సురక్షిత నగరంగా తీర్చిదిద్దుదాం


Fri,June 22, 2018 01:43 AM

రవీంద్రభారతి : హైదరాబాద్ నగరాన్ని మహిళలకు వంద శాతం సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దుదామని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పిలుపునిచ్చారు. రవీంద్రభారతిలో హైదరాబాద్ పోలీసుశాఖకు చెందిన షీ టీమ్స్ ఆధ్వర్యంలో గురువారం ప్రజారవాణా వ్యవస్థలో మహిళల వేధింపులకు అరికట్టడానికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ మహిళలు వేధింపులకు గురికాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సదస్సులో హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, రోడ్డు భవనాలు,రవాణాశాఖల ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) శిఖా గోయల్, టీఎస్‌ఆర్‌టీసీ ఈడీ పురుషోత్తమరావు, డీసీపీ సత్యనారాయణ, డీసీపీ డీడీ అవినాష్ మొహంతి, క్రీడాకారిణి నైనా జైస్వాల్ తదితరులు అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రజారవాణాలో మహిళల వేధింపులకు వ్యతిరేకంగా రూపొందించిన డిజిటల్ లోగో, వీడియోను సీపీ అంజనీ కుమార్ ఆవిష్కరించగా పోస్టర్‌ను సునీల్ శర్మ,ఆడియోను ఎన్వీఎస్ రెడ్డిలు అతిథులతో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ నగరంలో 65 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, 140 పెట్రోలింగ్ వాహనాలు ఎల్లవేళల సిద్ధంగా ఉంటాయన్నారు. సమస్యలను వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేస్తే కొన్ని నిమిషాల్లో పోలీస్ వాహనాలు అక్కడకి చేరుకుంటాయన్నారు. పోలీసులు రూపొందించిన హాక్ ఐ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే పోలీసు సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. కాలనీలు, బస్తీల్లో నేరాలు అదుపుచేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. యువకులు పోలీసు శాఖలో చేరి సేవలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు అదనపు పోలీస్ కమిషనర్ శిఖా గోయల్ కార్యక్రమ నేపథ్యాన్ని వివరించారు. షీ టీమ్స్ మహిళల భద్రతకు అందిస్తున్న సేవల గురించి వివరించారు.మహిళలు నిర్భయంగా ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకుని సురక్షితంగా ప్రయాణించవచ్చని అన్నారు. ఈ అవగాహన సదస్సులో విద్యార్థినులు, ఆటో,క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు.

242
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...