువగా రావడంతో పార్కింగ్ అవసరాలకు తిలోదకాలిచ్చి దుకాణాలు పెట్టేస్తున్నారు. దీనివల్ల ఆయా భవనాలకు వచ్చే వాహనాలను రోడ్లపై నిలపడం అనివార్యంగా మారుతున్నది. ఫలితంగా రోడ్లు ఎంత విస్తరిస్తున్నా రోడ్లపై వాహనాల పార్కింగ్ కారణంగా ప్రతిఫలం దక్కడంలేదు. తరుచూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ సాఫీగా సాగడంలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సెల్లార్లు, స్టిల్ట్‌ల కబ్జాలపై దృష్టి కేంద్రీకరించింది. ఫుట్‌పాత్ ఆక్రమణల తొలిగింపు డ్రైవ్ సత్ఫలితాలివ్వడంతో ఇక సెల్లార్లు, స్టిల్ట్‌ల కబ్జాల భరతంపట్టాలని నిర్ణయించింది. ముందుగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన మార్గాలపై డ్రైవ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కబ్జాలకు గురైన సెల్లార్లు, స్టిల్ట్‌లను గుర్తిస్తున్నారు. జాబితా రూపొందించి డ్రైవ్ నిర్వహించే తేదీలు ఖరారు చేస్తారు.
నోటీసులతో పనిలేకుండానే....
మంజూరైన ప్లాన్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలకు తాను బాధ్యుడినని పేర్కొంటూ అనుమతి పత్రం జారీ సందర్భంగా జీహెచ్‌ఎంసీ అధికారులు యజమానుల నుంచి హామీ పత్రం తీసుకుంటారు. దీని ప్రకారం ఎటువంటి నోటీసులు సైతం జారీ చేయకుండానే సెల్లార్, స్టిల్ట్ కబ్జాలను తొలిగించే అధికారం జీహెచ్‌ఎంసీకి చేకూరుతుంది. ఒకవేళ భవనానికి అసలు అనుమతులు లేనిపక్షంలో ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే తొలిగించే వీలుంది. అయినప్పటికీ ఆయా ఆక్రమణదారులకు నష్టం జరుగకుండా చూసే ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చి ఒకటి రెండు రోజుల గడువు ఇవ్వాలని భావిస్తున్నారు.
కష్టమైనా... మేలు జరిగే అవకాశం....
అద్దెల ఆశకు భవన యజమానులు సెల్లార్లను, స్టిల్ట్‌లను పూర్తిగా దుకాణాలుగా, గోదాములుగా మార్చేశారు. చాలాచోట్ల దుకాణాలు, హోటళ్లు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల నివాసం ఉంటున్నారు. ఇటువంటివి పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యమైన ప్రాంతాల్లో ఇటువంటి కబ్జాలు అధికంగా ఉన్నాయి. వీటిని తొలిగించడం వల్ల పార్కింగ్ సౌకర్యం ఏర్పడి రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు తగ్గే ఆస్కారం ఉంది. అయితే ఇవన్నీ తాత్కాలిక ఆక్రమణలు కాకపోవడంతో తొలిగింపు అంత తేలిక కాదని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ నిబంధనల ప్రకారం వీటి తొలగింపునకు కార్యప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

354

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles