ధ్రువపత్రాలన్నీ సవ్యంగా ఉంటే.. గంటలోపే ఇంటి అనుమతి


Sat,June 23, 2018 12:24 AM

-ఆఫీసు మెట్లెక్కే అవసరం లేకుండా..
-ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్న బల్దియా
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మీ ధ్రువపత్రాలన్నీ సవ్యంగా ఉంటే.. ఇక గంటలోపే ఇంటి నిర్మాణానికి అనుమతి పొందవచ్చు. అవును.. గృహ అనుమతుల జారీలో వినూత్న మార్పులు రానున్నాయి. ఇందుకోసం బల్దియా ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రెండు నెలల్లో ఈ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే దేశంలో ఎక్కడాలేని విధంగా దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే అనుమతి ఇస్తున్న బల్దియా అధికారులు.. ఇప్పుడు వ్యక్తుల ప్రమేయం లేకుండా పూర్తి ఆన్‌లైన్ పద్ధతిని తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌తో పాటు అధికారిక లే అవుట్ల సమాచారం, ఇంటి నిర్మాణ నిబంధనలను ఈ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేయనున్నారు.

కార్యాలయం మెట్లు ఎక్కుకుండా, ఎవరినీ సంప్రదించకుండానే ఇంటి అనుమతి మంజూరు కావాలి. అని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జీహెచ్‌ఎంసీ అధికారులతో నిర్వహించిన మొదటి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ అన్న మాటలు ఇవి. వచ్చే రెండు నెలల్లో ముఖ్యమంత్రి ఆకాంక్షల ప్రకారం అనుమతులు జారీ చేసేందుకు జీహెచ్‌ఎంసీ సమాయత్తమవుతున్నది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ విధానం హైదరాబాద్‌లో విజయవంతమైతే రాష్ట్రమంతా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో 21 రోజుల్లో ఇంటి అనుమతులు జారీ అవుతుండగా, వెంటనే అనుమతి జారీ అయ్యే విధానం రానున్నది. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే గంటలోపే అనుమతి ఇస్తారు. ఈ విధానం అమల్లోకి వస్తే దేశంలో ఈ తరహా మొదటి మున్సిపల్ కార్పొరేషన్ మనదే అవుతుందని అధికారులు చెబుతున్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం..
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టౌన్‌ప్లానింగ్ విభాగంలో మితిమీరిన అవినీతి, అక్రమాలను సమూలంగా నిర్మూలించేందుకు జీహెచ్‌ఎంసీ ఇంటి అనుమతుల జారీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నది. ఇందులో భాగంగా డీపీఎంఎస్ విధానాన్ని చేపట్టి ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నారు. అయితే ఈ విధానంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు వివిధ స్థాయిల అధికారుల వద్దకు వెళ్తుండడంతో కొర్రీలు వేస్తూ జాప్యం చేసేందుకు ఆస్కారం ఉన్నది. కొర్రీలకు ఆస్కారం లేకుండా ఉండాలంటే వ్యక్తుల ప్రమేయాన్ని నివారించడమే మార్గమని ఓ నిర్ణయానికొచ్చారు. పూర్తిస్థాయి ఆన్‌లైన్ విధానం అమలుతోనే ఇది సాధ్యమవుతుందని నిర్ణయించిన అధికారులు దీనికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసే పనిలోపడ్డారు. అంతేకాదు, అధికారిక లేఔట్ల సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ఇటువంటివి గ్రేటర్ పరిధిలో సుమారు 1500 లేఔట్లు ఉంటాయని అంచనా.

మాస్టర్‌ప్లాన్‌తోపాటు అధికారిక లేఔట్ల సమాచారం, ఇంటి నిర్మాణ నిబంధనలను సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేస్తారు. ఒకవేళ ప్లాటు మాస్టర్‌ప్లాన్‌తో ప్రభావితమైన , లేక ఇంటి ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా వెంటనే కంప్యూటరే దరఖాస్తును తిరస్కరిస్తుంది. లేనిపక్షంలో ఫీజు ఇంటిమేషన్ లేఖ జనరేట్ అవుతుంది. ఇంటి నమూనాలు కూడా ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉంచేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాటు సైజు ఆధారంగా మనకు నచ్చిన నమూనాను ఎంపిక చేసుకొని దరఖాస్తుతో పాటు సమర్పిస్తే సాఫ్ట్‌వేర్ తిరస్కరించే ఆస్కారం ఉండదు. సాఫ్ట్‌వేర్ రూపకల్పన, అధికారిక లేఔట్ల వివరాల సేకరణ, ఆ వివరాలు సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేయడం, ట్రైల్న్ తదితర ప్రక్రియ కోసం నెలన్నర నుంచి రెండు నెలల సమయం పడుతుందని, వచ్చే ఆగస్టులో అధికారికంగా ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.

దశల వారీగా అన్ని లేఔట్లకూ..
ప్రస్తుతానికి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ద్వారా అనుమతించిన లేఔట్లకే తక్షణ ఇంటి అనుమతుల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ దశలవారీగా ఇతర లేఔట్లకు కూడా వర్తింపజేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎటువంటి వివాదాలులేని ప్రాంతాలు, ఎక్కువశాతం ప్లాట్లు క్రమబద్ధీకరణ జరిగిన లేఔట్లలో ఈ కొత్త విధానాన్ని అమలుచేయాలని యోచిస్తున్నారు. దీనికోసం ఆయా ఎంపిక చేసిన లేఔట్లను తమ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇలా క్రమక్రమంగా నగరంలోని అన్ని లేఔట్లను సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేస్తే ఇంటి అనుమతుల జారీలో పూర్తిస్థాయి పారదర్శకత వచ్చినట్లు అవుతుందని అధికారులు భరోసా వ్యక్తం చేస్తున్నారు.

తక్షణ ఇంటి అనుమతి ప్రక్రియ ఇలా....
ఇంటి అనుమతుల జారీకి ముందు ప్రధానంగా నాలుగు అంశాలను పరిశీలిస్తారు. అవి ప్లాటు యాజమాన్య హక్కులు(టైటిల్ డీడ్), సంబంధిత లేఔట్ జీహెచ్‌ఎంసీ, లేక హెచ్‌ఎండీఏ ద్వారా అనుమతులు జారీ అయినదా, లేదా?, ప్లాటు మాస్టర్ ప్లాన్‌కు లోబడి ఉందా, లేదా?, ఇంటి ప్లాన్ నిబంధనల ప్రకారం ఉందా, లేదా? అనే అంశాలు. ఇందులో మొదటి అంశానికి సంబంధించి యజమానే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండగా, రెండో అంశానికి సంబంధించి, స్థల యజమాని కానీ లేక ఆర్కిటెక్ట్ కానీ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన రెండు అంశాల పరిశీలనకు ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసిన సమాచారం ఆధారంగా ఆ సాఫ్ట్‌వేరే నిర్ణయిస్తుంది. దరఖాస్తుతో పాటు ఈ నాలుగు ధ్రువీపత్రాలు డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. పత్రాలు అన్నీ సవ్యంగా ఉంటే క్షణాల్లోనే ఫీజు ఇంటిమేషన్ లేఖ జనరేట్ అవుతుంది. నిర్ధ్దారిత ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే..ఆ వెంటనే అనుమతి పత్రం కూడా ఆన్‌లైన్‌లోనే జనరేట్ అవుతుంది. దాన్ని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పత్రాలన్నీ ముందుగా సిద్ధం చేసుకుంటే గంటలో ఈ ప్రక్రియంతా పూర్తవుతుంది. అనుమతి జారీ అయిన తరువాత వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించుకోవచ్చు. అయితే పక్షం రోజుల్లో సంబంధిత టౌన్‌ప్లానింగ్ అధికారి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి లేఔటు, మాస్టర్‌ప్లాన్, ఇంటి నమూనా తదితర అంశాలను పరిశీలిస్తారు. అన్నీ సవ్యంగా ఉంటే నిర్మాణానికి ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. లేనిపక్షంలో అనుమతిని రద్దు చేస్తారు.

411
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...