అరచేతిలో.. ఆరోగ్యం


Wed,June 20, 2018 01:28 AM

-బిజీబిజీ జీవితాలకు స్వాంతన
-మానసిక ఒత్తిడి దూరంఅనారోగ్యాలకు చెక్
-ఇంటిలోనే యోగా సాధనకు అవకాశం
-నగరవాసికి ఊరటనిస్తున్న యోగా యాప్‌లు
రసూల్‌పురా, నమస్తే తెలంగాణ: ఊపిరి సలపని బిజీ లైఫ్‌లో.. పగలు రాత్రి తేడాలేకుండా పోతున్నది. అలాంటప్పుడు ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు విడివిడిగా సమయాన్ని కేటాయించే వెసులుబాటు ఎక్కడుంటుంది? ఇంట్లోనే కాసేపు యోగా, ధ్యానం చేస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఫిట్‌నెస్ పెరగడంతో పాటు చక్కని ఆకృతి సొంతమవుతుంది. ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గడం, మెదడు పనితీరు పెరుగుతుంది. కాబట్టే యోగాకు ఆదరణ పెరుగుతున్నది. అయితే యోగాలో ఎన్నో రకాల ఆసనాలు ఉన్నాయి. వాటిని చూసి నేర్చుకుని సరైన పద్దతిలో చేయాలి. ఇలా అని, అందరికీ తరగతులకు వెళ్లి నేర్చుకునే తీరక ఉండదు. అందుకే వందల కొద్ది అసనాలు రకరకాల ధ్యాన ముద్రలను ఎలా వేయాలో తెలిపేందుకు రకరకాల యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.

యోగా.కామ్
యోగా.కామ్‌లో 290కి పైగా యోగా భంగిమలతో పాటు పలు ధ్యాన ముద్రలు కూడా ఉంటాయి. ప్రతి అసనాన్ని వీడియోలో చూసి నేర్చుకోవచ్చు. ఆ ఆసనం శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో తెలిపే త్రీడి విజువల్ కూడా ఉంటుంది. యోగాలో చేయాల్సిన, చేయకూడని పద్ధతులను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ యాప్‌ను ఇప్పటి వరకు కోటి మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకోవడం విశేషం.
బాబా రామ్‌దేవ్ యోగా యాప్
ఆరోగ్యకరమైన జీవనానికి, దృఢమైన శరీరానికి, వ్యాధుల నివారణకు రామ్‌దేవ్ బాబా చెప్పే రకరకాల యోగాసనాలు, ధ్యానముద్రలనూ నేర్చుకోవాలంటే ఈ ఫ్రీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో వేర్వేరు యోగాసనాలను, ప్రాణాయామాలను ఎలా చేయాలో వివరించే వీడియోలు, చిత్రాలు ఉంటాయి.
డెయిలీ యోగా.కామ్
సన్నబడటానికి, సరైన శరీరాకృతికి, నిద్ర బాగా పట్టడానికి, ఏకాగ్రత కుదరడానికి ఇలా మన అవసరాల్ని బట్టి రకరకాల యోగాసనాలు ప్రత్యేకమైన విభాగాలతో ఉండటం డెయిలీయోగా.కామ్ యాప్ ప్రత్యేకత. అంతే కాదు కొత్తగా యోగా నేర్చుకునే వారికి కాస్త సులభమైన అసనాలు ఉంటాయి. అనుభవం పెరుగుతున్న కొద్దీ శిక్షణ స్థాయి అంచెలంచలుగా పెరుగుతుంది.

సింప్లీ యోగా
రోజుకు మనం యోగాకు కేటాయించే సమయం ఇరువై నుంచి నలబై నిమిషాలు లేదా గంట. ఇలా దీంట్లో మూడు విభాగాలు ఉంటాయి. ఒక్కొక్క ఆసనం వేసే విధానాన్ని తెలియజేయడంతో పాటు ఆ భంగిమ ఎక్కడ కష్టంగా ఉంటుందో హెచ్చరిస్తూ దాన్ని సరిగ్గా ఎలా వేయాలో వివరిస్తుంది.
పాకెట్ యోగా
ఫోన్‌లో ఈ పాకెట్ యోగా యాప్‌ను ఆన్‌చేసి పెట్టుకుంటే ఒక్కో ఆసనానికి సంబంధించి వచ్చే యానిమేషన్ చిత్రాలు చూస్తూ సూచన వింటూ మనమూ ప్రయత్నించవచ్చు. దీంట్లో 27 తరగతులు, మూడు విభాగాలు, 200 భంగిమలు ఉంటాయి. ఏ ఆసనం వేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకోవచ్చు. మనకు సరిపోయే ఆసనాలను ఎంపిక చేసుకుని ప్రయత్నించవచ్చు.
యూనివర్సల్ బ్రీతింగ్ ప్రాణాయామం యాప్
రోజుకు పావుగంట ప్రాణయామం చేస్తే ఒత్తిడి, తలనొప్పి, ఉబ్బసం, బీపీ వంటి ఎన్నో సమస్యలకు దూరంగా ఉండవచ్చనేది నిపుణుల మాట. దీన్ని సరైన పద్దతిలో చేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. ప్రాణాయామ యాప్‌లో యానిమేటిడ్ వీడియో ద్వారా ఊపిరిని ఎలా పీల్చి ఎంతసేపు బిగపట్టాలి, తరువాత ఎలా వదలాలో అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ చూపిస్తుంది. దీంట్లో వెనుక నుంచి వినిపిస్తున్న సంగీతం ఉద్వాస, నిశ్వాసలకు తగ్గట్టు ఉండడంతో మనుసుకు హాయినిచ్చే అనుభూతి కలిగిస్తుంది.

185
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...