కథ కంచికి..పాప ఇంటికి


Fri,June 22, 2018 01:41 AM

మెహిదీపట్నం: పన్నెండు రోజుల కిందట అపహరణకు గురైన ఆరు నెలల పాప క్షేమంగా ఇంటికి చేరింది. పాప దొరుకుతుందో లేదో తెలియని ఆ దంపతులకు పోలీసులు తమ పరిశోధనాత్మక ప్రతిభతో తిరిగి పసికందును వారి దగ్గరకు చేర్చారు. పోలీసులు చూపిన ప్రతిభను పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ అభినందించారు. ఈ మేరకు పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ఏ ఆర్ శ్రీనివాస్,ఏసీపీ ఎ.విజయ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ వహీదుద్దీన్‌లతో కలిసి వివరాలను వెల్లడించారు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి చెందిన నాగమణి దంపతులు బేగంపేట్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న బ్రిడ్జి కింద సులభ్‌కాంప్లెక్స్ వద్ద నివసిస్తూ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు.వీరికి శిరీష అనే ఆరు నెలల పాప ఉంది. ఈ నెల 10న నాగమణి దంపతులు ఓ విషయంలో గొడవ పడుతూ తమ పాప గురించి పూర్తిగా మరిచిపోయారు. ఇదే అదునుగా భావించిన అగంతకులు పాపను ఎత్తుకెళ్లి పోయారు. ఈ విషయంపై దంపతులు 14న ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును తీసుకున్న ఇన్‌స్పెక్టర్ వహీదుద్దీన్ ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ,మహిళా కానిస్టేబుల్ నవనీతతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి కేసును ఛేదించే పనిలో పడ్డారు.

కారులో పాపను ఎత్తుకెళ్లారు.....
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట ఎంపీటీసీ భర్త ఉష పులిపాక శ్రీనివాస్‌కు ఆడపిల్ల కావాలని కమాన్‌పూర్ గోకుల్‌నగర్‌కు చెందిన గారెపల్లి తిరుపతి మంచిర్యాలకు చెందిన భూమయ్యకు చెప్పాడు. దీంతో భూమయ్య తమ జిల్లాకే చెందిన మందమర్రికి చెందిన నట్టా భవానికి చెప్పాడు. ప్రస్తుతం నగరంలోని సుచిత్ర ప్రాంతంలో నివసిస్తున్న భవాని, సనత్‌నగర్‌లో నివసిస్తున్న గుట్టల మధుసూదన్‌రావుతో కలిసి 10న పాపను బేగంపేట్ ప్రాంతంలో కిడ్నాప్ చేశారు. బేగంపేట్ ప్రాంతంలో కారులో వీరు పాపను తీసుకువెళ్తున్నట్లు పోలీసులకు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీ దొరికింది. దీని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు నిందితులు వాడిన కారుకు దొంగ నెంబరును పెట్టినట్లు తేలింది. కారు నెంబరు టీఎస్01ఎఎఫ్7898 కాగా, నిందితులు దీనిని ఏపీ16ఎవీ2829గా మార్చారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టగా నిందితులు మార్చిన నెంబర్ కారు ఏడుగురి చేతులు మారినట్లు తేలింది.

చివరగా కారు యజమానిని చేరుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు.పాపను కిడ్నాప్ చేసిన తర్వాత నాలుగు రోజుల వరకు భవాని, మధుసూదన్‌లు బయటకు తేలేదని,17న కమానపూర్ మండలం రాఘవపురానికి భూమయ్య సూచనల మేరకు వెళ్లి అక్కడ తిరుపతి, శ్రీనివాస్‌లకు కలిపి పాపను అప్పగించారు. 80వేల రూపాయలకు విక్రయించిన భవానితో శ్రీనివాస్ ఖాళీ బాండ్‌పేపర్ మీద సంతకం చేయించుకున్నాడు. గురువారం విశ్వసనీయ సమాచారంతో ఇన్‌స్పెక్టర్ వహీదుద్దీన్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి నిందితులను పటుకొని పాపను వారి వద్ద నుంచి రక్షించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు 80 వేల రూపాయలను, మారుతీ స్విఫ్ట్ కారును, ఐదు సెల్‌ఫోన్లను ,నెంబర్‌ప్లేట్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాపను యూసుఫ్‌గూడ శిశువిహార్‌కు తరలించామని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి పాపను అప్పగించడం జరుగుతుందని డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ తెలిపారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...