సంక్షేమ హాస్టళ్లలో మెనూ అమలు చేయాలి

Sat,June 23, 2018 12:21 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నిరుపేద విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న సంక్షేమ వసతి గృహాలపై జిల్లా రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. హాస్టళ్ల పనితీరును మెరుగుపర్చేందుకు కసరత్తు చేస్తున్న అధికారులు ఈ బాధ్యతలను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో ఉండే రెవెన్యూ సిబ్బందిచేత ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేలా చర్యలు చేపట్టారు. మండల పరిధిలో ఉండే వీఆర్వో, ఎంఆర్‌ఐలు సహా ఇతర రెవెన్యూ అధికారులచే హాస్టళ్లను, గురుకులాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ డా. యోగితారాణా ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ (ఆర్‌వోసీలో) ఆదేశాలిచ్చారు. తహసీల్దార్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున ఉదయం, సాయంత్రం పూట పరిశీలన జరిపి విద్యార్థులకిస్తున్న మెనూను పరిశీలించాలని ఆదేశాలిచ్చారు.

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో జిల్లాలో 147 వసతి గృహాలు నడుస్తున్నాయి. వీటిలో 25 వేల పైచిలుకు విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. కోట్లాది రూపాయలు పెట్టి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలను బలోపేతం చేయడంపై జిల్లా కలెక్టర్ డా. యోగితారాణా సహా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు విద్యార్థులకిచ్చే మెనూను పక్కాగా అమలు చేయడం, సురక్షితమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇన్నాళ్లుగా పర్యవేక్షణ లోపించడంతో హాస్టళ్లు, గురుకులాల్లో ఏం జరుగుతుందో తెలియని దయనీయ పరిస్థితిలో ఉన్నా యి. కనుక ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపడం ద్వారా సరిదిద్దవచ్చన్న నిర్ణయానికి వచ్చిన ఆమె రెవెన్యూ సిబ్బందిని పురమాయించి తనిఖీలు చేయించేందుకు ఆదేశాలిచ్చారు.

మెనూను ప్రదర్శించాల్సిందే..
సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థులకు పుష్టిగా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇటీవలే మెస్‌చార్జీలను గణనీయంగా పెంచడంతో విద్యార్థులకు తాజా ఆహారాన్ని అందిస్తున్నారు. 3-7వ తరగతి వరకు రూ. 750 నుంచి రూ.950కి, 8 - 10వ తరగతుల వారికి రూ.850 నుంచి రూ. 1,100వరకు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు రూ.1,050 నుంచి 1,400లను మెస్ చార్జీలుగా చెల్లిస్తున్నారు. ఇక గురుకులాల్లో 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.950, 8-9 విద్యార్థులకు నెలకు రూ.1,050, ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.1,400 డైట్ చార్జీలుగా చెల్లిస్తున్నారు. వీటితోపాటు 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకుంటున్నవారికి బాలుర ఒక్కరికి నెలకు రూ.50, బాలికలకు రూ. 55లు, 8వ తరగతి ఆపైన గల వారందరికీ రూ.75, ప్రతి బాలుడికి హెయిర్ కటింగ్ కోసం రూ.12 కాస్మోటిక్ చార్జీల కింద ఇస్తున్నారు. కానీ కొన్ని వసతి గృహాల్లో మెనూను ప్రదర్శించడం లేదని తెలుస్తున్నది. మెనూను ప్రదర్శిస్తే విద్యార్థులు ప్రశ్నించే అవకాశముంటుందని భావించి చాలా మంది వార్డెన్లు మెనూను ప్రదర్శించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై అధికారులకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని వసతి గృహాల్లో పిల్లలకు అందిస్తున్న ఆహారపు మెనూను తప్పకుండా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. మెనూ ప్రకారం పిల్లలకు ఆహారాన్ని అందించాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.

రూ.69 లక్షలతో మరమ్మతులు
సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న సంక్షేమ వసతిగృహాల దశ దిశను మార్చేందుకు పెద్దఎత్తున నిధులను కేటాయించారు. మొత్తంగా హాస్టళ్ల రూపురేఖలను మార్చేందుకు రూ.69లక్షల నిధులను ఖర్చు చేశారు. సొంత భవనాలతోపాటు అద్దె భవనాల్లో గల వసతి గృహాల్లో గత కొంతకాలంగా వీటిలో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. పిల్లల సంఖ్యకు తగినట్లుగా వసతులు లేకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న అధికారులు హాస్టళ్లల్లో మరమ్మతులు చేపట్టేందుకు నిధులు వెచ్చించి వేసవి సెలవుల్లోనే మరమ్మతులను పూర్తి చేసి అందంగా తీర్చిదిద్దారు.

322

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles