ఒక్కసారి చార్జింగ్ చేస్తే.. 140 కిలోమీటర్లు

Sat,June 23, 2018 12:21 AM

-మెట్రోకు అనుసంధానంగా బ్యాటరీ కార్లు
-గంటకు రూ. 40 కిరాయి
-జాప్ యాప్‌లో వివరాలు లభ్యం
-కారు సేవలను ప్రారంభించిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి
చందానగర్: తమ ప్రయాణికులను అంతిమ గమ్యానికి చేర్చేంత వరకు అవసరమైన సేవలు అందించడమే లక్ష్యమని మరోసారి రుజువు చేసింది హైదరాబాద్ మెట్రో రైల్. మియాపూర్ మెట్రో స్టేషన్‌లో శుక్రవారం బ్యాటరీ ఆధారిత కారు సేవలను మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్ అండ్‌టీ మెట్రో సీఓఓ అనిల్‌కుమార్ సైనీ, హెచ్‌ఎంఆర్‌ఎల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు, జూమ్ కార్ ఇండియా సీఓఓ సుదీంద్రరెడ్డి కలసి బ్యాటరీతో నడిచే మహీంద్ర ఈ2ఓ ప్లస్ కార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో కాలుష్యం పెరిగిపోతుందని, ఈ క్రమంలోనే రవాణా వ్యవస్థలో మార్పులు అవసరమన్నారు. గ్యాస్ చాంబర్లుగా మారిన ఢిల్లీలో నివసించే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైల్‌తో పాటు అనుబంధ సేవల్లో పర్యావరణం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.మెట్రో ట్రైన్ బ్రేక్ వేసినప్పుడు 45 శక్తి రిజనరేట్ అవుతుందన్నారు. జూమ్ కార్ వారి సహకారంతో బ్యాటరీ ఆధారిత కార్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. ఇందుకోసం పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

తద్వారా ప్రజలు బ్యాటరీ వాహనాలను యథేచ్ఛగా వాడుకునే వీలుంటుందని తెలిపారు. ఈ ప్రయోగాలు సత్ఫలితాలిస్తున్నాయని, భవిష్యత్తులో సొంతకారు కొనుక్కునే అవసరమే లేని పరిస్థితులు వస్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల చొరవతో రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని వెల్లడించారు. మల్టీలెవల్ పార్కింగ్‌ల కోసం నగరంలో నాలుగు 40 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. సాధారణ రీతిలో కాకుండా పూర్తి స్థాయి సౌకర్యాలతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మల్టీలెవల్ పార్కింగ్ భవనాలను నిర్మించాలని మంత్రి కేటీఆర్ సూచించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా మెట్రో స్టేషన్‌ల్లో లగేజీ కోసం ట్రాలీలను సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. అనిల్ కుమార్ సైనీ మాట్లాడుతూ ప్రైవేట్ వాహనాలతో కాలుష్యం గణనీయంగా పెరుగుతుందని, ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ ఆధారిత రవాణా సౌకర్యాలను ఎంచుకోవాలన్నారు. డీవీఎస్ రాజు మాట్లాడుతూ రూ.40 రూపాయలకే కారును గంట అద్దెకు ఇవ్వడం అద్భుతమన్నారు.

బ్యాటరీ కారు పనితీరు ఇలా...
జూమ్‌కార్ ప్రవేశ పెట్టిన బ్యాటరీ కారు మోడల్ మహీంద్ర ఈ2వో ప్లస్. నలుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. 15 వోల్టుల విద్యుత్‌తో బ్యాటరీని చార్జింజ్ చేసేందుకు ఎనిమిది గంటలు పడుతుంది. అందుకోసం 16 యూనిట్ల విద్యుత్తు కర్చవుతుంది. ఫాస్ట్ చార్చింగ్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక కిట్‌లను సైతం జూమ్‌కార్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో 90 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఈ2ఓ ప్లస్‌లో బ్యాటరీని ఒకసారి చార్జింగ్ 140 కి.మీ ప్రయాణించవచ్చు.

అద్దెకు ఇచ్చుకోండిలా...
జూమ్ కార్‌ను అద్దెకు తీసుకునే వారికి నెలరోజుల సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. నెలకు రూ.10 వేలు చెల్లించే కారు తమ వద్దే ఉంచుకోవచ్చు. అదేవిధంగా తమ అవసరం లేనప్పుడు అదే కారును వేరే వారికి అద్దెకు ఇచ్చుకోవచ్చు. శని, ఆదివారాల్లో ఖాళీ లభించినప్పుడు షేరింగ్ పద్ధతిలో వేరే వారికి అప్పగించవచ్చు. అలా చేసుకోవడంలో నెలవారీ చెల్లించే రూ.10 వేలలో సగం వరకు ఆదా చేసుకోవచ్చు. తమ అద్దెకు తీసుకునే కారును ఇతరులతో షేర్ చేసుకోవాలి అనుకునే వారు ZAP అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. జూమ్‌కార్‌వారు ఒకరు నెలపాటు బుక్ చేసుకున్న కారును కొంతదూరం లేదా కొన్ని రోజులు షేర్ చేసుకునేందుకు వీలుగా ఈ యాప్ ద్వారా అవకాశం కల్పిస్తారు. అద్దెకు తీసుకున్న వారు చెల్లించిన రుసుములో 25 శాతం వారు తీసుకొని 75 శాతం తిరిగి నెలవారీ అద్దె తీసుకున్న కస్టమర్‌కు చెల్లిస్తారు.

మొదటి విడుతగా 25 కార్లు...
హైదరాబాద్ మెట్రోతో కలిసి బ్యాటరీ కార్ సేవలకు మార్కెట్‌లోకి తెస్తున్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేలా సేవలు అందిస్తున్నాం. ఇతర సర్వీసుల్లో రూ.100 ఖర్చు అయ్యే ప్రయాణాన్ని జూమ్‌కార్ ద్వారా రూ.40కే పొందవచ్చు. మెట్రో ప్రయాణికుడు తమ గమ్యస్థానం చివరి వరకు సుఖవంతంగా చేర్చడమే జూమ్ కార్ లక్ష్యం. మొదటి విడుత కింద 25 కార్లను ప్రవేశపెట్టాం. త్వరలోనే ఈ సంఖ్యను 250కు చేరుస్తాం.
-సుదీంద్రరెడ్డి, జూమ్‌కార్ ఇండియా సీఓఓ

చాలా సౌకర్యవంతంగా ఉంది...
హైదరాబాద్ మెట్రోతో జూమ్ కార్ బ్యాటరీ ఆధారిత సేవలను అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉంది. మొదటి బ్యాటరీ కారును నడిపాను. చాలా సౌకర్యవంతంగా ఉంది.మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నా. ఈ ప్రయత్నం ఫలిస్తే త్వరలోనే అన్ని మెట్రో స్టేషన్లకు ఈ సేవలు విస్తరించేందుకు కృషి చేస్తాం.
-ఎన్‌వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ

ఉపయోగించుకోవడం ఇలా...
మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన బ్యాటరీ కారు సేవలను ఉపయోగించుకోవాలంటే జూమ్‌కార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. గంటకు రూ.40 చార్జ్ చేస్తారు. అయితే మినిమమ్ నాలుగు గంటల చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మియాపూర్‌తో పాటు మాదాపూర్‌లోని డీమార్ట్ వద్ద, ఐబీస్ హోటల్ వద్ద, ఫార్ములా 1 రెస్టారెంట్ వద్ద్ద, శంషాబాద్ ఎయిర్‌పోర్టుల్లో జూమ్ ఈ2వో పిక్ డ్రాప్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి.

630

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles