ఒత్తిడికి లోనై... ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Sun,June 24, 2018 12:25 AM

చందానగర్, (నమస్తే తెలంగాణ): కళాశాలలో జరిగిన వీకెండ్ మెయిన్స్ పరీక్షల్లో అడ్మిషన్ నెంబర్ తప్పురాసానని కుంగిపోయిన ఓ విద్యార్థి రెండవ అంతస్తునుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుం ది. ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం, రామచంద్రాపురం గ్రామానికి చెందిన నాగా రామిరెడ్డి కుటుంబం 1994లో నగరానికి వలస వచ్చి కూకట్‌పల్లి వసంత్‌నగర్ కాలనీ హరిశ్రీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. నిఫ్టీ ల్యాబ్స్‌లో ఉద్యోగం చేస్తున్న నాగరామిరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు భీంరెడ్డి అభికుమార్ రెడ్డి(17) హైదర్‌నగర్ శ్రీచైతన్య కళాశాలలో ఇంట ర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ ఐపీఎల్ కోర్సు చేస్తున్నాడు. హాస్టల్‌లోని రెండవ అంతస్తు రూంనెం. 333లో ఆరుగురు స్నేహితులతో కలసి ఉంటున్నాడు. కాగా.. ఈ నెల 16న కళాశాలలో జరిగిన వీకెండ్ మెయిన్స్ పరీక్షలో అడ్మిషన్ నెంబర్ తప్పుగా రాశాడు. ఈ క్రమంలో అంతర్గతంగా కుంగిపోయాడు. కాగా... శనివారం ఉదయం 5 గంటల ప్రాం తంలో అభి హాస్టల్ భవనంపై నుంచి కిందికి దూకడంతో గాయలపాలయ్యాడు. వెంటనే అతడిని కూకట్‌పల్లిలోని ల్యాండ్ మార్క్ దవాఖానకు తరలించగా..అప్పటికే అభి మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.

ఇదిలా ఉండగా. అభి రూంలో మూడు పేజీల సూసైడ్‌నోట్ లభించింది. అందులో తాను వీకెండ్ మెయిన్స్‌లో అడ్మిషన్ నెంబర్ తప్పుగా రాశానని... దీంతో తన తండ్రికి చెడ్డపేరు వచ్చిందని.. అంతకు ముందు తాము నివసించే అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఓ గొడవ కారణంగా కూడా తండ్రికి చెడ్డ పేరు వచ్చిందని... తాజా ఘటనతో మరోసారి చెడ్డపేరు తెచ్చానని నెపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు.
కళాశాల ప్రిన్సిపాల్, యాజమాన్యమే కారణం
అభి ఆత్మహత్య చేసుకున్నట్టు లేఖలో పేర్కొనగా, ప్రిన్సిపాల్ నాగార్జున చౌదరి, కళాశాల యాజమాన్యం ఒత్తిడి వల్లే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడినట్టు నాగరామిరెడ్డి ఆరోపించారు. అడ్మిషన్ నెంబర్ తప్పురాసినందున తన కుమారుడిని ఉపాధ్యాయులు హేళన చేశారని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అభి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన ప్రిన్సిపాల్, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

224

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles