రైతులకు పంట రుణాలు అందించాలి

Wed,June 20, 2018 01:30 AM

-బ్యాంకర్లు టార్గెట్‌ను అధిగమించాలి
-గతేడాది కొన్ని బ్యాంకులు వ్యవహరించిన తీరుపై
-కలెక్టర్ అసహనం
-అధికారులు బీమాపై అవగాహన కల్పించాలి
-నకిలీ విత్తనాలను అడ్డుకునేందుకు నిఘా ఏర్పాటు
-బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ ఎంవీరెడ్డి
మేడ్చల్ కలెక్టరేట్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు సకాలంలో పంట రుణాలు అందించే పూర్తి బాధ్యత బ్యాంకర్లపై ఉందని కలెక్టర్ ఎంవీరెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, బ్యాంకు రుణాల మంజూరుపై కలెక్టర్ ఎంవీరెడ్డి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులు వరినాట్లు నాటుకోడానికి ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పని ముట్లు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. అదే విధంగా గతేడాదికి సంబంధించి పంట రుణాల మంజూరుపై మండలాలు, బ్యాంకుల వారీగా కలెక్టర్ సమీక్షించారు. కొన్ని బ్యాంకులు రైతు రుణాలు అందించడంలో విఫలమవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ సకాలంలో రైతులకు పంట రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల పని తీరును కలెక్టర్ అభినందించారు. జిల్లాలో బ్యాంకర్లు కేవలం వాణిజ్య పరంగా మాత్రమే కాకుండా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంతో తోడ్పడాలని అన్నారు. ఈ ఏడాదికి సంబంధించి బ్యాంకర్లు తమకు ఇచ్చిన టార్గెట్‌ను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా వరి, మొక్కజొన్న పంటలకు ప్రభుత్వం అందజేస్తున్న భీమా సౌకర్యంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్‌ఎల్‌బీసీలో నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోడానికి లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రత్యేక శ్రద్ద తీసుకొని పని చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో రైతుబంధు చెక్కులను నగదుగా మార్చి రైతులకు అందజేయడంలో బ్యాంకర్ల పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అదే విధంగా జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అవసరాలకు అనుగుణంగా రైతులు పంటలు పండించేలా అవగాహన తీసుకురావాలని తెలిపారు. కార్యక్ర మంలో ఎల్‌టీఎం భుజంగరావు, జిల్లా వ్యసాయాధికారి అజయ్‌కుమార్ గోష్, డీసీఓ శ్రీనివాసరావు, ఏడీఏ శోభారాణి, హర్టికల్చర్ ఏడీ సత్తార్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

251

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles