ట్రేడింగ్‌తో చీటింగ్

Fri,June 22, 2018 01:43 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ విదేశి ట్రేడింగ్ వ్యాపారం పేరుతో బురిడీ కొట్టించిన గుజరాత్‌కు చెందిన సూరత్ ముఠాను మొదటి సారిగా సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. లాభాలను కేవలం కంప్యూటర్ స్క్రీన్ మీద చూపించి కోట్లు దండుకున్న ఈ ముఠా మూడేండ్లు ఈ దందాను కొనసాగిస్తున్నది. రాజేంద్రనగర్ ప్రాంతంలోని ఓ యువతి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఈ ముఠా గుట్టు బయటపడింది. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం...రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన శ్వేత తన స్నేహితురాలి ద్వారా ఫోరెక్స్ ట్రేడింగ్ ద్వారా భారీగా లాభాలు వస్తున్నాయని తెలుసుకుంది. ఆమె ద్వారా ఫోరెక్స్ ట్రేడింగ్ నిర్వాహకుడి ఫోన్ నెంబర్లు తీసుకొని అతనిని సంప్రదించింది. అతను వివరించినట్లు మొదట 1.92 లక్షలు ఇచ్చిన శ్వేతా దశల వారీగా 7.26 లక్షలను అతనికి హవాలా మార్గంలో చెల్లించింది. చివరకు వచ్చిన లాభాలను ఇవ్వమని అడగడంతో అతను శ్వేతా ఫోన్‌కు స్పందించలేదు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. సైబరాబాద్ డీసీపీ జానకీ సారథ్యంలో ఏసీపీలు చంద్రకాంత్, సీహెచ్‌వై శ్రీనివాస్ కుమార్ ఈ కేసు మిస్టరీని చేధించి గుజరాత్ సూరత్‌కు చెందిన షానవాజ అబ్దుల్ రహమాన్ లఖానీ, లొక్ పవార్, నిఖిత్ షెట్టీ, నవాజ్ అన్సారీలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13 లక్షల నగదు, ఆరు మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసులో కీలకాంశాలను గుర్తించి మొత్తం భాగోతాన్ని బయటపెట్టిన ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐ విజయవర్థన్, హెడ్ కానిస్టేబుల్ సిద్ధేశ్వర్, కానిస్టేబుళ్లు నందు యాదవ్, భరత్‌కుమార్‌ను సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు.

బురిడీ కొట్టించేది ఇలా...
స్నేహితురాలి ద్వారా ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి తెలుసుకున్న శ్వేత సూరత్‌కు చెందిన షానవాజ్ అబ్దుల్ రహమాన్ లఖానీని ఫంక్షన్‌లో సంప్రదించింది. దీంతో అతను పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు ఉంటాయని తెలిపారు. ఈ ఆన్‌లైన్ ఫోరెక్స్ ట్రేడింగ్ లావాదేవిలు మొత్తం డాలర్ కరెన్సీలో కొనసాగుతుందని చెప్పాడు. అయితే ఈ పెట్టుబడుల్లో లాభాలు వస్తే బ్యాంక్ ఖాతాల ద్వారా జరిపితే ఐటీ సమస్యలు ఉంటాయని కాబట్టి నగదును హవాలాలో పంపాలని సూచించాడు. ఈ మాటలను నమ్మిన శ్వేత మొదట 1.92 లక్షలను అతనికి పంపింది. లఖానీ వెంటనే శ్వేత పేరుతో అతను సొంతంగా రూపొందించుకున్న metatrader4 సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లో ఆమెకు ఖాతాను తెరిచి యూజర్ ఐడీ పాస్‌వార్డ్‌ను ఇచ్చాడు. దీని ద్వారా శ్వేత తన ఖాతాలో జరుగుతున్న లావాదేవిలను చూసుకుంటుంది. ఇలా ప్రతి రోజూ లఖానీ శ్వేత ఖాతాలో లాభాలు చూపిస్తూ మాయ చేశాడు. ఇది నిజమేనని నమ్మి శ్వేత దశల వారీగా 7.26 లక్షలను లఖానీకి 20 రోజులలో పంపించింది. చివరకు ఆమె ఖాతాలో 1.18 లక్షలు లాభాలు వచ్చినట్లు గుర్తించి వాటిని ఇచ్చేయాలని కోరింది. వెంటనే అతను శ్వేత ఖాతాను డిలీట్ చేసేసి ఫోన్‌లను ఎత్తకుండా తప్పించుకుంటున్నాడు. అనుమానం వచ్చిన శ్వేత ఫిర్యాదు చేయడంతో ఈ డొంకా కదిలింది.

మోసగాళ్ల దగ్గర పని చేసి మోసగాడిగా...
షానవాజ్ అబ్దుల్ రహమాన్ లఖానీ సూరత్‌లో డిగ్రీ వరకు చదివాడు. సూరత్‌లో కొంత మంది మోసగాళ్ల నిర్వహిస్తున్న ఆన్‌లైన్ ఫోరెక్స్ ట్రేడింగ్ కాల్ సెంటర్ కేంద్రంలో టెలికాలర్‌గా పని చేశాడు. ఇలా రెండు ఏండ్లు పని చేసిన లఖానీ స్నేహితులు అలోక్‌పవార్, నిఖిత షెట్టీ, నవాజ్ అన్సారీలతో కలిసి సొంతంగా ముంబయిలో ఆన్‌లైన్ ఫోరెక్స్ ట్రేడింగ్ కేంద్రాన్ని ప్రారంభించాడు.2014 సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా 120 మందిని కొల్లగొట్టి 5 కోట్ల రూపాయలను దోచుకున్నాడని తేలింది. అతను నిర్వహిస్తున్న కేంద్రంలో 15 మంది టెలికాలర్‌లను పెట్టుకొని ప్రతి రోజూ వేలాది మందికి ఫోన్‌ల ద్వారా గాలం వేస్తున్నాడు. దీని కోసం ఇండియా డేటాబేస్ సంస్థ నుంచి జాతీయ స్టాక్ ఎక్స్‌ఛేంజ్, ముంబయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఖాతాదారుల ఫోన్ నెంబర్‌లను కమీషన్ మీద కొనుగోలు చేసి వారిని లైన్‌లో పెడుతున్నారు. ఈ ముఠా ఎక్కువగా ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారిని టార్గెట్ చేసింది. తెలంగాణ నుంచి ఈ ముఠా బారిన ఇప్పటి వరకు ముగ్గురు ట్రాప్ అయినట్లు పోలీసులు గుర్తించారు.

314

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles