వెబ్ చానల్స్‌ను కట్టడి చేస్తాం..

Sat,June 23, 2018 12:22 AM

-దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ
చార్మినార్: సోషల్ మీడియాలతో పాటు వ్యక్తిగతంగా వెబ్ చానల్స్‌లను ఏర్పాటు చేస్తూ అధికార పనుల్లో జాప్యం జరిగే విధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ అధికారులకు, సామాన్య ప్రజలను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్న వెబ్ చానల్స్ కట్టడి కోసం చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల నేపధ్యంలో బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పాతనగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్ల వారీగా పలువురు ఇబ్బడి ముబ్బడిగా వెబ్ చానల్స్‌ను నెలకొల్పుతున్నారని తెలిపారు. వెబ్ చానెల్ ముసుగులో పోలీస్‌స్టేషన్ల వారీగా కేసులను గుర్తిస్తూ బాధితుల పక్షాన పోలీసులతో ఒప్పందాలు కుదుర్చుతామంటూ బాధితులకు గాలం వేస్తున్నారని తెలిపారు. బాధితులు సైతం సదరు వ్యక్తుల చేతుల్లో కెమెరాలను గమనించి , చానల్స్ రిపోర్టర్‌గా గుర్తిస్తున్నారని తెలిపారు. దీంతో బాధితులే సదరు వ్యక్తులు చెబుతున్నది నిజమేనని నమ్మి మోసపోతున్నారని చెప్పారు.

పోలీస్‌స్టేషన్‌లలో నమోదవుతున్న కేసుల్లో పోలీసుల సహకారం అందిస్తామని చెప్పి బాధితుల వద్ద నుంచి నగదును వసూళ్లు చేస్తున్నారని వివరించారు. వీరిపై అనేక ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో వారి కట్టడికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులను మోసాలకు గురి చేసే వారిని గుర్తిస్తూ వారిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కేసులు నమోదు జరిగిన తరువాత వాటిని తొలిగించే అవకాశం ఉండదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ప్రతి ఎఫ్‌ఐఆర్ ఆన్‌లైన్‌లో నమోదవుతున్న తరుణంలో నిజాలను గుర్తించాలని డీసీపీ సూచిస్తున్నారు.

388

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles